కాసులు లేకవిల విల | Funds or fluttering panchayats | Sakshi
Sakshi News home page

కాసులు లేకవిల విల

Published Sun, Sep 7 2014 1:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

కాసులు లేకవిల విల - Sakshi

కాసులు లేకవిల విల

  •  నిధులు లేక అల్లాడుతున్న పంచాయతీలు
  •  ఏడాది దాటినా విడుదల కాని ‘ఏకగ్రీవం’ సొమ్ము
  •  సకాలంలో రాని కేంద్ర, రాష్ట్ర నిధులు
  • రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం... స్మార్‌‌ట సిటీలు, మెగా సిటీలతో మొత్తం సీన్ మార్చేస్తాం.. ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మిస్తాం... ఆ విధంగా ముందుకు పోదాం అని హామీలిచ్చే నేతలు వెనుకబడుతున్న పల్లెలను పట్టించుకోవడం లేదు. నిధులు లేక పంచాయతీల్లో అభివృద్ధి అటకెక్కింది. ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించలేని దుస్థితిలో సర్పంచ్‌లు కొట్టుమిట్టాడుతున్నారు.  కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అంతంత మాత్రంగా నిధులు విడుదల చేస్తుండడంతో అవి ఏ మూలకూ చాలడం లేదు.
     
    విశాఖ రూరల్ :  రకరకాల హామీలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు పల్లెలను మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామ ఖజానాలు నిండుకున్నా.. ఆర్థికంగా ఆదుకొనే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాక.. పన్నులు సక్రమంగా వసూలు కాక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఏడాదైనా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో సర్పంచ్‌లు నామమాత్రంగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు.  ప్రతి గురువారం నిర్వహించాలని తలపెట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో తొలి వారమే స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీయడంతో అధికారులు కంగుతిన్నారు.
     
    ప్రత్యేక నిధులెక్కడ : జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది జూలైలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పటికి రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయలేదు. సాధారణంగా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఆ నిధులు తమ ఊరి అభివృద్ధికి దోహదపడతాయని ప్రజలు భావించడంతో 70 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు.

    వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉంది. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వాటిలో నోటిఫైడ్ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ దఫా ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు అదే పద్ధతిలో నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రత్యేక నిధులతో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని భావించిన వారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
     
    ఆదాయం అంతంత మాత్రమే


    ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు లేకపోవడంతో కొత్త సర్పంచ్‌లు కొలువు తీరాక భారీగా నిధులు వస్తాయని భావించారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు వృత్తి పన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15.78 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ రూ.1.3 కోట్లు, ఏజెన్సీకి రూ.4.2 కోట్లు మంజూరయ్యాయి. అయితే గత రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని, ఈ నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. పన్నుల ద్వారా కూడా ఆదాయం సక్రమంగా రావడం లేదు.

    2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లు పన్నులు రావాల్సి ఉండగా కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. దీంతో పంచాయతీలకు ఆదాయం లేక గ్రామాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement