తాండూరు,న్యూస్‌లైన్: తాండూరు పట్టణంలో తాజా గా మరో రెండు చోరీలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈనెల 20న ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి నివాసం ఎదురుగా కిరాణ వ్యాపారి చంద్రయ్య ఇంట్లో చోరీ చేసిన రోజు రాత్రే మరో రెండు ఇళ్లలోనూ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు ఇళ్లలో కలిపి రూ.90వేల నగదుతోపాటు రూ.12.5 తులాల బంగారు ఆభరణాలను దుండగలు అపహరించుకుపోయారు. మొత్తం సుమారు రూ.4.65లక్షల సొత్తు చోరీకి గురైంది. నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోట్ల రూ.11.65లక్షల సొత్తును దోచుకెళ్లారు.
మెకానిక్ ఇంట్లో...
పట్టణంలోని భవానీ నగర్‌లో నివసించే మహ్మద్ ఇస్మాయిల్ భార్య, కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 19న మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాలలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి ఇంటికి రాగా చోరీ జరిగినట్లు గుర్తించా రు. ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఉన్న మరో ద్వారం గొళ్లెం పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాలను పగులగొట్టి బట్టలన్నీ చిందరవందరగా పడేశారు. రూ.80వేల నగదు, 3.5 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.
కిరాణ వ్యాపారి ఇంట్లో...
పట్టణంలోని సాయిపూర్ యాదిరెడ్డి చౌక్ సమీపంలో నివసించే కిరాణ వ్యాపారి నరేందర్ ఈనెల 21న తన చిన్నకూతురు జన్మదిన వేడుకలను విశాఖపట్నంలో జరుపుకునేందుకు 19న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. దుండగులు ఇంటి ప్రధాన ద్వారానికి వేసిన తాళాన్ని పగుల కొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను పగులగొట్టి సుమారు 9తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు అపహరించుకుపోయారు. విశాఖపట్నం నుంచి నరేందర్ కుటుంబసభ్యులతో సోమవారం మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చే సరికి తాళం పగుల కొట్టి ఉండటంతో చోరీ వెలుగులోకి వచ్చింది. అర్భన్ సీఐ సుధీర్‌రెడ్డి, ఎస్‌ఐ రవికుమార్ చోరీల తీరును పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కిరాణ వ్యాపారి ఇంటి గేట్ వద్ద పోలీసులకు లభించిన లుంగీ, కువైట్ పేరుతో ఉన్న ఒక బాక్స్ తనవిగా మెకానిక్ ఇస్మాయిల్ గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విచారణ ప్రారంభం...
మూడు చోరీల తీరును పరిశీలిస్తే ఒకే విధంగా ఉండటంతో ఇది ఒకే దొంగల ముఠా పని అని పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటక దొంగల ముఠానే ఈ చోరీల కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈనెల 20 నుంచి పాత నేరస్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, సెల్‌ఫోన్‌లో ఎవరితో మాట్లాడారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దొంగల ముఠాకు స్థానికంగా సహకారం అందించడం వల్లే పక్కాగా తా ళం వేసి ఇళ్లలో చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
దొంగల ముఠా స్వైరవిహారం
Published Tue, Dec 24 2013 12:23 AM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM
Advertisement