కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఇంట్లో గృహావసరాలకు ఉపయోగించే రాయితీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు నల్లబజారు నుంచి తరలుతున్నాయి. పౌర సరఫరాల అధికారులు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధి ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించినా తీరు మారడం లేదు. జిల్లాలో అధికారులు గత ఐదు నెలల్లో ఇప్పటి వరకు నాలుగు సార్లు దాడులు నిర్వహించి కేవలం 223 సిలిండర్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 179 మందిపై కేసులు నమోదు చేశారు.
తాజాగా సోమవా రం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసు లు నమోదు చేశారు. గ్యాస్ వినియోగదారులకు ఏడాదికి సరిపడా తొమ్మిది గ్యాస్ సిలిండర్లను మాత్రమే సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించి అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. బినామీ పేర్లతో గ్యాస్ కనెక్షన్లు పొందిన వారూ ఉన్నారు. కొత్తగా వచ్చిన నగదు బదిలీ పథకంలో ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసిన అధికారులు తనిఖీలు చేసినప్పుడల్లా అక్రమంగా వినియోగిస్తున్న సిలిండర్లు బయటకు వస్తున్నాయి.
75 వేలకుపైగా బోగస్..
జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1,29,600 ఉన్నాయి. ఒక్కో వినియోగదారునికి తొమ్మిది సిలిండర్లు సరఫరా చేసి సిలిండర్ల రాయితీని ప్రభుత్వం నేరుగా గ్యాస్ వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీని వల్ల రాయితీ సిలిండర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చన్నది ప్రభుత్వం ఉద్దేశం. కానీ ప్రభుత్వం ప్రకటించిన విధానంలో లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జూలై నెలలో చూస్తే జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం చేయడం వల్ల 75 వేలకుపైగా కనెక్షన్లు బోగస్‌గా గుర్తించబడ్డాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణా ప్రాంతాల్లో దీపం పథకం కింద మంజూరు చేయబడిన వారు గృహా అవసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నారు. దీనికితోడు ఒకరి పేరు మీదా దీపం గ్యాస్ కనెక్షన్ మంజూరైతే సదరు వ్యక్తులకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు సైతం బోగస్‌గా గుర్తించడం జరిగింది.
దాడులు ముమ్మరం చేస్తాం..
- వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎస్‌వో, ఆదిలాబాద్
గృహావసరాలకు వినియోగించే రాయితీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్‌కు వినియోగించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో అధికారులతో దాడులు నిర్వహిస్తాం. ముమ్మరంగా తనిఖీ చేసి దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తాం. హోటళ్లలో, ఇతర వాటికోసం వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లు ఇప్పటికే కొన్ని స్వాధీనం చేసుకున్నాం.