సార్వత్రిక భేరీ | general election nominations from today | Sakshi
Sakshi News home page

సార్వత్రిక భేరీ

Published Sat, Apr 12 2014 5:13 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

సార్వత్రిక భేరీ - Sakshi

సార్వత్రిక భేరీ

సాక్షి, కడప: నేటి నుంచి సార్వత్రిక సంరంభం ఊపందుకోనుంది. జిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంట్‌తో పాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించున్నారు. ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 7న పోలింగ్ ఉంటుంది. 23రోజుల పాటు ప్రధానరాజకీయపార్టీలన్నీ ప్రచారహోరుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నం కానున్నాయి.

 గతంలో ఎన్నడూ లేని విధంగా మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి వచ్చి రాజకీయపార్టీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పదిరోజుల తేడాతో అన్ని ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. తొలిపోరైన మునిసిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తూనే స్థానిక సంస్థలపై దృష్టిసారించాల్సిన అనివార్య పరిస్థితి రాజకీయపార్టీలకు తలెత్తింది.

 మునిసిపల్ ఎన్నికలు ముగియడంతో స్థానికపోరుపై దృష్టి సారించారు. ఈ నెల7తో 29మండలాల్లో స్థానికంలో తొలిఅంకం ముగిసింది. రెండో విడతలోని 21 మండలాల్లో శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. ఇక అన్ని పార్టీలు దృష్టి సారిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో 20,75,410 మంది జిల్లా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 
 నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

 
అభ్యర్థుల నామినేషన్ ఫారాలను ఈ నెల 12నుంచి 19వతేదీ వరకు ఉదయం 11 నుంచి 3గంటల వరకూ స్వీకరిస్తారు. 14, 18 తేదీలు సెలవు దినాలు.పార్లమెంటుకు సంబంధించి ఫారం-2ఏ, అసెంబ్లీకి సంబంధించి ఫారం2-బీలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. ప్రతి అభ్యర్థి నాలుగుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయొచ్చు. ఏ అభ్యర్థి అయినా రెండు పార్లమెంట్/అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచి నామినేషన్‌లు దాఖలు చేయకూడదు. నామినేషన్ పత్రాలకు ఏదైనా డాక్యుమెంట్ జతచేయాల్సి వస్తే, 19 మధ్యాహ్నం 3గంటల్లోపు రిటర్నింగ్ అధికారులకు అందజేయాలి.

రిటర్నింగ్ అధికారి కార్యాలయ ఆవరణలోకి అభ్యర్థులకు సంబంధించిన మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి సహా నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.నామినేషన్ ప్రతిపాదకుడు అదే నియోజకవర్గ ఓటరై ఉండాలి.స్వతంత్ర అభ్యర్థులకు పదిమంది ఓటర్లు ప్రతిపాదకులుగా ఉండాలి.నామినేషన్ దాఖలు చేసే వ్యక్తి ఆస్తులు, అప్పుల వివరాలను మనదేశంతో పాటు ఇతర దేశాల్లోని వాటిని కూడా పొందుపరచాలి.

స్వీకరించిన అన్ని నామినేషన్ పత్రాలను, సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అన్ని నామినేషన్ పత్రాల అఫిడవిట్‌లు సంబంధిత రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.నామినేషన్ ఫారం-5ద్వారా అభ్యర్థి సంతకంతో అతని ప్రతిపాదకుడి ద్వారా ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కోరుకునే మూడు గుర్తుల నుంచి ఒకదాన్ని కేటాయిస్తారు.ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలకు సంబంధించిన వివరాలు తెలుపుతారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement