భూ సమీకరణ కోసం ఎన్ని కుయుక్తులో.!
మచిలీపట్నం : బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం చేపట్టిన భూసమీకరణలో పాలకులు రైతులను ఏమార్చే పనిలో పడ్డారు. వ్యూహాత్మకంగా భూసమీకరణకు తెరవెనుక రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల భూసమీకరణ అంశం, పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం జరిగింది. టీడీపీ నాయకులు మచిలీపట్నం అభివృద్ధి కోసం రైతుల నుంచి భూములు సమీకరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలతో భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసే పనిని ప్రారంభించారు.
ప్రభుత్వం నుంచి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే భూసమీకరణకు పాలకులు తెగబడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా టీడీపీ సానుభూతిపరులతో భూసమీకరణకు భూములు ఇస్తున్నట్లు ప్రచారం చేసి అనంతరం రైతుల నుంచి భూములు గుంజుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకులు ఉన్నారు. పోర్టు నిర్మాణం జరిగే ఆరు గ్రామాలతోపాటు పారిశ్రామిక కారిడార్ కోసం భూములు సమీకరించాల్సిన మిగిలిన గ్రామాల్లోనూ అధికారులు సర్వే నిర్వహించేందుకు వెళుతున్నారు.
రైతుల నుంచి ప్రతిఘటన వస్తుండడంతో వెనుదిరుగుతున్నారు. పల్లెతుమ్మలపాలెంలో ఇటీవల సర్వే నిర్వహించేందుకు ఎంఏడీఏ సిబ్బంది వెళ్లగా కరకట్ట భూమి పక్కనే ఉన్న సర్వే భూమిని సర్వే చేసుకోవాలని గ్రామస్తులు చెప్పడంతో ఆ భూముల వరకు సర్వే నిర్వహించారు. కోన–2 పరిధిలోని తుమ్మలచెరువు, చిన్నాపురం గ్రామాల పరిధిలో ఎంఏడీఏ అధికారులు సర్వేకు వెళ్లగా తుమ్మలచెరువు రైతులు సర్వే నిర్వహించవద్దని సర్వే నిర్వహిస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించి వెనక్కి పంపేశారు.
లీజు ఎంత ఇస్తారు
బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సాగునీరు సక్రమంగా విడుదలైతే ఏడాదికి రెండు పంటలు పండే భూములను సైతం మెట్టభూములుగా భూసమీకరణ నోటిఫికేషన్‌లో చూపారు. ఈ 33,177 ఎకరాలు మెట్ట భూములుగా చూపడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం మాగాణి భూములకు ఎకరానికి ఏడాదికి రూ.50వేలు, మెట్ట భూములకు రూ.30వేలు చొప్పున పదేళ్లపాటు లీజు చెల్లించాల్సి ఉంది. ఎవరైనా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, తమ భూములు మాగాణి భూములుగా పరిగణిస్తారా, లేదా అనే అంశంపై అధికారులను ప్రశ్నిస్తే ఈ అంశం మా పరిధిలో లేదని చెబుతున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో అసైన్డ్‌భూములు సాగు చేసుకునే రైతులకు ఏడాదికి రూ.20 వేలు లీజు చెల్లించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నా, మాగాణి భూములుగా పరిగణించే అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. భూమి ఇచ్చిన రైతులు రెండు పంటలకు నీటి తీరువా చెల్లించారా, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించి మెట్ట, మాగాణి భూముల్లో ఏ కేటగిరీలోకి వస్తాయో నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులను టీడీపీ నాయకులు వివరణ ఇవ్వాలని కోరారు.
1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారని, ప్రస్తుతం వేరే రైతులు అనుభవదారులుగా ఉన్నారని వారి పేరున ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేస్తేనే రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. ఏ అంశంపైనా స్పష్టం చేయకుండా రైతుల నుంచి భూములు సమీకరించటం సాధ్యం కాదని అంటున్నారు. పాలకులు మాత్రం భూసమీకరణ చేసి తీరాల్సిందేనని రూ.100 కోట్లను భూములు ఇచ్చిన రైతులకు లీజుగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రకటనలు చేస్తూ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.