‘ధర’ణి మండుతోంది
సాక్షి, ఏలూరు:కూరగాయలు, సన్న బియ్యం, పాలు, సిమెంట్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పెం చిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. గ్యాస్ సిలిం డర్, కిరోసిన్ ధరలను ప్రతినెలా పెంచుతామని కేంద్రం ప్రకటిం చింది. ఇలా అన్ని రకాలుగా ప్రజల నెత్తిన మోయలేని ఆర్థిక భారం పడుతుంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
కూర ‘గాయాలే’
ఎండల కారణంగా కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.30, వంకాయ రూ.60, బీరకాయ రూ.50, బెండ రూ.40, దొండ రూ.24, క్యారట్ రూ.60, బీట్‌రూట్ రూ.40, బీన్స్ రూ.120, క్యాప్సికం రూ.60 పలుకుతున్నాయి. ఇవే కూరగాయలు నెల రోజుల క్రితం ఇప్పుడున్న ధరల్లో సగం ధరకే వచ్చేవి.
సన్న బియ్యం.. ధర ఘనం
సన్నబియ్యం (సోనా, బీపీటీ, పీఎల్) ధరలు సామాన్యుడు కొనేలా లేవు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.30 నుంచి రూ.35కే దొరికే సోనా రకం బియ్యం ధర రకాన్ని బట్టి రూ.40-రూ.50 మధ్య పలుకుతోంది. బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు వారివైపు కన్నెత్తి చూడటం లేదు. సాధారణ రకం బియ్యం ధరలు కూడా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకూ పెరిగాయి.
సిమెంటు, ఇసుక ధరలకు రెక్కలు
గుట్టలుగా నిల్వ చేసిన ఇసుకను వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఐదు యూనిట్ల లారీ ఇసుక రూ.20వేలు పలుకుతోంది. ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు ఉన్నప్పుడు యూనిట్ ధర కేవలం రూ.1,500 నుంచి రూ.2,000 ఉండేది. గతంలో బస్తా సిమెంటు రూ.200 ఉంటే ప్రస్తుతం రూ.300కు చేరింది. భవన నిర్మాణాలకు అనువైన కాలం కావడంతో డిమాం డ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగానే సరుకు కొని నిల్వచేసి ఇప్పుడు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
పాల ధరలూ పెరిగాయ్
వర్షాలు కురవకపోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. పాల ఉత్పత్తి తగ్గిపోయింది. కొరత కారణంగా పాల ధరలు పెరిగాయి. మొన్నటి వరకూ లీటరు పాలు రూ.42 ఉంటే ప్రస్తుతం రూ.46కు పెరిగింది. దీంతో పెరుగు, వెన్న ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరాభారాన్ని భరించలేక పేద, మధ్య తరగతి ప్రజలు పాలు, వాటి ఉప ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు.
సిలిం‘ఢర్’
గ్యాస్ సిలిండర్, కిరోసిన్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఇకపై ప్రతినెలా సిలిండర్‌పై రూ.5, కిరోసిన్‌పై రూ.1 చొప్పున పెంచుతామని ప్రకటించింది. విద్యుత్ కోతలతో రాత్రివేళ చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్న పేద ప్రజలకు కిరోసిన్ దీపమే ఆధారం. ఇకపై వారికి ఈ కాస్త వెలుగు దూరం కానుంది. గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్ మార్కెట్ బాటపట్టి అందనంత దూరంలో ఉంటున్నాయి. వీటి ధరల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. మూడు నెలల వరకూ ఈ నిర్ణయాన్ని అమలు చేయబోమని బుధవారం స్పష్టం చేసింది. ఆ తరువాత అరుునా ధరల మోత తప్పేట్టు లేదు.