గల్లా హామీలన్నీ నీటి మూటలే
సుదీర్ఘ రాజకీయ అనుభవం, పదేళ్లు మంత్రిగా, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఎన్నికల సందర్భంగా హామీల వర్షం కురిపించి ఆ తర్వాత వాటిగురించి మరచిపోయారు. ప్రధానంగా మామిడి రైతులు ఉన్నారు. మ్యాంగోనగర్‌గా ఉన్న దామలచెరువు అభివృద్ధిని మరిచారు. మెరుగైన వైద్యం ప్రజలకు కలగా మారిపోయింది. కళ్యాణీ డ్యాంకు నీళ్లు తెప్పించి తీరుతానని హామీ ఇచ్చి పదేళ్లు అయినా నెరవేరలేదు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పట్టించుకున్నపాపాన పోలేదు.
కలగా 100 పడకల ఆస్పత్రి
చంద్రగిరి ప్రజలకు మెరుగైన వైద్యం కలగానే మిగిలిపోయింది. 2009 ఎన్నిక ల ప్రచారంలో భాగంగా పీఎల్‌ఆర్ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మూడు రోజుల్లో చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా ఆమె హామీని నెరవేర్చలేదు. స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా 100 పడకల ఆస్పత్రిగా మార్చలేదు. పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కూడా కల్పించలేదు. దామలచెరువు ప్రభుత్వ ఆస్పత్రిలో 6 సంవత్సరాలుగా వైద్యులు లేరు. ఓట్లేసి గెలిపించండి, గెలిచిన వారంలోపు డాక్టర్‌ను నియమిస్తానని 2009 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి హామీ ఇచ్చారు. గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోలేదు.
బీడీ కార్మికులకు అండ ఇలాగేనా...
చంద్రగిరిలో బీడీ కార్మికులకు గల్లా అరుణకుమారి పెద్ద ఎన్నికల వరం ప్రకటించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వం చేత బీడీలను కొనుగోలు చేసి లాభాల బాట పట్టిస్తానని చెప్పారు. గెలిచాక వారిని పట్టించుకోనేలేదు. అలాగే ఏనుగుల దాడుల్లో రైతులు పంటలు నష్టపోకుండా రంగంపేట, ఎర్రావారిపాళెం ప్రాంతాల్లో నెల రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని గతంలో చెప్పారు. దీనినీ ఇంతవరకు నెరవేర్చలేదు.
కొయ్యబొమ్మలకు లెసైన్స్..
చంద్రగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో కొయ్యబొమ్మలు తయారు చేసేవారు ఉన్నారు. తనను గెలిపిస్తే టీటీడీ చైర్మన్‌తో మాట్లాడి కొయ్యబొమ్మలను విక్రయించేందుకు తిరుమలలో లెసైన్స్ ఇప్పిస్తానని 2004లోనే చెప్పారు. మాట ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోలేదు.
డిగ్రీ కళాశాల పరిస్థితీ అంతే
చంద్రగిరిలో డిగ్రీ కళాశాల ఏర్పాటులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని గల్లా అరుణకుమారి హామీ ఇచ్చి 10 ఏళ్లు అవుతున్నా నెరవేరలేదు.
‘కల్యాణీ’ నీళ్లు మనకే..?
‘మన కల్యాణి డ్యాం నీళ్లు మనేకే సొంతం... మనకు ఇచ్చిన తరువాతే తిరుమలకు, తిరుపతికి’ అంటూ మూడు పర్యాయాల ఎన్నికల్లో గల్లా గట్టిగా చెప్పారు. కల్యాణీ డ్యాం నీళ్లు తెప్పించి తీరుతానని శపథం చేశారు. మాట ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పట్టించుకోలేదు. అలాగే చంద్రగిరి నుంచి శ్రీనివాస మంగాపురానికి వెళ్లే రోడ్డును నాలుగు లేన్‌లుగా తీర్చి దిద్దుతానని ఇచ్చిన ఎన్నికల హామీ నేటికీ అమలు కాలేదు.
మ్యాంగోనగర్‌ను మరిచారు
దామలచెరువు మ్యాంగోనగర్‌లో అగ్నిప్రమాదం జరిగి మండీలన్నీ కాలిపోయాయి. అక్కడికి వచ్చిన గల్లా అరుణకుమారి రైతులకు హామీల వర్షం కురిపించారు. శాశ్వత మండీలు కట్టిస్తానని చెప్పారు. ఇది కూడా నెరవేర్చలేదు. ఇలా ఆమె ఇచ్చిన హామీలు లెక్కలేననన్ని. అందుకే ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు గల్లా అరుణకుమారి మాటలను నమ్మడం లేదు.
అధ్వానంగా బస్టాండ్
చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా తయారైంది. కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు బస్టాండ్‌లోకి వెళ్లలేక పోతున్నారు. కుక్కలకు, పశువులకు నిలయంగా మారింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరి బస్టాండ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల హామీలో భాగం గా మాట ఇచ్చారు. నైట్ హాల్ట్ బస్సులు ఉంటాయన్నారు. ప్రతి బస్సు బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటానని ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదు.
టూరిజంహబ్‌చేస్తా
చంద్రగిరి కోటను టూరిజం హబ్‌గా మారుస్తానని గల్లా అరుణకుమారి మంత్రి హోదాలో రెండుసార్లు ప్రజలకు హామీ ఇచ్చారు. కోటలో ఆడిటోరియం నిర్మిస్తానన్నారు. నిత్యం ఇక్కడ కళా ప్రదర్శనలు జరిగేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇవేవీ జరగలేదు. అలాగే కాణిపాకం వెళ్లే ప్రతి బస్సునూ పాకాలలో వెలసిన సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి తీసుకొస్తానని హామీ ఇచ్చి విస్మరించారు.
పారిశుద్ధ్యం అధ్వానం
ఈ సారి గెలిపిస్తే చంద్రగిరిని ఆదర్శంగా తీరిచదిద్దుతానంటూ 2004, 2009 ఎన్నికల ముందు నుంచి గల్లా అరుణకుమారి వాగ్దానం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చంద్రగిరిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మురుగునీటి కాలువలు సరిగా లేవు. మూడుసార్లు మంత్రిగా ఉన్న గల్లా మురుగు కాలువుల నిర్మాణం, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదు.