Mobilization of the land
-
భూ సమీకరణ కోసం ఎన్ని కుయుక్తులో.!
మచిలీపట్నం : బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం చేపట్టిన భూసమీకరణలో పాలకులు రైతులను ఏమార్చే పనిలో పడ్డారు. వ్యూహాత్మకంగా భూసమీకరణకు తెరవెనుక రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల భూసమీకరణ అంశం, పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం జరిగింది. టీడీపీ నాయకులు మచిలీపట్నం అభివృద్ధి కోసం రైతుల నుంచి భూములు సమీకరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలతో భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసే పనిని ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే భూసమీకరణకు పాలకులు తెగబడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా టీడీపీ సానుభూతిపరులతో భూసమీకరణకు భూములు ఇస్తున్నట్లు ప్రచారం చేసి అనంతరం రైతుల నుంచి భూములు గుంజుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకులు ఉన్నారు. పోర్టు నిర్మాణం జరిగే ఆరు గ్రామాలతోపాటు పారిశ్రామిక కారిడార్ కోసం భూములు సమీకరించాల్సిన మిగిలిన గ్రామాల్లోనూ అధికారులు సర్వే నిర్వహించేందుకు వెళుతున్నారు. రైతుల నుంచి ప్రతిఘటన వస్తుండడంతో వెనుదిరుగుతున్నారు. పల్లెతుమ్మలపాలెంలో ఇటీవల సర్వే నిర్వహించేందుకు ఎంఏడీఏ సిబ్బంది వెళ్లగా కరకట్ట భూమి పక్కనే ఉన్న సర్వే భూమిని సర్వే చేసుకోవాలని గ్రామస్తులు చెప్పడంతో ఆ భూముల వరకు సర్వే నిర్వహించారు. కోన–2 పరిధిలోని తుమ్మలచెరువు, చిన్నాపురం గ్రామాల పరిధిలో ఎంఏడీఏ అధికారులు సర్వేకు వెళ్లగా తుమ్మలచెరువు రైతులు సర్వే నిర్వహించవద్దని సర్వే నిర్వహిస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించి వెనక్కి పంపేశారు. లీజు ఎంత ఇస్తారు బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సాగునీరు సక్రమంగా విడుదలైతే ఏడాదికి రెండు పంటలు పండే భూములను సైతం మెట్టభూములుగా భూసమీకరణ నోటిఫికేషన్లో చూపారు. ఈ 33,177 ఎకరాలు మెట్ట భూములుగా చూపడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం మాగాణి భూములకు ఎకరానికి ఏడాదికి రూ.50వేలు, మెట్ట భూములకు రూ.30వేలు చొప్పున పదేళ్లపాటు లీజు చెల్లించాల్సి ఉంది. ఎవరైనా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, తమ భూములు మాగాణి భూములుగా పరిగణిస్తారా, లేదా అనే అంశంపై అధికారులను ప్రశ్నిస్తే ఈ అంశం మా పరిధిలో లేదని చెబుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో అసైన్డ్భూములు సాగు చేసుకునే రైతులకు ఏడాదికి రూ.20 వేలు లీజు చెల్లించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నా, మాగాణి భూములుగా పరిగణించే అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. భూమి ఇచ్చిన రైతులు రెండు పంటలకు నీటి తీరువా చెల్లించారా, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించి మెట్ట, మాగాణి భూముల్లో ఏ కేటగిరీలోకి వస్తాయో నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులను టీడీపీ నాయకులు వివరణ ఇవ్వాలని కోరారు. 1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారని, ప్రస్తుతం వేరే రైతులు అనుభవదారులుగా ఉన్నారని వారి పేరున ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేస్తేనే రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. ఏ అంశంపైనా స్పష్టం చేయకుండా రైతుల నుంచి భూములు సమీకరించటం సాధ్యం కాదని అంటున్నారు. పాలకులు మాత్రం భూసమీకరణ చేసి తీరాల్సిందేనని రూ.100 కోట్లను భూములు ఇచ్చిన రైతులకు లీజుగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రకటనలు చేస్తూ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
బందరు పోర్టుపై నేడు భేటీ
సీఎంతో అధికారుల సమావేశం మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నాం జిల్లా అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా జరిగిన పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నారు. బందరు పోర్టు పోర్టు నిర్మాణం జరిగే మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, చిలకలపూడి, బందరు ఈస్ట్ రెవెన్యూ గ్రామాల్లో 4,800 ఎకరాల భూమిని సమీకరించి తొలివిడతగా పోర్టు నిర్మాణం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ దిశగా ఈ ఆరు గ్రామాల్లో భూముల సర్వే ఇటీవల నిర్వహించారు. 3,100ఎకరాల భూమి కి సంబంధించిన సర్వే పనులను పూర్తి చేసి నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు ఎంఏడీఏ అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు సంబంధించిన కీలక సమావేశం బుధవారం ముఖ్యమంత్రితో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న బందరుపోర్టు అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మాగాణి భూములుగా పరిగణిస్తారా... మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం ఎంఏడీఏ ద్వారా గత ఏడాది సెప్టెంబరులో 33,177 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రైతుల నుంచి తీవ్ర వ్య తిరేకత వ్యక్తం కావడంతో పోర్టు నిర్మా ణం జరిగే ఆరు గ్రామాల పరిధిలో 4,800 ఎకరాలను సమీకరించేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. భూ సమీకరణ నోటిఫికేషన్ 1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇచ్చారు. కాలక్రమంలో కాలువల ఏర్పాటు, సాగునీటి విడుదల జరగటంతో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. సమీకరణ నోటిఫికేషన్లో మెట్టభూమిగా నమో దు చేయటంతో రైతులకు తీవ్ర అన్యా యం జరిగే అవకాశం ఏర్పడింది. మెట్ట ఎకరాకు రూ.30వేలు, మాగాణి భూమికి రూ. 50వేలు చొప్పున పది సంవత్సరాల పాటు లీజు సొమ్ముగా అందజేస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అన్ని గ్రామాల్లోని రైతులు నష్టపోనున్నారు. -
‘సీమ’ ఎక్స్‌ప్రెస్‌వేకు 26 వేల ఎకరాలు
సమీకరణ లేదా సేకరణకు ప్రభుత్వ నిర్ణయం సాక్షి, అమరావతి: నూతన రాజధాని అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి భవిష్యత్ అవసరాల పేరుతో భారీగా భూ సమీకరణ లేదా భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రస్తుతం నాలుగు, ఆరు లేన్ల రహదారి నిర్మించాలని నిర్ణరుుంచారు. భవిష్యత్‌లో 8 లేన్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో భాగంగా ఏకంగా 26,890.64 ఎకరాల భూమిని ఇప్పుడే సమీకరించడం లేదా సేకరించనున్నారు. అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే కోసం భూమి సేకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణానికి అవసరమైన భూమిని కొనుగోలు చేయడానికి లేదా భూ సేకరణ ద్వారా తీసుకోవడానికి వీలుగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కో భూ సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇందులో అటవీ భూమి కూడా ఉన్నందున తగిన అనుమతులు పొందేందుకు వీలుగా మరో విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. -
వామ్మో!
పోర్టుకు లక్ష ఎకరాల భూసమీకరణపై కలకలం ఎంఏడీఏ పరిధిలోలక్షా 5 వేల ఎకరాల సేకరణకు కేబినెట్ ఆమోదంబందరు పోర్టుకు కావాల్సింది 4,800 ఎకరాలుఅనుబంధ పరిశ్రమల పేరుతో సమీకరణకు నిర్ణయం రైతుల భూములను గుంజుకునే యత్నాలపై సర్వత్రా ఆగ్రహం భూసమీకరణపై ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా.. ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా ప్రభుత్వ వైఖరి మారలేదు. ఒకపక్క రాజధాని ప్రాంతం భగ్గుమంటోంది. ఏలూరు కాల్వ కోసం భూసమీకరణ పేరెత్తితే గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బందరు పోర్టు కోసం 30 వేల ఎకరాలు తీసుకుంటామంటే గతంలో బందరు ప్రాంత గ్రామాల రైతులు నాయకుల్ని తరిమితరిమి కొట్టారు. ఇంత జరిగినా ఇప్పుడు మళ్లీ పోర్టు నిర్మాణం, అనుబంధ పరిశ్రమల పేరిట లక్ష ఎకరాలు భూసమీకరణ చేయాలని నిర్ణయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం / సాక్షి, విజయవాడ : నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచేం దుకు టీడీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలను సేకరించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో నివ్వెరపోవటం జనం వంతయింది. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వచ్చిన పాలకులు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాల భూమి అవసరం కాగా, గత ఏడాది ఆగస్టు 31న 30 వేల ఎకరాలను పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా 4,800 మందికి పైగా రైతులు ఆర్డీవో కార్యాలయంలో తమ అభ్యంతరాలను అందజేశారు. ఎంఏడీఏ ఏర్పాటు భూసేకరణ నోటిఫికేషన్ అయితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, భూసమీకరణ పేరుతో ముందుకు వెళితే ఇబ్బందులు ఉండవని ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సూచన మేరకు ఎంఏడీఏను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జీవో నంబరు 15ను ప్రభుత్వం జారీ చేసింది. 29 గ్రామాలు కనుమరుగు? లక్ష ఎకరాలు ప్రభుత్వం భూసమీకరణ చేస్తే బందరు పురపాలక సంఘంతో పాటు 28 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామం కలిసి మొత్తం 29 గ్రామాలు కనుమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. సుమారు 2.50 లక్షల మంది ప్రజలు ఈ గ్రామాల్లో జీవి స్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ వరి, చేపలు, రొయ్యల సాగు మీదనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. మొత్తం 426 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే తమ జీవనాధారమే పోతుందని గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కేవలం పోర్టుకు కాకుండా అనుబంధ పరిశ్రమలకు కూడా భూసమీకరణ చేయడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. వ్యాపారానికి పెట్టుబడిగా చేస్తారా? పోర్టు నిర్మించకుండా ఏవేవో పరిశ్రమలు నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రైతుల భూములను గుంజుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పేర్ని నాని ‘సాక్షి’కి తెలిపారు. 30 వేల ఎకరాల భూమికి నోటిఫికేషన్ ఇస్తేనే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, 1.05 లక్షల ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రభుత్వం చెబితే జీవనాధారం కోల్పోయే రైతులు పోరుబాట పడతారని ఆయన అన్నారు. రైతులను మోసం చేసి అత్యాశతో ముందడుగు వేస్తున్న టీడీపీ పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. అభివృద్ధి జరిగితే దాని ఫలాలను రైతులు కూడా అనుభవించాలని, ఇది సమంజసమని, టీడీపీ నాయకులే అనుభవిస్తామంటే రైతులు ఊరుకోరని స్పష్టంచేశారు. జాడలేని పరిశ్రమలు... ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయిల్ రిఫైనరీ పరిశ్రమను బందరులో పెడతామని చెప్పారు. అప్పటి నుంచి ఒక్కడుగు ముందుకు పడలేదు. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్తా ముందుకు రాలేదు. అయినా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసమీకరణ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
ఉండవల్లిపై ఉక్కుపాదం
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల తొలగింపు అటవీ శాఖ తొలి దశ సర్వేలో 2,500 కుటుంబాల తరలింపునకు ప్రతిపాదనలు పొమ్మనకుండా పొగ పెడుతున్న వైనం సర్కారు కుయుక్తులతో జనం గగ్గోలు విజయవాడ బ్యూరో : భూసమీకరణను వ్యతిరేకించిన తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాజధాని అభివృద్ధి సాకుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆ గ్రామం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తొలినాళ్లలో టూరిజం హబ్‌గా ఉండవల్లి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. భూ సమీకరణను ఆ గ్రామం ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ తరువాత ఆ గ్రామానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రవాణాకు మౌలిక వసతులు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఉండవల్లిని ఎంపిక చేసింది. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందనేది స్థానికుల వాదన. టూరిజం ప్రాంతం అయితే అక్కడ భూముల ధరలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రవాణా, విద్యుత్ సబ్స్టేషన్లకు ఎంపిక చేస్తే ఆ ప్రాంతానికి పెద్దగా క్రేజ్ ఉండదు. దీంతో అక్కడ భూముల ధరలు పడిపోవడంతో పాటు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడి వలసలు పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రకటనకు ముందే కోట్లు పలికిన భూములు... రాజధాని ప్రకటన రాకముందు నుంచే ఉండవల్లి ప్రాంతంలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలికాయి. ఇప్పుడు మాత్రం రాజధాని నిర్మాణం చేపట్టకముందే ఉండవల్లిలోని నివాసాలపై ప్రభావం పడుతోంది. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా గతేడాది రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రభుత్వం ఉండవల్లిలో పెద్ద ఎత్తున ఇళ్లు తొలగించింది. విజయవాడ - ఉండవల్లి - తుళ్లూరు - అమరావతి రోడ్ల విస్తరణకు ఇప్పటికే చాలా మంది నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉండవల్లి వద్ద రోడ్డును మరింత విస్తరించడంతో ఇళ్లు, దుకాణాలు, చిన్నపాటి బడ్డీకొట్లను తొలగించారు. రాజధాని నిర్మాణం, అటవీ భూముల అవసరం సాకుతో 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రజలను తరిమేసే ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలను పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఇబ్బందులు పెడితే భూములైనా ఇస్తారు, ఊరైనా వదిలిపోతారు అన్నట్టు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. అయినా రోడ్ల విస్తరణ తదితర కారణాలతో ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాజధాని పేరుతో పొలాలు గుంజుకున్న సర్కారు ఇప్పుడు ఇళ్లనూ కూల్చేసి ప్రజలను రోడ్డున పడేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. అటవీ భూముల బూచి... అమరావతి రాజధాని కోసం సుమారు 50 వేల ఎకరాల అటవీ భూములను డీఫారెస్ట్ కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయడంతో దాని ప్రభావం కూడా ఉండవల్లిపై పడనుంది. ఉండవల్లి సమీప ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పాచిక పారకపోవడంతో ఇక్కడ అటవీ భూములను తీసుకోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఉండవల్లితో పాటు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, ప్రకాష్‌నగర్, డోలాస్‌నగర్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు అటవీ భూముల పరిధిలోకి వస్తాయని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 30 వేల ఇళ్లలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లను అటవీ ప్రాంతం నుంచి కదిలించాల్సి ఉంటుందని సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక పర్యాయం సర్వే నిర్వహించిన అటవీ శాఖ అధికారులు ఉండవల్లి, ప్రకాష్ నగర్, డోలాస్‌నగర్, నులకపేట ప్రాంతాల్లోని అటవీ భూముల్లో 2,500 ఇళ్లు ఉన్నాయని నిర్ధారించారు. వాటితో పాటు మరో ఎనిమిది వేల ఇళ్లను కూడా వేర్వేరు కారణాలు చూపి ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా నదికి ఆనుకుని విజయవాడ-చెన్నై జాతీయ రహదారి చెంతనే ఉన్న ఉండవల్లి గ్రామం రైల్వేస్టేషన్‌కు కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేలా పథక రచన చేస్తోంది. -
ఎంఏడీఏ ముసుగులో....
పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూములు కావాలంటూ ప్రకటన 17 మంది డెప్యూటీ కలెక్టర్ల నియామకం 36,559 ఎకరాల భూ సమీకరణ లక్ష్యం ఆరునూరైనా ఇవ్వబోమంటున్న రైతాంగం సర్కారు భూదాహం రాజధాని గ్రామాల్లో తీరనట్లుంది. అందుకేనేమో సీఆర్డీఏ పరిధి దాటి రైతుల భూములను లాక్కునేందుకు పావులు వేగంగా కదుపుతోంది. మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 36,559 ఎకరాల భూమిని సమీకరించేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తెరపైకి తెచ్చి అందులో 28 గ్రామాలను విలీనం చేసింది. ఇప్పుడు భూమిని సమీక రించేందుకు ఉపక్రమించింది. మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వం భూదందాకు తెరతీసింది. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా భూసమీకరణకు ఎత్తుగడ వేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీన మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. మచిలీపట్నం మున్సిపాలిటీతోపాటు మరో 28 గ్రామాలను ఎంఏడీఏ పరిధిలో చేర్చి 1,05,306.34 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించింది. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో పరిశ్రమల స్థాపన, పోర్టు నిర్మాణం కోసం భూ సమీకరణ చేస్తామని, పది రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంఏడీఎలో భూసమీకరణ కోసం 15 మంది డెప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం జీవో నంబరు 467 జారీచేశారు. గతంలోనే వసంతరాయుడు, ఎం.సమజలను డెప్యూటీ కలెక్టర్లను నియమించగా వారు ఎంఏడీఏ విధుల్లో చేరారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం భూదందాకు తెరతీసిందని రైతులు చెబుతున్నారు. భూసమీకరణకు ప్రణాళిక ఇలా ఎంఏడీఏ ఆధ్వర్యంలో 36,559 ఎకరాలు భూసమీకరణ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 1200 నుంచి 2 వేల ఎకరాలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. 20 యూనిట్లను ఏర్పాటుచేసి ఒక్కో యూనిట్‌కు డెప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇద్దరు డెప్యూటీ తహసీల్దార్లు, సర్వే ఇన్స్పెక్టర్, ఇద్దరు సర్వేయర్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను నియమించనున్నారు. పశ్చిమగోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ఏడాదిపాటు డెప్యుటేషన్‌పై పనిచేసేందుకు తహశీల్దార్లను నియమించాలని రెవెన్యూ విభాగానికి లేఖ రాశారు. సిబ్బంది. అధికారుల నియామకం పూర్తయితే సంబంధిత గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ చేసి భూసమీకరణ ప్రారంభించనున్నారు. ఏకపక్ష నిర్ణయాలు గత ఏడాది ఆగస్టు 31న పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం హడావుడిగా జారీచేసింది. దీంతో రైతులు, ప్రజాసంఘాలు, ఆయా పార్టీల నాయకులు పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు. తమ భూములు ఇచ్చేది లేదని ఆర్డీవో కార్యాలయంలో తమ అభ్యంతరాలను తెలియజేశారు. దీంతో భూసేకరణ అంశాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం, మచిలీపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంఏడీఏను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. భూసేకరణ కాదు భూసమీకరణ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయకుండా, ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో ప్రకటించకుండా, ఏ పరిశ్రమకు ఎంత భూమి అవసరమో తెలియజేయకుండా, రైతులు అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తన చిత్తానుసారం వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని పాలకులు చెబుతూనే తెరవెనుక మరో విధంగా కథ నడపడం రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రైతుల్ని వెంటాడుతున్న భయం ఎంఏడీఏ పరిధిలో 36,559 ఎకరాల భూమిని భూసమీకరణ ప్రక్రియ ద్వారా తీసుకునే నిమిత్తం ఒకేసారి ఇంతమంది డెప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే భయం రైతులను వెంటాడుతోంది. ఎంఏడీఏ కార్యాలయాన్ని మచిలీపట్నంలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు జేసీ, ఇతర అధికారులు ఇటీవల పరిశీలించారు. మున్సిపల్ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏడీఏ చైర్మన్ కలికాల వలవన్ గతసోమవారం మచిలీపట్నంలో పర్యటించి వివరాలు సేకరించారు. ఆయన పర్యటించి వెళ్లిన రెండు రోజుల వ్యవధిలోనే డెప్యూటీ కలెక్టర్ల నియామకం జరగడం గమనార్హం. ప్రభుత్వం ఎంతమంది అధికారులను నియమించినా, తమకు జీవనాధారంగా ఉన్న భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. -
భూ సమీకరణ కోసం..
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ మందకొడిగా సాగుతోంది. ఆశించిన స్థారుులో పురోగతి సాధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది. రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు, రెవెన్యూ, సర్వే తదితర శాఖల సిబ్బందికి క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండే విధంగా తుళ్లూరులోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వీటితోపాటు సర్వే విభాగం లొకేషన్ వర్క్ ప్రారంభించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ , తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఎక్కువ సమయంలో రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోనే ఉంటున్నారు. అత్యవసర పనులపై మంత్రి నారాయణ ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆ పనుల బాధ్యతను పూర్తిగా పర్యవేక్షించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అనధికార లేఅవుట్లు, అక్రమ కట్టడాలను నియంత్రించడం, ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీలపై రైతులకున్న అపోహలను తొలగించే దిశగా ముమ్మరయత్నాలు జరుగుతున్నాయి. తుళ్లూరు కేంద్రంగా రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 30 వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, శుక్రవారం వరకు 6,490 ఎకరాలను సేకరించి 3,166 మంది రైతుల నుంచి అనుమతి పత్రాలు తీసుకున్నారు. దాదాపు 23 రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో భూ సమీకరణ జరగలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు సెలవు ఇవ్వడంతోపాటు ఆ తరువాత రెండు రోజుల్లోనూ సమీకరణ వేగంగా జరగలేదు. దీనికితోడు రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని భూములకు ధరలు తగ్గి, ఆ పరిసర ప్రాంతాల్లోని భూములకు ధరలు పెరిగాయి. దీంతో రైతుల్లో అనేక సందేహాలు మొదలై భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని ఇద్దరు రైతులే భూ సమీక రణకు ముందుకు వచ్చి అంగీకార పత్రాలు ఇచ్చారు. అవీ వివాదాస్పదమైనవని తేలడంతో అధికారులు తెల్లబోయారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 34 మంది డిప్యూటీ కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఒక్కో కాంపిటెంట్ కింద ఒక డిప్యూటీ కలెక్టర్, ఇద్దరు తహశీల్దార్లు, ఒక సర్వేయరు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, వీఆర్వోలు సేవలందిస్తున్నారు. భూ సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకోకపోవడంతో వీరు ఖాళీగానే ఉంటున్నారు. సర్వే విభాగానికి చెందిన సిబ్బంది లొకేషన్ వర్క్ ప్రారంభించారు. రికార్డుల ప్రకారం ఏ రైతుకు ఎంత భూమి ఉందో తెలుసుకుని, వాటి ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలనను వేగవంతం చేసినట్టు ఆ శాఖ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. సర్వే పనుల పర్యవేక్షణ బాధ్యతలను ట్రైనీ కలెక్టర్ శివశంకర్‌కు ప్రభుత్వం అప్పగించింది. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఆర్డీఏ కార్యాలయ మరమ్మతులు శనివారానికి పూర్తికానున్నాయి. దీనిని కేంద్రంగా చేసుకుని అధికారులు విధులు నిర్వహించనున్నారు. -
గట్టెక్కేదెట్టా..
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ మందకొడిగా సాగుతోంది. రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకొనేందుకు మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ముఖ్యంగా భూ సమీరణకు తొలినుంచి అనుకూలంగా ఉన్న తుళ్లూరు మండలం మెట్ట రైతులు సైతం భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. జరీబు భూముల రైతులు ఆదినుంచీ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ పరిణామాల నుంచి ఎలా గట్టెక్కాలనేది అటు అధికారులు, ఇటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అర్థం కావడంలేదు. సాక్షి, గుంటూరు : మంగళగిరి మండలం నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాల్లో ఇప్పటివరకు నామ మాత్రంగానే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లి,పెనుమాక గ్రామాల్లో రైతులు ససేమిరా అంటున్నారు. మొత్తం మీద15 గ్రామాల్లో ఇప్పటి వరకు 10 శాతంలోపు భూములను కూడా రైతులు ఇవ్వక పోవడం గమనార్హం. భూములు ఇవ్వాలనుకున్న రైతుల్లో సైతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంలో వివిధ ధ్రువపత్రాలు కావాలని చెప్పిన అధికారులు వాటికి పూర్తి మినహాయింపు ఇచ్చినా భూసమీకరణలో వేగం పుంజుకోలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు వేసి కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అనధికార లేఅవుట్లపై ఉక్కు పాదం మోపుతామని గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీఓ భాస్కరనాయుడు హెచ్చరికలు జారీచేశారు. భూసమీకరణలో వేగం పెంచే క్రమంలో సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలు నివృత్తి చేయడంతోపాటు, వారికి వరాలు కురిపించినా అవి అన్నదాతల్లో నమ్మకం కలిగించలేకపోయాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ రాజధాని ప్రాంత గ్రామాల్లో తిష్టవేసి భూ సమీకరణలో వేగం పెంచాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందులో భాగంగానే మంత్రి రాజధాని ప్రాంత రైతులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై అపోహలు తొలగించాలని భావించారు. అయితే విజయవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. రాజధాని ప్రాంతంలోని భూముల సర్వేను వేగవంతం చేసేందుకు జిల్లాలోని సర్వేయర్లతో సోమవారం ఓ సమావేశం నిర్వహించారు. మొత్తం మీద గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత నెల రోజుల లోపు ప్రక్రియ పూర్తి కావాలని సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నారు. జనవరి 2వ తేదీన అధికారికంగా నేలపాడు గ్రామానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 10 తేదీ లోపు ఎక్కువ గ్రామాల్లో రైతులనుంచి అంగీకార పత్రాలు తీసుకొనే ప్రక్రియకు తెరపడాలి. అయితే ప్రభుత్వం ఆశించిన విధంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు లేవు. ఇప్పటి వరకు 2,545 మంది రైతులు 5,234.01 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆర్డీఓ టి. భాస్కరనాయుడు తెలిపారు. -
పచ్చటి బతుకుల్లో రాజధాని చిచ్చు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లో చిచ్చు రగులు తోంది. రైతుల అభిప్రాయాలు సేకరించాల్సిన మంత్రివర్గ ఉప సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తూ విభేదాలకు ఆజ్యం పోస్తోంది. రైతులు ఆందోళనపడే రీతిలో ప్రకటనలు చేస్తుండడంతో గ్రామాల్లో సభలు రసాభాస కావడమే కాకుండా రైతులు రెండు వర్గాలుగా విడిపోతున్నారు. భూ సమీకరణకు రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గ్రామాలకు వస్తున్న మంత్రివర్గ ఉప సంఘంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చేలోపు అభిప్రాయ సేకరణ పూర్తి చేసి భూములు ఇచ్చేందుకు రైతులంతా అంగీకరించారనే విషయాన్ని చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను రైతులు తప్పుపడుతున్నారు. భూములు ఇచ్చేది లేదని, చావడానికైనా సిద్ధమేనని చెబుతుంటే,భూ సమీకరణ సజావుగా సాగుతోందని సభ్యులు చేస్తున్న ప్రకటనలను రైతులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికితోడు ఉప సంఘం గ్రామానికి వచ్చే ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న హడావుడి రైతుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన సమావేశాల్లో రైతులు ఉప సంఘం సభ్యులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం మంత్రి పుల్లారావును రైతులంతా నిలదీశారు. సమావేశాన్ని నిలువరించే యత్నం చేశారు. రైతుల అభిప్రాయాలకు భిన్నంగా ఎలా ప్రకటనలు ఇస్తారని ప్రశ్నించారు. మేము ఈ భూములు ఇచ్చేది లేదు. ఇస్తామంటున్న రైతుల నుంచి భూములు తీసుకోండి, మీకో నమస్కారం, మా గ్రామం నుంచి వెళ్లండంటూ రైతులు విస్పష్టంగా చెప్పారు. టీడీపీ సానుభూతిపరులైన కొందరు రైతులు ఉప సంఘానికి అనుకూలంగా సమావేశాల్లో మాట్లాడుతుండటంతో రెండు వర్గాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని ఉప సంఘానికి స్పష్టం చేశారు. సంఘం సభ్యులు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ల సమక్షంలో ఎక్కువ మంది రైతులు భూ సమీకరణను వ్యతిరేకించారు. దీనిపై ప్రభుత్వానికే ఇప్పటి వరకు స్పష్టత లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భూములెలా ఇస్తామని ప్రశ్నించారు. మెట్ట భూములు వదిలి, ఏడాదికి మూడు పంటలు పండే భూములను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీల గురించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. శుక్రవారం మందడం గ్రామ సమావేశానికి ఉప సంఘం మేళతాళాలతో చేరుకోవడం రైతులకు ఆగ్రహాన్ని కలిగించింది. అభిప్రాయ సేకరణకు వచ్చారా? టీడీపీ విజయోత్సవ ర్యాలీ కోసం వచ్చారా? అంటు ప్రశ్నించారు. భూములు కోల్పోతామనే భయంతో నిద్రాహారాలు లేక ఆందోళన చెందుతుంటే టీడీపీ జెండాలతో మేళతాళాలతో గ్రామానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రి పుల్లారావునైతే నిలదీశారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా ఇప్పుడు ఏవో ప్యాకేజీలు ఇస్తామంటూ చెప్పేస్తే ప్రజలు ఎలా నమ్మేస్తారంటూ ప్రశ్నించారు. టీడీపీ అనుకూల రైతులు తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సుముఖంగా ఉన్నామని ప్రకటనలు చేస్తుంటే, రెండో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉప సంఘం ఎదుటే రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వివాదాలకు దిగుతున్నారు. ఏదో ఓ రోజు పరిస్థితులు విషమించే అవకాశాలు ఉండటంతో పోలీసులు ముందుస్తు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.