గ్యాస్ గోదాములో ఘర్షణ | Gas warehouses clash | Sakshi
Sakshi News home page

గ్యాస్ గోదాములో ఘర్షణ

Published Tue, Nov 18 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

Gas warehouses clash

ఓజిలి: స్వల్ప విషయమై రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. సిలిండర్‌కు సంబంధించిన చిల్లర విషయంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, వినియోగదారులు ఘర్షణ పడ్డారు. తర్వాత ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ మరింత మంది తోడుకావడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓజిలిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన మైలాం దశరథరామిరెడ్డి, ఆయన బంధువు చామంత్‌రెడ్డి గ్యాస్ సిలిండర్ కోసం స్థానిక ఆర్‌ఆర్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లారు.

సిలిండర్‌కు సంబంధించి చిల్లర విషయంలో ఏజెన్సీ సిబ్బంది, చామంత్‌రెడ్డి మధ్య వాదులాట జరిగింది. విషయం తెలుసుకున్న చామంత్‌రెడ్డి తండ్రి ప్రసాద్‌రెడ్డి గ్యాస్ గోదాము వద్దకు చేరుకుని సిబ్బందితో ఘర్షణపడ్డారు. అక్కడి సామగ్రి, ఆటో కమ్ములు ధ్వంసం చేయడంతో పాటు సిబ్బంది కృష్ణయ్య, హరిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ప్రసాద్‌రెడ్డి తలకు తీవ్రగాయమైంది.

ఇంతలో విషయం తెలుసుకుని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, వారి బంధువులు సుమారు 100 మంది గోదాము వద్దకు చేరుకున్నారు. కాసేపటికి ఎస్సై శ్రీనివాసులురెడ్డి ఏజెన్సీ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారి వివరాలు సేకరించి ఇరువర్గాల వారిని మందలించి పంపారు.
 
 ఏజెన్సీ నిర్వాహకుడి బంధువు హల్‌చల్
 గొడవ సర్దుమణిగందనుకుంటున్న తరుణంలోనే ఏజెన్సీ నిర్వాహకుడు సోదరుడు జయరామయ్య గ్రామంలో గొడవ సృష్టించి హల్‌చల్ చేశారు. ఏజెన్సీలో జరిగిన ఘటనతో ఏ సంబంధం లేని మైలాం మధుసూదన్‌రెడ్డి, మైలాం సుధాకర్‌రెడ్డి ఇళ్ల వద్దకు వెళ్లి దుర్భాషలాడటంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు.

ఇదంతా హెడ్‌కానిస్టేబుల్ రమణయ్య, కానిస్టేబుల్ నాగేంద్ర సమక్షంలో జరగడం గమనార్హం. గొడవతో తమకు సంబంధం లేదని మధుసూదన్‌రెడ్డి మొత్తుకుంటున్నా వినకుండా వారిని పోలీసుస్టేషన్‌కు లాక్కొచ్చారు.

 మరోవైపు ప్రసాద్‌రెడ్డి, చామంత్‌రెడ్డి, దశరథరామిరెడ్డిని కూడా స్టేషన్‌కు తరలించారు. ఇంతలో ఏజెన్సీ నిర్వాహకుడు సుబ్బారావు, జయరామయ్య తమ సిబ్బంది, బంధువులతో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఇరువర్గాలు మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చేసుకోవడంతో పాటు ఘర్షణకు దిగారు. గొడవ తీవ్రమై స్టేషన్ చుట్టూ జనాభా గుంపులుగా చేరినా సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించడంపై ఎస్సై ఆగ్రహానికి గురయ్యారు.

వెంటనే లాఠీలతో జనాభాను చెదరగొట్టారు. అనంతరం ఎస్సైకి అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఇరువర్గాలకు మధ్యస్తం చేసి పంపారు. అయితే ఘర్షణలో గాయపడిన ప్రసాద్‌రెడ్డికి కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా, ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచడం విమర్శలకు తావిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement