గట్టెక్కేదెట్టా..
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ మందకొడిగా సాగుతోంది. రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకొనేందుకు మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ముఖ్యంగా భూ సమీరణకు తొలినుంచి అనుకూలంగా ఉన్న తుళ్లూరు మండలం మెట్ట రైతులు సైతం భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. జరీబు భూముల రైతులు ఆదినుంచీ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ పరిణామాల నుంచి ఎలా గట్టెక్కాలనేది అటు అధికారులు, ఇటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అర్థం కావడంలేదు.
సాక్షి, గుంటూరు : మంగళగిరి మండలం నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాల్లో ఇప్పటివరకు నామ మాత్రంగానే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లి,పెనుమాక గ్రామాల్లో రైతులు ససేమిరా అంటున్నారు. మొత్తం మీద15 గ్రామాల్లో ఇప్పటి వరకు 10 శాతంలోపు భూములను కూడా రైతులు ఇవ్వక పోవడం గమనార్హం.
భూములు ఇవ్వాలనుకున్న రైతుల్లో సైతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంలో వివిధ ధ్రువపత్రాలు కావాలని చెప్పిన అధికారులు వాటికి పూర్తి మినహాయింపు ఇచ్చినా భూసమీకరణలో వేగం పుంజుకోలేదు.
రాజధాని పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు వేసి కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అనధికార లేఅవుట్లపై ఉక్కు పాదం మోపుతామని గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీఓ భాస్కరనాయుడు హెచ్చరికలు జారీచేశారు.
భూసమీకరణలో వేగం పెంచే క్రమంలో సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలు నివృత్తి చేయడంతోపాటు, వారికి వరాలు కురిపించినా అవి అన్నదాతల్లో నమ్మకం కలిగించలేకపోయాయి.
మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ రాజధాని ప్రాంత గ్రామాల్లో తిష్టవేసి భూ సమీకరణలో వేగం పెంచాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందులో భాగంగానే మంత్రి రాజధాని ప్రాంత రైతులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై అపోహలు తొలగించాలని భావించారు. అయితే విజయవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది.
రాజధాని ప్రాంతంలోని భూముల సర్వేను వేగవంతం చేసేందుకు జిల్లాలోని సర్వేయర్లతో సోమవారం ఓ సమావేశం నిర్వహించారు. మొత్తం మీద గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత నెల రోజుల లోపు ప్రక్రియ పూర్తి కావాలని సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్నారు.
జనవరి 2వ తేదీన అధికారికంగా నేలపాడు గ్రామానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 10 తేదీ లోపు ఎక్కువ గ్రామాల్లో రైతులనుంచి అంగీకార పత్రాలు తీసుకొనే ప్రక్రియకు తెరపడాలి. అయితే ప్రభుత్వం ఆశించిన విధంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు లేవు.
ఇప్పటి వరకు 2,545 మంది రైతులు 5,234.01 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆర్డీఓ టి. భాస్కరనాయుడు తెలిపారు.