జనం నెత్తిన గ్యాస్ బండ
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఓవైపు చమురు కంపెనీలు ఎడాపెడా చమురు, గ్యాస్ ధరలు పెంచుతూ వినియోగదారుడిని బాదేస్తూ, బాధిస్తూ ఉంటే, స్థానికంగా తామేం తక్కువ తిన్నామన్న చందంగా గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలను అతిక్రమించి మరింత భారం మోపుతున్నాయి. రవాణా చార్జీల పేరుతో వినియోగదారులందరి నుంచి రుసుము వసూలు చేస్తూ అయినకాడికి దోచుకుంటున్నాయి.
నిబంధనల ఉల్లంఘన : ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ ధర రూ. 402 ఉంది. సిలెండర్‌ను ఏజెన్సీ నుంచి ఐదు కిలోమీటర్ల లోపు వినియోగదారులకు అందజేస్తే ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీలు వీటిని ఖాతరు చేయడం లేదు. ఐదు కిలోమీటర్లకు లోబడి నివసిస్తున్న వారికి గ్యాస్ సరఫరా చేసినా ధరకు అదనంగా రూ. 22 వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి లెక్కిస్తే నర్సీపట్నంలో ఉన్న సుమారు 20 వేల మంది వినియోగదారుల నుంచి ప్రతి నెలా రూ. 4.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తూ అదనపు బారం మోపుతున్నారు.
కొత్త కనెక్షన్ కష్టాలు : వినియోగదారులెవరైనా కొత్తగా కనెక్షన్ తీసుకుంటే ఏజెన్సీ నిర్వాహకుల పంట పండినట్టే. తాము చెప్పే కంపెనీకి చెందిన స్టవ్‌ను, ఇతర సామగ్రిని కొంటేనే కనెక్షన్ ఇస్తామని షరతులు పెడుతున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా నిర్వాహకులు విధించిన షరతులకు లోబడి వస్తువులు కొనుగోలు చేసి కనెక్షన్ పొందాల్సి వస్తోంది. వినియోగదారుల సమస్యలను ఏజెన్సీలు పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలా వ్యవహరిస్తున్న ఓ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారుల సంఘం కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఇటీవల పెట్రోలియం సంస్థకు ఈ-మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు కూడా. మరి అధికారులు ఏ రీతిన స్పందించి సమస్యలు పరిష్కరిస్తారో చూడాలి.