గంటా తనయుడి వీరంగం | Ganta Srinivasa Rao Son racaused at shamshabad air port | Sakshi
Sakshi News home page

గంటా తనయుడి వీరంగం

Published Tue, Mar 18 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

గంటా తనయుడి వీరంగం

గంటా తనయుడి వీరంగం

 స్నేహితుడితో కలసి మద్యం మత్తులో దౌర్జన్యం
 టీడీపీ నేత గంటా కుమారుడి గలభా
 శంషాబాద్ విమానాశ్రయంలో ఘటన
 అరెస్టు .. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు
 నిందితులకు 14 రోజులు రిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ (22) సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరంగం సృష్టించాడు. తన స్నేహితుడైన ఇంద్రజిత్ (24)తో కలసి పుష్పక్ బస్సు కండక్టర్‌పై దౌర్జన్యం చేయడంతో పోలీసులు ఇరువురినీ అరెస్టు చేశారు. నిందితులను సోమవారం రాత్రి అత్తాపూర్‌లోని మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరు పరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. రాత్రి సమయం కావడంతో నిందితులను మేజిస్ట్రేట్ వద్ద నుంచి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం వారిని జైలుకు తరలించే అవకాశం ఉంది. ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణయ్య కథనం ప్రకారం ఘటన వివరాలివీ...
 
 రవితేజ తన స్నేహితుడైన ఇంద్రజిత్ (పంజగుట్టకు చెందిన వ్యాపారి శ్రీనివాసులు కుమారుడు)తో కలసి ఆదివారం అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజామున 2.30 సమయంలో మరోసారి మద్యం తాగాలని భావించారు. హోలీ నేపథ్యంలో నగరంలోని మద్యం దుకాణాలన్నీ మూసేయడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి ట్రాన్సిట్ ప్రీమియం ప్లాజాకు వెళ్లి మద్యం కావాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉన్న విషయం గుర్తించిన బార్ సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో బార్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రవితేజ, ఇంద్రజిత్ పరుష పదజాలంతో దూషించారు. తీవ్రస్థాయిలో గలభా సృష్టించిన తరవాత అక్కడ మద్యం తీసుకున్న ఇద్దరూ సమీపంలోని పుష్పక్ బస్టాప్ వద్దకు వెళ్లారు. మహిళా ప్రయాణికులు ఉన్నా పట్టించుకోకుండా మద్యం తాగుతూ నానా హంగామా చేశారు. ఇది గమనించిన కండక్టర్ రమేష్‌గౌడ్‌తో పాటు సిబ్బంది వచ్చి వీరిద్దరినీ వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఇంద్రజిత్ తన చేతికి ఉన్న కట్టును రమేష్‌గౌడ్‌కు చూపిస్తూ.. దానిపై ‘నీ పేరు రాయి’ అంటూ గద్దించాడు. పరిస్థితి చేయిదాటుతుండటంతో కండక్టర్ సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో  ఇరువురూ కండక్టర్‌ను దూషిస్తూ కాలర్ పట్టుకుని దాడికి యత్నించారు. రమేష్‌గౌడ్ ఫిర్యాదు చేయటంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. రవితేజ, ఇంద్రజిత్‌పై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement