'జీవితాలతో ఆడుకుంటున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంత విద్యార్థుల సమస్యల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థుల ఫలితాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. పరీక్ష అందరికీ నిర్వహించి ఫలితాల్లో వివక్ష చూపడం దారుణమని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగంలా వ్యవహరించడం లేదని విమర్శించారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, విభజన చట్టాన్ని పాటించడంలేదని ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థుల రికార్డులు అప్పగిస్తామని మంత్రి చెప్పినా అధికారులు రికార్డులు ఇవ్వలేదని తెలిపారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. జూలై 9 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్, 24 నుంచి పీజీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు.