గ్యాస్ బుకింగ్‌లో మాయ | Gas booking fraud | Sakshi
Sakshi News home page

గ్యాస్ బుకింగ్‌లో మాయ

Published Sun, Jun 15 2014 3:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

గ్యాస్ బుకింగ్‌లో మాయ - Sakshi

గ్యాస్ బుకింగ్‌లో మాయ

నెల్లూరు(పొగతోట): వినియోగదారులతో సంబంధం లేకుండా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి  బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే చందంగా గ్యాస్ ఏజెన్సీల పనితీరు మారింది. గ్యాస్ ఏజెన్సీలు, సిబ్బంది కుమ్మక్కై బుకింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
  ఏసీనగర్‌కు చెందిన సతీష్‌కుమార్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసేందుకు ఏజెన్సీ వద్దకెళ్లి ఈ విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. వేదాయపాళేనికి చెందిన మురళీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసేందుకు ఏజెన్సీ వద్దకెళ్లాడు. ‘మీరు పలానా తేదీన గ్యాస్ బుక్ చేశారు. పలానా తేదీన సిలిండర్ సరఫరా చేశారు’ అని ఏజెన్సీ వారు తెలపడంతో అవాక్కయ్యాడు. తమకు తెలియకుండా ఎవరు బుక్ చేశారని వారు ఏజెన్సీ సిబ్బంది ఎదుట ఆవేదన వ్యక్తం చేయడం మినహా ఏమీ చేయలేకపోయారు. రెండురోజుల్లో సిలిండర్ సరఫరా చేస్తామనడంతో వారు ఇంటిముఖం పట్టారు. ఇలాంటివి నిత్యం జరుగుతున్నాయి. వినియోగదారులకు సంబంధం లేకుండా ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ బుక్ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
 
 జిల్లాలో 4.90 లక్షల గ్యాస్ కనెక్షన్లు
 జిల్లాలో 43 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 4.90 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 3 లక్షలకు పైగా డబుల్ సిలిండర్లు ఉన్నాయి. మిగిలినవి సింగిల్ సిలిండర్లు. డబుల్ సిలిండర్లకు సంబంధించి 2 లక్షలకు పైగా చిన్న కుటుంబాల వారు ఉన్నారు. చిన్న కుటుంబాల వారు మూడు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేస్తారు. ఏడాదికి నాలుగు నుంచి ఐదు సిలిండర్లు వినియోగిస్తారు. రెండు నెలలకు, మూడు నెలలకు సిలిండర్ బుక్ చేసే వారి జాబితా ఏజెన్సీల వద్ద సిద్ధంగా ఉంటుంది.
 
 సొమ్ము చేసుకుంటున్న ఏజెన్సీలు
 బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర *1000 నుంచి *1100కు విక్రయిస్తున్నారు. సిబ్బందికి ఒక్కో సిలిండర్‌పై రెండు వందల దాకా మిగిలుతుంది. దీంతో ఈ తతంగం జోరుగా సాగుతోంది. వినియోగదారులు సిలిండర్ బుక్ చేయకపోయినా సిబ్బంది బుక్ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారులు వాదనకు దిగిన సమయంలో సిలిండర్ వెంటనే పంపిస్తామని చెప్పి విషయం పెద్దది కాకుండా జాగ్రత్త పడుతున్నారు. హోటల్స్, క్యాటరింగ్ సెంటర్లు, టిఫిన్ అంగళ్లలో గ్యాస్ వినియోగం అధికంగా ఉంది. వారు ఎంతకైనా సిలిండర్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో బుకింగ్ మాయాజాలం అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది.
 
 బ్లాక్‌మార్కెట్ ఇక్కడే ఎక్కువ
  నెల్లూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.
 
 నెల్లూరులో ముగ్గురాళ్లసందు, పప్పులవీధి, చిన్నబజార్, పెద్దబజార్,వేదాయపాళెం తదితర ప్రాంతాల్లో గ్యాస్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత వారంలో సివిల్‌సప్లై అధికారులు దాడులు నిర్వహించి పప్పులవీధి, ముగ్గురాళ్లసందులో దాడులు నిర్వహించి 60 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 20 మందిపై 6ఏ కేసులు నమోదు చేశారు. అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడం, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయకపోవడం వల్లే గ్యాస్ అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ విక్రయాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
 
 ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
 గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా విక్రయించే స్థావరాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు వందకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. 30 మందిపై 6ఏ కేసులు నమోదు చేశాం. వినియోగదారులతో సంబంధం లేకుండా గ్యాస్ బుక్ చేస్తే ఫిర్యాదు చేస్తే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం.                                                     
 -జె.శాంతకుమారి, డీఎస్‌ఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement