tulluru zone
-
మద్దతిస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తాం
కృష్ణాయపాలెం(మంగళగిరి)/మంగళగిరి: మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో దీక్షకు వెళ్తున్నవారిపై అమరావతి మద్దతుదారులు దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. మందడంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంగళగిరి మండలంలోని పలు గ్రామాల నుంచి పేదలు, దళితులు ఆటోల్లో మందడం వెళ్తుండగా కృష్ణాయపాలెంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆటోలను అడ్డుకుని మహిళలను రాయలేని భాషలో దుర్భాషలాడారు. అమరావతిలో తమకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే మీకొచ్చిన నష్టమేమిటంటూ మహిళలు వారిని నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. మహిళలని కూడా చూడకుండా బూతులు తిడుతూ కర్రలతో దాడికి యత్నించారు. ఇంతలో మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారు అక్కడకు చేరుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు మహిళలను ట్రాక్టర్‌తో తొక్కించబోయారని, ఇది టీడీపీ అహంకారానికి నిదర్శనమని దళిత బహుజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా దళితులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమపై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఎస్పీ ఈశ్వరరావు, నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. టీడీపీ నేతలపై కేసు కృష్ణాయపాలెంలో దాడికి పాల్పడిన 11 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై మంగళగిరి రూరల్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి రవిబాబు తన మీద దాడికి ప్రయత్నించిన 11 మందిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుక్కమళ్ల అరుణ్‌బాబు, నంబూరి రామారావు, ఈపూరి జయకృష్ణ, ఈపూరి రవికాంత్, ఈపూరి చిన్న ఇమ్మానుయేలు, ఈపూరి మరియదాసు, చిలువూరి రాహుల్, పొంటి నరేశ్, దానబోయిన బాజి, ఈపూరి కిషోర్, కుక్కమళ్ల విజయకుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్లతో తొక్కిస్తామని భయపెట్టారు కృష్ణాయపాలెం వద్ద టీడీపీ నేతలు, వారి అనుచరులు.. మహిళలమని కూడా చూడకుండా దుర్భాషలాడారు. ‘ఇటు వస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తాం’ అంటూ భయపెట్టారు. – మేరీ, మంగళగిరి ఆటోల్లో నుంచి బలవంతంగా లాగారు మంగళగిరి నుంచి ఆటోల్లో వస్తున్న మమ్మల్ని ఆపి బలవంతంగా బయటకు లాగారు. అంతేకాకుండా దాడికి ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో దళితులపై జులుం ప్రదర్శించడం పరిపాటిగా మారింది. – ఉష, మంగళగిరి దుర్భాషలాడారు ఆటోను ఆపి ఎక్కడికెళుతున్నారే.. మా భూముల్లో మీకు ఇళ్లెలా ఇస్తాడు జగన్’ అని టీడీపీ నేతలు నానా దుర్భాషలాడారు. కర్రలతో దాడి చేస్తామని, ట్రాక్టర్లతో తొక్కిస్తామని బెదిరించారు. – సుబ్బులు, మంగళగిరి కులం పేరుతో దూషించారు దళితులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని టీడీపీ నేతలు దాడికి యత్నించారు. కులం పేరుతో దూషించారు. మాపై దాడికి యత్నించినవారిపై కఠిన చర్యలు చేపట్టాలి. – కట్టెపోగు ఉదయభాస్కర్, మంగళగిరి -
చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరే అవకాశం
సాక్షి, అమరావతి: జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లోకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 8.78 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 7,34,967 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద గేట్లనుంచి పాలపొంగులా వెలుపలికి వస్తున్న నీటని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. సాగర్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్ జాం అవుతోంది. పులిచింతల ప్రాజెక్టుకులోకి 5,46,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు 5,98,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజిలోకి గురువారం సాయంత్రకు 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదే పరిమాణంలో 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. ప్రకాశం బ్యారేజికి లోకి వచ్చే వరద పెరుగుతుందని, దిగువకు 6 లక్షల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజి వద్దకు 7.5 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తుళ్లూరు, కొల్లూరు, కొల్లిపర మండలాల్లోని లంక గ్రామాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తుళ్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొల్లిపర మండలం కరకట్ట లోపల ఉన్న బొమ్మువానిపాలెం, కొత్తూరిలంక, అన్నవరపు లంక లోని ప్రజలను గురువారం సాయంత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా రెవెన్యూ, పోలీసు సిబ్బంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పిడపర్తివారిపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరపు లంక , కొల్లిపర, వల్లభాపురం గ్రామాల్లో 450 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పసుపు, అరటి, కంద, మొక్క జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. కొల్లిపర మంలంలోని తుగ్గనలంక, చింతర్లంక, గాజులంక, ఆవులవారిపాలెం, పొతర్లంక గ్రామాల్లో 400 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నీట మునిగిన వాటిలో కంద, పసుపు, మొక్కజొన్న, అరటి, కూరగాయలు వంటి ఉన్నాయి. దొనేపూడి–పొతర్లంక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ప్రకాశం బ్యారేజి నుంచి శుక్రవారం ఉదయం 7.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారనే సమాచారంతో లంక గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. నిండుకుండలా జలాశయాలు..... నాగార్జున సాగర్ రిజార్వాయర్‌లో గురువారం సాయంత్రానికి 586.70 అడుగులు అంటే, 303.94 టీఎంసీలుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం 170.44 అడుగులు కాగా, ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి 39 టీఎంసీల నీరు ఉంది. ప్రకాశం బ్యారేజి నుంచి 70 గేట్లు ఎత్తి, గురువారం రాత్రి 6 లక్షల నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అప్రమత్తం చేశాం... కృష్ణానదికి వరద కొనసాగుతూనే ఉంది. దీంతో తుళ్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. శుక్రవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజికి 7.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజి దిగువ ఉన్న లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో రెవెన్యూ. పోలీసు సిబ్బంది ప్రజలతో చర్చించి, వారిని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. - ఐ.శ్యామూల్ అనందకుమార్, కలెక్టర్, గుంటూరు -
గట్టెక్కేదెట్టా..
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ మందకొడిగా సాగుతోంది. రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకొనేందుకు మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ముఖ్యంగా భూ సమీరణకు తొలినుంచి అనుకూలంగా ఉన్న తుళ్లూరు మండలం మెట్ట రైతులు సైతం భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. జరీబు భూముల రైతులు ఆదినుంచీ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ పరిణామాల నుంచి ఎలా గట్టెక్కాలనేది అటు అధికారులు, ఇటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అర్థం కావడంలేదు. సాక్షి, గుంటూరు : మంగళగిరి మండలం నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాల్లో ఇప్పటివరకు నామ మాత్రంగానే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లి,పెనుమాక గ్రామాల్లో రైతులు ససేమిరా అంటున్నారు. మొత్తం మీద15 గ్రామాల్లో ఇప్పటి వరకు 10 శాతంలోపు భూములను కూడా రైతులు ఇవ్వక పోవడం గమనార్హం. భూములు ఇవ్వాలనుకున్న రైతుల్లో సైతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంలో వివిధ ధ్రువపత్రాలు కావాలని చెప్పిన అధికారులు వాటికి పూర్తి మినహాయింపు ఇచ్చినా భూసమీకరణలో వేగం పుంజుకోలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు వేసి కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అనధికార లేఅవుట్లపై ఉక్కు పాదం మోపుతామని గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీఓ భాస్కరనాయుడు హెచ్చరికలు జారీచేశారు. భూసమీకరణలో వేగం పెంచే క్రమంలో సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలు నివృత్తి చేయడంతోపాటు, వారికి వరాలు కురిపించినా అవి అన్నదాతల్లో నమ్మకం కలిగించలేకపోయాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ రాజధాని ప్రాంత గ్రామాల్లో తిష్టవేసి భూ సమీకరణలో వేగం పెంచాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందులో భాగంగానే మంత్రి రాజధాని ప్రాంత రైతులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై అపోహలు తొలగించాలని భావించారు. అయితే విజయవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. రాజధాని ప్రాంతంలోని భూముల సర్వేను వేగవంతం చేసేందుకు జిల్లాలోని సర్వేయర్లతో సోమవారం ఓ సమావేశం నిర్వహించారు. మొత్తం మీద గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత నెల రోజుల లోపు ప్రక్రియ పూర్తి కావాలని సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నారు. జనవరి 2వ తేదీన అధికారికంగా నేలపాడు గ్రామానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 10 తేదీ లోపు ఎక్కువ గ్రామాల్లో రైతులనుంచి అంగీకార పత్రాలు తీసుకొనే ప్రక్రియకు తెరపడాలి. అయితే ప్రభుత్వం ఆశించిన విధంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు లేవు. ఇప్పటి వరకు 2,545 మంది రైతులు 5,234.01 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆర్డీఓ టి. భాస్కరనాయుడు తెలిపారు.