నిధులకు గ్రహణం | Funds eclipse | Sakshi
Sakshi News home page

నిధులకు గ్రహణం

Published Thu, Oct 17 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Funds eclipse

కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: రోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలపై శీతకన్ను వేయడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా నిధుల విషయంలో అనుసరిస్తున్న తీరు అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఆరోగ్యశ్రీ పథకం నిధులున్నా ఆసుపత్రికి అవసరమయ్యే పరికరాలు, మందుల కొనుగోలుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
 
 ఇదే సమయంలో వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపడం పక్కనపెడితే.. ఆసుపత్రికి రెగ్యులర్‌గా విడుదల చేసే నిధుల్లోనూ కోత పెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి అధికారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 2500 నుంచి 3వేల వరకు సీమ జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్, ప్రకాశం, బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. వీరితో పాటు నిత్యం 1200 మంది వరకు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ అన్ని రకాల ఆపరేషన్లు కలిపి 60 నుంచి 80 దాకా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ ద్వారా ఏటా రూ.కోటికి పైగా బడ్జెట్‌ను మందులకు కేటాయిస్తోంది.
 
 ఇదేకాకుండా స్టేట్ ఇల్‌నెస్ ఫండ్ పేరిట ఆరు విభాగాల దీర్ఘకాలిక వ్యాధుల రోగులకు ఉచితంగా మందులు ఇచ్చేందుకు నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. మందుల కొనుగోలుకు ప్రభుత్వం ప్రతి క్వార్టర్‌కు రూ.24,48,000 విడుదల చేస్తోంది. నాలుగేళ్లుగా కేవలం ఏడాదిలో రెండు క్వార్టర్ల బడ్జెట్ మాత్రమే ఇచ్చి, మిగిలినది ఎగ్గొడుతోంది. సర్జికల్స్ కొనుగోళ్లకు, నిర్వహణకు ఏటా కోటి రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా.. మూడేళ్ల నుంచి ఇందుకు సంబంధించిన బడ్జెట్ ఒక్క రూపాయీ విదల్చడం లేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిలో యూజర్ చార్జీలను వసూలు చేసేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ చార్జీలను రద్దు చేసి, ఆ స్థానంలో నిధులను విడుదల చేయడం ప్రారంభించారు. ఈ మేరకు ఏడాదికి రూ..60లక్షల నిధులు విడుదల కావాల్సి ఉండగా.. మొదటి రెండేళ్లు రూ.12లక్షలు ఇచ్చి, ఆ తర్వాత రెండేళ్లు నిధుల ఊసే మరవడం గమనార్హం.
 
 ఆరోగ్యశ్రీ నిధులున్నా
 ఖర్చు చేయలేని పరిస్థితి?
 రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆసుపత్రికి ఆదాయం సమకూరుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చే యూజర్ చార్జీలను, నిర్వహణ మొత్తాన్ని ఇవ్వకుండా దాటవేస్తోందన్న విమర్శలున్నాయి. ఆరోగ్యశ్రీ నిధుల్లో రివాల్వింగ్ ఫండ్ పేరిట నిధులను మినహాయించుకుంటున్నా ఆ మొత్తంతో ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, మందులు కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సమకూరిన నిధులు రూ.10కోట్ల దాకా మూల్గుతున్నాయి. గత రెండేళ్లుగా మందుల సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఈ నిధుల నుంచే అధికారులు కొనుగోలు చేశారు.
 
 ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా మందులను ఎందుకు కొన్నారంటూ, అది కూడా పరిమితికి మించి మందులు కొనుగోలు చేసే అధికారం మీకు లేదని ఆసుపత్రి అధికారులపై రాష్ట్ర ఉన్నతాధికారులు మండిపడినట్లు సమాచారం. అయితే నిధుల విడుదల సరిగ్గా లేకపోవడంతో ఆసుపత్రిలో మందులు, సర్జికల్స్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఆసుపత్రిలోనే రోగులకు మందులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా బయట ఉన్న మెడికల్ షాపులు మాత్రం కిటకిటలాడుతున్నాయి.
 
 మందులు, సర్జికల్స్ కొరత కార ణంగా వైద్యులు బయటకు రాస్తున్నారు. ఇటీవల వరుసగా మూడురోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉన్న ఐదు జనరేటర్లతోనే కేవలం అత్యవసర విభాగాలకు విద్యుత్‌ను సరఫరా చేయాల్సి వచ్చింది. ఆసుపత్రి మొత్తానికి జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయాలంటే రూ.60లక్షలు ఖర్చు పెట్టి జనరేటర్లు కొనాల్సి ఉంది. కానీ నిధులు ఖర్చు చేసే అధికారం ఆసుపత్రి అధికారులకు లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement