పోర్టుకు లక్ష ఎకరాల భూసమీకరణపై కలకలం
ఎంఏడీఏ పరిధిలోలక్షా 5 వేల ఎకరాల సేకరణకు కేబినెట్ ఆమోదంబందరు పోర్టుకు కావాల్సింది 4,800 ఎకరాలుఅనుబంధ పరిశ్రమల పేరుతో సమీకరణకు నిర్ణయం రైతుల భూములను గుంజుకునే యత్నాలపై సర్వత్రా ఆగ్రహం భూసమీకరణపై ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా.. ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా ప్రభుత్వ వైఖరి మారలేదు. ఒకపక్క రాజధాని ప్రాంతం భగ్గుమంటోంది. ఏలూరు కాల్వ కోసం భూసమీకరణ పేరెత్తితే గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బందరు పోర్టు కోసం 30 వేల ఎకరాలు తీసుకుంటామంటే గతంలో బందరు ప్రాంత గ్రామాల రైతులు నాయకుల్ని తరిమితరిమి కొట్టారు. ఇంత జరిగినా ఇప్పుడు మళ్లీ పోర్టు నిర్మాణం, అనుబంధ పరిశ్రమల పేరిట లక్ష ఎకరాలు భూసమీకరణ చేయాలని నిర్ణయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మచిలీపట్నం / సాక్షి, విజయవాడ : నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచేం దుకు టీడీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలను సేకరించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో నివ్వెరపోవటం జనం వంతయింది. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వచ్చిన పాలకులు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాల భూమి అవసరం కాగా, గత ఏడాది ఆగస్టు 31న 30 వేల ఎకరాలను పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భూసేకరణ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా 4,800 మందికి పైగా రైతులు ఆర్డీవో కార్యాలయంలో తమ అభ్యంతరాలను అందజేశారు.
ఎంఏడీఏ ఏర్పాటు
భూసేకరణ నోటిఫికేషన్ అయితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, భూసమీకరణ పేరుతో ముందుకు వెళితే ఇబ్బందులు ఉండవని ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సూచన మేరకు ఎంఏడీఏను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జీవో నంబరు 15ను ప్రభుత్వం జారీ చేసింది.
29 గ్రామాలు కనుమరుగు?
లక్ష ఎకరాలు ప్రభుత్వం భూసమీకరణ చేస్తే బందరు పురపాలక సంఘంతో పాటు 28 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామం కలిసి మొత్తం 29 గ్రామాలు కనుమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. సుమారు 2.50 లక్షల మంది ప్రజలు ఈ గ్రామాల్లో జీవి స్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ వరి, చేపలు, రొయ్యల సాగు మీదనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. మొత్తం 426 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే తమ జీవనాధారమే పోతుందని గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కేవలం పోర్టుకు కాకుండా అనుబంధ పరిశ్రమలకు కూడా భూసమీకరణ చేయడాన్ని రైతులు తప్పుపడుతున్నారు.
వ్యాపారానికి పెట్టుబడిగా చేస్తారా?
పోర్టు నిర్మించకుండా ఏవేవో పరిశ్రమలు నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రైతుల భూములను గుంజుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పేర్ని నాని ‘సాక్షి’కి తెలిపారు. 30 వేల ఎకరాల భూమికి నోటిఫికేషన్ ఇస్తేనే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, 1.05 లక్షల ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రభుత్వం చెబితే జీవనాధారం కోల్పోయే రైతులు పోరుబాట పడతారని ఆయన అన్నారు. రైతులను మోసం చేసి అత్యాశతో ముందడుగు వేస్తున్న టీడీపీ పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. అభివృద్ధి జరిగితే దాని ఫలాలను రైతులు కూడా అనుభవించాలని, ఇది సమంజసమని, టీడీపీ నాయకులే అనుభవిస్తామంటే రైతులు ఊరుకోరని స్పష్టంచేశారు.
జాడలేని పరిశ్రమలు...
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయిల్ రిఫైనరీ పరిశ్రమను బందరులో పెడతామని చెప్పారు. అప్పటి నుంచి ఒక్కడుగు ముందుకు పడలేదు. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్తా ముందుకు రాలేదు. అయినా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసమీకరణ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.