శ్రీశైలంలో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం బుధవారం నాటికి 871 అడుగులకు చేరింది. జలాశయానికి కృష్ణ (జూరాల), తుంగభద్ర (రోజా గేజింగ్ పాయింట్) నదుల నుంచి 2,92,167 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పటికే జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 146 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 871.10 అడుగులుగా నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 21.91 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం జలాశయం నుంచి 44,048 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రెండు జలవిద్యుత్ కేంద్రాలలో 13 జనరేటర్లతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు.
జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో
హొస్పేట (కర్ణాటక), ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురిసిన వర్షాల ఆధారంగా వస్తున్న ఇన్‌ఫ్లో బుధవారం కాస్త పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,70,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 1,66,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 518.30 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు లక్షా 23వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా లక్షా 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 491.110 మీటర్లుగా ఉంది. జలాశయంలోకి లక్షా 34వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 88,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.