బందరు పోర్టుపై నేడు భేటీ
సీఎంతో అధికారుల సమావేశం
మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నాం జిల్లా అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా జరిగిన పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నారు. బందరు పోర్టు పోర్టు నిర్మాణం జరిగే మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, చిలకలపూడి, బందరు ఈస్ట్ రెవెన్యూ గ్రామాల్లో 4,800 ఎకరాల భూమిని సమీకరించి తొలివిడతగా పోర్టు నిర్మాణం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ దిశగా ఈ ఆరు గ్రామాల్లో భూముల సర్వే ఇటీవల నిర్వహించారు. 3,100ఎకరాల భూమి కి సంబంధించిన సర్వే పనులను పూర్తి చేసి నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు ఎంఏడీఏ అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు సంబంధించిన కీలక సమావేశం బుధవారం ముఖ్యమంత్రితో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న బందరుపోర్టు అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మాగాణి భూములుగా పరిగణిస్తారా...
మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం ఎంఏడీఏ ద్వారా గత ఏడాది సెప్టెంబరులో 33,177 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రైతుల నుంచి తీవ్ర వ్య తిరేకత వ్యక్తం కావడంతో పోర్టు నిర్మా ణం జరిగే ఆరు గ్రామాల పరిధిలో 4,800 ఎకరాలను సమీకరించేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. భూ సమీకరణ నోటిఫికేషన్ 1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇచ్చారు. కాలక్రమంలో కాలువల ఏర్పాటు, సాగునీటి విడుదల జరగటంతో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. సమీకరణ నోటిఫికేషన్‌లో మెట్టభూమిగా నమో దు చేయటంతో రైతులకు తీవ్ర అన్యా యం జరిగే అవకాశం ఏర్పడింది. మెట్ట ఎకరాకు రూ.30వేలు, మాగాణి భూమికి రూ. 50వేలు చొప్పున పది సంవత్సరాల పాటు లీజు సొమ్ముగా అందజేస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అన్ని గ్రామాల్లోని రైతులు నష్టపోనున్నారు.