సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ మందకొడిగా సాగుతోంది. ఆశించిన స్థారుులో పురోగతి సాధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది. రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు, రెవెన్యూ, సర్వే తదితర శాఖల సిబ్బందికి క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండే విధంగా తుళ్లూరులోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వీటితోపాటు సర్వే విభాగం లొకేషన్ వర్క్ ప్రారంభించింది.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ , తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఎక్కువ సమయంలో రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోనే ఉంటున్నారు. అత్యవసర పనులపై మంత్రి నారాయణ ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆ పనుల బాధ్యతను పూర్తిగా పర్యవేక్షించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
అనధికార లేఅవుట్లు, అక్రమ కట్టడాలను నియంత్రించడం, ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీలపై రైతులకున్న అపోహలను తొలగించే దిశగా ముమ్మరయత్నాలు జరుగుతున్నాయి.
తుళ్లూరు కేంద్రంగా రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 30 వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, శుక్రవారం వరకు 6,490 ఎకరాలను సేకరించి 3,166 మంది రైతుల నుంచి అనుమతి పత్రాలు తీసుకున్నారు.
దాదాపు 23 రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో భూ సమీకరణ జరగలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు సెలవు ఇవ్వడంతోపాటు ఆ తరువాత రెండు రోజుల్లోనూ సమీకరణ వేగంగా జరగలేదు. దీనికితోడు రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని భూములకు ధరలు తగ్గి, ఆ పరిసర ప్రాంతాల్లోని భూములకు ధరలు పెరిగాయి. దీంతో రైతుల్లో అనేక సందేహాలు మొదలై భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని ఇద్దరు రైతులే భూ సమీక రణకు ముందుకు వచ్చి అంగీకార పత్రాలు ఇచ్చారు. అవీ వివాదాస్పదమైనవని తేలడంతో అధికారులు తెల్లబోయారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 34 మంది డిప్యూటీ కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఒక్కో కాంపిటెంట్ కింద ఒక డిప్యూటీ కలెక్టర్, ఇద్దరు తహశీల్దార్లు, ఒక సర్వేయరు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, వీఆర్వోలు సేవలందిస్తున్నారు.
భూ సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకోకపోవడంతో వీరు ఖాళీగానే ఉంటున్నారు. సర్వే విభాగానికి చెందిన సిబ్బంది లొకేషన్ వర్క్ ప్రారంభించారు. రికార్డుల ప్రకారం ఏ రైతుకు ఎంత భూమి ఉందో తెలుసుకుని, వాటి ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలనను వేగవంతం చేసినట్టు ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు.
సర్వే పనుల పర్యవేక్షణ బాధ్యతలను ట్రైనీ కలెక్టర్ శివశంకర్‌కు ప్రభుత్వం అప్పగించింది. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ కార్యాలయ మరమ్మతులు శనివారానికి పూర్తికానున్నాయి. దీనిని కేంద్రంగా చేసుకుని అధికారులు విధులు నిర్వహించనున్నారు.
భూ సమీకరణ కోసం..
Published Sat, Jan 24 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM
Advertisement
Advertisement