సభ్యులపై దాడికి దిగిన మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్
కర్నూలు, బొమ్మలసత్రం: అధికార పార్టీకి చెందిన నంద్యాల మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ రెచ్చిపోయారు. కౌన్సిల్ సమావేశంలో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి.. వెకిలిచేష్టలతో వెగటు పుట్టించారు. చేతిలో ఉన్న మైకుతో ఏకంగా సభ్యులపై దాడికి యత్నించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా.. సభా సమయాన్ని వృథా చేస్తూ ఆయన ప్రవర్తించడంపై సభ్యులు మండిపడ్డారు. స్థానిక మునిసిపల్ కౌన్సిల్ హాలులో సోమవారంచైర్ పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ముందుగా జమ్మూ కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అజెండాను ప్రారంభించే ముందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ భవానీ ప్రసాద్‌ను పరిచయం చేశారు.
సమావేశం సజావుగా కొనసాగే సమయంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ చైర్‌పర్సన్ అనుమతి లేకుండానే లేచి నిలబడ్డారు. ‘మాట్లాడేది పూర్తయ్యిందా... అయ్యిందా?’ అంటూ వెకిలి చేష్టలతో కౌన్సిల్‌హాలు మధ్యలో నిలబడి హల్‌చల్ చేశారు. మధ్యలో లేచి మాట్లాడటం సభ్యత కాదని, సభ్యులకు సమాధానం చెప్పేటప్పుడుఅడ్డుతగలటం సరైన పద్ధతి కాదని చైర్‌పర్సన్ వారించినా వినలేదు. పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ అడ్డు తగులుతుండడంతో చైర్‌పర్సన్ సమావేశం మధ్యలోనే వెళ్లి పోయారు. తర్వాత వైస్‌చైర్మన్ అక్కడున్న సభ్యులను పరుష పదజాలంతో దూషిస్తూ అడ్డుపడిన వారిపై మైకు విసిరారు. రౌడీలా వ్యవహరించిన ఆయనతో వాదించలేక సభ్యులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంగిశెట్టి విజయ్‌కుమార్ గతంలో కూడా మహిళా కౌన్సిలర్‌లు ఉన్న వాట్సాప్ గ్రూపులో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. మరోసారి అనుచిత ప్రవర్తనతో హల్‌చల్ సృష్టించడం గమనార్హం.
సభాగౌరవం మంట కలుపుతున్నారు – శోభారాణి, కౌన్సిలర్
కౌన్సిల్ మీట్‌లో టీడీపీ సభ్యులు కావాలనే అడ్డు తగులుతున్నారు. గందరగోళం సృష్టిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా చేస్తున్నారు. సభా మర్యాదను పాటిస్తూ ప్రశ్నలు వేయకుండా..
ఇష్టానుసారం మధ్యలో నిలబడి ఏకవచనంతో సంబోధించటం సరైంది కాదు.
సభలో రాజకీయాలు పనికిరావు – దేశం సులోచన, చైర్‌పర్సన్
ప్రజలు ఎన్నుకున్నది వారి సమస్యల పరిష్కారం కోసం. కౌన్సిల్‌మీట్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదు. ఎదుటి వారు పార్టీలు మారారని విమర్శించే ముందు ఇప్పుడు టీడీపీలో ఉన్న వారంతా ఏపార్టీ గుర్తుతో గెలిచారో చెప్పాలి. సభలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదు. సభాసమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే బయటికి వచ్చేశా.
Comments
Please login to add a commentAdd a comment