మచిలీపట్నం : బందరు పోర్టు రోడ్డు విస్తరణ వివాదంలో పడింది. అధికారంలో లేని సమయంలో ఒక రకంగా అధికారంలోకి వచ్చాక మరో రకంగా టీడీపీ నాయకులు రోడ్డు విస్తరణ అంశంపై వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెమటోడ్చి సంపాదించిన ఆస్తులను ఉచితంగా ఎలా ఇస్తారంటూ అప్పట్లో వ్యాపారులను రెచ్చగొట్టి కోర్టుకు పంపిన టీడీపీ నాయకులు.. అధికారంలోకొచ్చాక మాట మార్చారు. ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణ 80 అడుగులకు జరుగుతుందని, ఉచితంగానే భూమిని ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి ఇటీవల జరిగిన ఫ్యాన్సీ వర్తకుల వనభోజన కార్యక్రమంలో కోరటం వ్యాపారులను కలవరపెడుతోంది.
టీడీపీ నాయకుల ధోరణిపై వారు మండిపడుతున్నారు. గతంలో ఇదే వ్యవహారంలో టీడీపీ నాయకులు తెరవెనుక కథ నడిపి.. ఒకరిద్దరు వ్యాపారులను కోర్టుకు పంపారు. దీంతో కోనేరుసెంటరు నుంచి కోటవారితుళ్ల సెంటరు వరకు 350 మీటర్ల మేర పోర్టు రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. నిధులు వెనక్కి మళ్లాయి. రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన ప్రాంతంలో భూసేకరణ జరిపి ఈ నివేదికను ప్రభుత్వానికి పంపితే నిధులు విడుదల చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.
అడ్డుకున్నది టీడీపీ నాయకులే...
2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులను కేటాయించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని ముఖ్యమంత్రి వైఎస్‌ను ఒప్పించి నిధులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. 65 అడుగుల మేర రోడ్డు విస్తరణకు వ్యాపారులను పేర్ని నాని ఒప్పించారు. కోనేరుసెంటరు సమీపంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్న ఓ టీడీపీ నాయకుడు 65 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేస్తే వ్యాపారులంతా రోడ్డున పడాల్సిందేననే కారణం చూపుతూ ఒకరిద్దరు వ్యాపారులను కోర్టుకు పంపారు. రోడ్డు విస్తరణకు భూమి ఇచ్చే సమయంలో నష్టపరిహారం ఇవ్వాలని అప్పట్లో తెరవెనుక కథ నడిపారు.
స్థలసేకరణ జరిగేనా...
రోడ్డు పనులు నిలిచిపోయిన అనంతరం 2011లో మచిలీపట్నం మాస్టర్ ప్లాన్‌లో కోనేరుసెంటరు నుంచి రైల్వేస్టేషన్ వరకు 100 అడుగుల మేర రోడ్డు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ రోడ్డు విస్తరణ చేయాలంటే భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని సూచించింది. వ్యాపారులు రోడ్డు విస్తరణకు సహకరించకుండా, ఉచితంగా స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. 2011 మాస్టర్ ప్లాన్ వెలువడిన తరువాత పురపాలక సంఘం ద్వారా భవన నిర్మాణాలకు అనుమతి పొంది అనుమతులను అతిక్రమించి నిర్మాణాలను చేసిన భవనాలను ముందస్తు నోటీసు ఇచ్చి వాటిని కూల్చగలరేమోగాని, స్థలాన్ని స్వాధీనం చేసుకోవటం అసాధ్యమని రాజమండ్రికి చెందిన టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.
గత ఆరునెలల వ్యవధిలో పోర్టురోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కానప్పటికీ ఇటీవల జరిగిన ఫ్యాన్సీ వర్తకుల వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య ప్రజాప్రతినిధులు నిధులు మంజూరయ్యాయని, స్థలం ఉచితంగా ఇవ్వాలని వ్యాపారులను కోరటం హాస్యాస్పదమని వారు చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పోర్టు రోడ్డులో రిజిస్ట్రార్ ఆఫీస్ మార్కెట్ విలువ గజం రూ.20 వేలు ఉండగా, ప్రస్తుత భూసేకరణ చట్టం ప్రకారం సేకరణ చేయాలంటే గజానికి నాలుగు రెట్లు మార్కెట్ విలువ కన్నా అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2008 తరువాత పది రెట్లు పెరిగిన ఆస్తిని ఉచితంగా ఇవ్వమని సలహాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుత భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే గాని భూమి ఇవ్వకూడదని అవసరమైతే కలిసికట్టుగా హైకోర్టును ఆశ్రయించాలని పోర్టురోడ్డులోని ముఖ్య ప్రజాప్రతినిధికి సన్నిహితంగా మసలుతున్న ఓ వ్యక్తి షాపులో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. గత వారం రోజులుగా పురపాలకశాఖ అధికారులు పోర్టు రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రోడ్డు 40 నుంచి 45 అడుగుల వెడల్పు ఉంది. 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేస్తే ఇరువైపులా 35 అడుగుల మేర వివిధ వ్యాపారాలు నడుస్తున్న భవనాలను కూల్చాల్సి ఉంది. ఎంత మేర భూసేకరణ చేయాలనే అంశంపై మూడు రోజుల్లో నిర్ధారణ అవుతుందని టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ పి.నాగేంద్రప్రసాద్ తెలిపారు.
నిధులు విడుదల కాలేదు
పోర్టు రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల కాలేదని ఆర్‌అండ్‌బీ ఈఈ మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. పురపాలక సంఘం అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తే ఈ నివేదికను ఆర్‌అండ్‌బీ సీఈకి పంపుతామని ఆయన చెప్పారు. స్థలసేకరణ ప్రక్రియ పూర్తయితే నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు.
పోర్టు రోడ్డు విస్తరణపై రగడ
Published Tue, Nov 18 2014 3:32 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement