ప్రజలకు మరింత చేరువగా..
♦ నేటి నుంచి గడప గడపకూ వైఎస్సార్ సీపీ
♦ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు..
♦ చంద్రబాబు సర్కారు వైఫల్యాలు ఎత్తిచూపనున్న నేతలు
♦ ఎన్నికల హామీలు అమలు చేయని పాలకులపై పోరాటం
♦ పాల్గొననున్న పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు
♦ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, క్షేత్రస్థారుులో బలోపేతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమరుుంది. ‘గడప గడపకూ వైఎస్సార్ సీపీ’ పేరుతో ఆ పార్టీ శ్రేణులు జనంతో మమేకం కానున్నారు. శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు ఇందులో పాల్గొననున్నారు. ప్రతిరోజూ నేతలు నియోజకవర్గాల వారీగా ఒక్కో గ్రామంలో గడప గడప నూ సందర్శిస్తారు.
టీడీపీ పాలనతో అక్రమాలు, దోపిడీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ఎన్నికల హామీలు అమలు చేయక మోసగించిన వైనాన్ని ప్రజలకు తెలియజెప్పనున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, మొక్కుబడి రుణమాఫీ తదితర అంశాలపై సర్కారును నిలదీసేలా ప్రజల్లో చైతన్యం కలిగించనున్నారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు దివంగత నేత వైఎస్ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును గుర్తు చేయనున్నారు. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా నేతలు ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాలకు చెందిన నేతలు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు నిచ్చారు.
ఒంగోలులో ఇందిరాకాలనీ నుంచి ప్రారంభం..
ఒంగోలు అర్బన్ : గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఒంగోలులో ప్రారంభిస్తారని పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బాలినేని ఒంగోలు చేరుకుంటారని, ఉదయం 9 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించే దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం నగరంలో పలుచోట్ల ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎఫ్‌సీఐ వద్ద ఉన్న ఇందిరాకాలనీ నుంచి గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని వివరించారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని కోరారు.