- చివరి నిమిషంలో ఖరారు చేసిన బాబు
- మూడుకు చేరిన జిల్లా ప్రాతినిథ్యం
- టీడీపీ నేతల్లో హర్షం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీడీపీ నుంచి గరికపాటి మోహన్‌రావుకు రాజ్యసభ టికెట్ ఖరారైంది. ఆ పార్టీ నుంచి ఉన్న రెండు రాజ్యసభ ఎంపీ సీట్ల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ ముఖ్యనేతలతో పలుమార్లు తీవ్ర చర్చలు జరిపిన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం రాత్రి 11:30 గంటలకు తనకు కుడిభుజంగా ఉన్న గరికపాటివైపే మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారి సంఖ్య మూడుకు చేరింది.
కాంగ్రెస్ నుంచి రాపోలు ఆనందభాస్కర్, టీడీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణి రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతున్నారు. తాజాగా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన గరికపాటి మోహన్‌రావు రాజ్యసభకు ఎంపిక కావడం జిల్లా టీడీపీ నేతల్లో ఉత్తేజాన్ని నింపింది. గరికపాటి 1985లో టీడీపీలో చేరి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన శివాజీ ఉండగా.. అదే సామాజిక వర్గానికి చెందిన గరికపాటి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి చురుకైన నాయకుడిగా పనిచేస్తూ వచ్చారు.
టీడీపీలో పెను సంచలనం సృష్టించిన ఆగస్టు సంక్షోభ సమయంలో పార్టీ అధ్యక్షుడు శివాజీ... నాదెండ్ల భాస్కర్‌వర్గంలో చేరినా గరికపాటి మాత్రం ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. ఆ తదుపరి చంద్రబాబుకు కుడిభుజంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2013 వస్తున్నా.. మీకోసం యాత్ర ఇన్‌చార్జ్‌గా గరికపాటి వ్యవహరించారు. గరికపాటి పుట్టి పెరిగింది నర్సంపేట మండలం మహేశ్వరంలోనేనైనా మంగపేట మండలం కమలాపురంలో వ్యాపారంలో స్థిరపడ్డారు.
ములుగు నియోజకవర్గంతో అనుబంధం పెంచుకుని కమలాపురం ప్రస్థానంగా ఎదిగారు. పార్టీ తరఫున మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేశారు. గరికపాటికి రాజ్యసభ సీటు దక్కడంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి చెందిన నేతకు ఎంపీ పదవి రావడం వల్ల అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆమె అన్నారు.