CM YS Jagan Fires On Chandrababu At Machilipatnam Public Meeting - Sakshi
Sakshi News home page

దేవతల్లా యజ్ఞం చేస్తున్నాం.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు

Published Tue, May 23 2023 2:40 AM | Last Updated on Tue, May 23 2023 11:00 AM

CM YS Jagan Fires On Chandrababu At Bandar Meeting - Sakshi

కృష్ణా జిల్లా మంగినపూడి సమీపంలోని తపసిపూడి వద్ద బందరు పోర్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

చంద్రబాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే... అందులో పేదవర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి. రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలి. వాళ్లెవరికీ అక్కడ ఇళ్లు ఉండకూడదు! వాళ్లు అమరావతిలో పొద్దున్నే ఎంటరై పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలి!! రాజధాని పేరుతో పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఓ గేటెడ్‌ కమ్యూనిటీని చంద్రబాబు ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా?.
–  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో నాలుగేళ్లుగా పేదలకు మంచి జరగకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు బృందం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. పేదలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోయి పాచి పనులు చేసుకుంటూ బతకాలనే దుర్బుద్ధి కలిగిన రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. అమరావతిలో కేవలం చంద్రబాబు, ఆయన బినామీలే ఉండాలని, పేదలకు అక్కడ స్థానమే లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లటి దీవెనలతో ఆ అడ్డంకులను అధిగమించి అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 26వతేదీన అమరావతిలో 50 వేల మందికి పైగా పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టిన బందరు పోర్టు నిర్మాణానికి సోమవారం కృష్ణా జిల్లా మంగినపూడి సమీపంలోని తపసిపూడి వద్ద సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం జాతీయ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..  
సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్, బహిరంగ  సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం 

సముద్ర వాణిజ్యంతో శతాబ్దాల చరిత్ర 
బందరుకు సముద్ర వాణిజ్యంతో శతాబ్దాల చరిత్ర ఉంది. చిరకాల స్వప్నం బందరు పోర్టును సాకారం చేస్తూ మనందరి ప్రభుత్వం అన్ని కోర్టు కేసులను అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసింది. అన్ని అనుమతులు సాధించి ఫైనాన్షియల్‌ క్లోజర్‌ను పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగించి పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించాం. దాదాపు 35 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో పోర్టు ప్రారంభమవుతుంది. నాలుగు బెర్తులు ఇక్కడ రానున్నాయి. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ బెర్తుల సంఖ్యను పెంచుకుంటూ 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకు విస్తరించుకోవచ్చు.  

పోర్టుతో రోడ్లు, రైల్వే లైన్‌ అనుసంధానం 
బందరు పోర్టు నిర్మాణంతో పాటు అనుబంధంగా మౌలిక వసతుల పనులు కూడా చేపడుతున్నాం. కేవలం 6.5 కి.మీ. దూరంలో ఉన్న 216వ నెంబర్‌ జాతీయ రహదారిని పోర్టు వరకు అనుసంధానించేలా చర్యలు చేపట్టాం. దీంతోపాటు 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ, మచిలీపట్నం రైల్వే లైనును కూడా పోర్టు వరకు తీసుకొచ్చి అనుసంధానిస్తున్నాం. బందరు కాలువ నుంచి 0.5 ఎం.ఎల్‌.డీ నీటిని 11 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ద్వారా తరలించి పోర్టుతో అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల సరుకుల ఎగుమతి, దిగుమతికి అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా అందుబాటులోకి వస్తుంది.  

పోర్టును అడ్డుకున్న బాబు.. 
బందరు పోర్టు రాకూడదని చంద్రబాబు అడుగులు వేశారు. 22 గ్రామాలు, 33 వేల ఎకరాలను తీసుకునేందుకు భూములన్నీ నోటిఫై చేసి రైతులెవరూ వాటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. మచిలీపట్నంలో పోర్టు రాకపోతే అమరావతిలో తన బినామీల భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చనే దుర్బుద్ధితో మచిలీపట్నానికి తీరని ద్రోహం చేశాడు.   

సంతోషంగా ఇచ్చిన భూములతో.. 
ఈరోజు పోర్టు నిర్మాణానికి 1,700 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాం. రైలు, రోడ్డు మార్గానికి కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగింది. రైతులందరూ మనస్ఫూర్తిగా ఇచ్చిన 240 ఎకరాలు తీసుకుని పోర్టు నిర్మాణంలోకి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. వాటిలో 4 వేల ఎకరాలను పోర్టుతో అనుసంధానించి పరిశ్రమలు వచ్చేలా చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలకు ఊతం పడినట్లు అవుతుంది.  

మారిన బందరు రూపురేఖలు 
మరో 24 నెలల వ్యవధిలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. మచిలీపట్నంలో పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి. మచిలీపట్నం రూపురేఖలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో చూడండి. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండేలా మచిలీపట్నం జిల్లా కేంద్రం ఏర్పాటైంది. బందరులో దాదాపు రూ.550 కోట్లతో చేపట్టిన కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరమే ఆగస్టు, సెప్టెంబరులో అడ్మిషన్లు జరగనున్నాయి. దీనివల్ల అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ,  కైకలూరు నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.   
మా నమ్మకం నువ్వే జగనన్నా.. అంటూ ఫ్లకార్డులు చేబూనిన జనం  

మరో నాలుగు నెలల్లో ఫిషింగ్‌ హార్బర్‌ 
మత్స్యకారులు ఆరాధించే నాగుల్‌మీరా సాహెబ్‌ ఆశీస్సులతో ఏ సమయంలోనైనా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు వీలుగా ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ ఫిషింగ్‌ హార్బర్‌ అందుబాటులోకి వస్తుంది. ఇక్కడే ఇమిటేషన్‌ జ్యూయలరీ తయారీకి మద్దతుగా కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నా పాదయా­త్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.7.65 నుంచి మనం అధికారంలోకి రాగానే రూ.3.75లకు తగ్గించాం.   

ఫిషింగ్‌ హార్బర్లు.. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు 
ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే ఐదింటిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 4–5 నెలల్లో పనులు పూర్తవుతాయి. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా అడుగులు వేస్తున్నాం. ఆరు  ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల పనులూ వేగంగా జరుగుతున్నాయి. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల కోసం రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం.   

పేద కుటుంబాల్లో వెలుగులు
పేదరికాన్ని సమూలంగా తొలగించి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రూ.2.10 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేశాం. ఇక నాన్‌ డీబీటీ కూడా కలిపితే, అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 30 లక్షలకుపైగా ఇంటి స్ధలాలను కూడా కలిపితే.. ఒక్కో ఇంటి స్ధలం విలువ కనీసం రూ.2.50 లక్షలు వేసుకున్నా వాటి విలువ రూ.75 వేల కోట్లు ఉంటుంది. నాన్‌ డీబీటీ కూడా కలిపితే రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మరోవైపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా ఇళ్ల పట్టాలు, ఇళ్లతో అక్కచెల్లెమ్మలకు రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆస్తి వారి చేతిలో పెట్టినట్లవుతుంది.    

ఆర్వోబీ.. కమ్యూనిటీ హాళ్లకు ఓకే
ఎమ్మెల్యే పేర్ని నాని నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి అడిగారు. మెడికల్‌ కాలేజీ వద్ద రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. 6 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నాం. అంబేడ్కర్‌ భవన్‌ మరమ్మతులకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నాం. మరో 12 గ్రామాలకు సంబంధించి ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తైన 12,615 ఎకరాలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌కు ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నాం. త్వరలో ఇవ్వబోయే అసైన్డ్‌ భూములు, లంక భూములకు సంబంధించిన పట్టాలతో పాటు వీరికి కూడా పట్టాలిస్తాం.     

రాక్షసులు.. వికృత ఆలోచనలు!
అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితమే ప్రారంభించాం. కానీ దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా టీడీపీ, గజదొంగల ముఠా అడ్డుపడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరికి ఒక దత్తపుత్రుడు కలిశాడు. వీళ్ల పని దోచుకోవడం పంచుకోవడం.. తినుకోవడమే. రాజధాని పేరుతో పేదవాళ్లకు ఏమాత్రం ప్రవేశం లేని ఓ గేటెడ్‌ కమ్యూనిటీని ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్ధలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ఈనెల 26న శ్రీకారం చుడుతున్నాం. 

పేదల ఇళ్ల కష్టాలు తెలుసా పెద్దమనిషి?
అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమిని ఉచితంగా ఇచ్చి ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తూ 50 వేల మంది కలలను నిజం చేస్తుంటే ఆ పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు. పేదలకు ఆయన ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇస్తుంటే శ్మశానంతో పోలుస్తాడు.

ఇలాంటి మనిషికి మాన­వత్వం ఉందా ? ఆ పెద్దమనిషికి పేదల కష్టాల గురించి అవగాహన ఉందా? సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసించే పేదలు ఎలా జీవిస్తున్నారో కనీసం అవగాహన ఉందా? ఆ కుటుంబాలలో ఎవరైనా ఒక మనిషి చనిపోతే శవాన్ని ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలో దిక్కు తోచని దుస్థి­తిలో అద్దె ఇళ్లలో ఎలా బతుకీడుస్తున్నారో కనీస స్పృహ ఉందా? కడసారి కూడా చూసుకునే భాగ్యం లేని పరిస్థితుల్లో, గుండెల నిండా బాధ ఉన్నా ఎక్కడకు వెళ్లి ఏడవాలో తెలియక శ్మశానాల వద్ద తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో ఎలా ఉంటు­న్నారో ఆలోచన చేయమని అడుగుతున్నాం.

చివరకు ఒక పక్షి సైతం ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది. తన పిల్లలతో పాటు ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా సొంత ఇళ్లు కట్టుకోలేని పరిస్థితుల్లో లక్షల మంది పేదలు­న్నారు. ఇది మానవత్వం లేని మనుషుల్లో కూడా పరివర్తన తెచ్చే విషయం. కానీ చంద్రబాబుకు మానవత్వం లేదు. పేదలకు మేలు చేసే కార్యక్ర­మాలను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు. ఆలోచన చేయండి. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు.

పేదల దగ్గరకు వచ్చి మేం ఫలానా మంచి చేశా­మని చెప్పుకోలేని పరిస్థితి వాళ్లది. వారి ఆలోచ­నలన్నీ కుళ్లు, కుతంత్రాలే. దత్తపుత్రుడ్ని, మీడి­యాను నమ్ముకుంటారట! వీళ్లంతా ఏకమైతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించగలు­గుతార? వారంతా ఏకమైతే మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టమట! మీ గుండెలపై చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలవండి. 

4 పోర్టులు.. లక్ష ఉద్యోగాలు
ఇప్పటివరకు రాష్ట్ర పోర్టుల వార్షిక సామర్ధ్యం 320 మిలియన్‌ టన్నులు కాగా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నులు పెంచేలా అడుగులు వేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నాలుగు చోట్ల 6 పోర్టులు మాత్రమే ఉండగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలోనే రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల పనులు వేగంగా జరిగేలా అడుగులు వేశాం. కాకినాడ వద్ద గేట్‌వే పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఒక్కో పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 25 వేల ఉద్యోగాలు వస్తాయి. నాలుగు పోర్టులు అందుబాటులోకి రాగానే లక్ష ఉద్యోగాలు దక్కుతాయి.  

మచిలీపట్నం పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపనతో కల సాకారం: సీఎం జగన్‌
రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్‌ నిర్మాణానికి మన ప్రభుత్వంలో సోమవారం శంకుస్థాపన చేశాం.. అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నాలుగు బెర్తులతో దాదాపు 35 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహదారి–216కి, గుడివాడ–మచిలీపట్నం రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తున్నాం’ అంటూ సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు.  

సముద్ర తీరంలో సీఎం పూజలు
సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించి హారతి  
సాక్షి ప్రతినిధి, విజయవాడ:  బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సముద్ర తీరంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. హెలీప్యాడ్‌ నుంచి పోర్టు నిర్మాణ పనులు జరిగే తపసిపూడి గ్రామ తీరానికి ఉదయం చేరుకున్నారు. ముందుగా దుర్గమ్మ చిత్రపటం వద్ద పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సాగరుడికి హారతి ఇచ్చారు.

అనంతరం సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం జెండా ఊపి కొండరాళ్లను సముద్రంలో వేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో మత్స్యకారులు సముద్రంలో బోట్లపై పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ శుభాభినందనలు తెలిపారు. అనంతరం పోర్టు పనుల ఫైలాన్‌ను సీఎం జగన్‌ ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ప్రారంభించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement