పచ్చటి బతుకుల్లో రాజధాని చిచ్చు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లో చిచ్చు రగులు తోంది. రైతుల అభిప్రాయాలు సేకరించాల్సిన మంత్రివర్గ ఉప సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తూ విభేదాలకు ఆజ్యం పోస్తోంది. రైతులు ఆందోళనపడే రీతిలో ప్రకటనలు చేస్తుండడంతో గ్రామాల్లో సభలు రసాభాస కావడమే కాకుండా రైతులు రెండు వర్గాలుగా విడిపోతున్నారు.
భూ సమీకరణకు రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గ్రామాలకు వస్తున్న మంత్రివర్గ ఉప సంఘంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చేలోపు అభిప్రాయ సేకరణ పూర్తి చేసి భూములు ఇచ్చేందుకు రైతులంతా అంగీకరించారనే విషయాన్ని చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను రైతులు తప్పుపడుతున్నారు.
భూములు ఇచ్చేది లేదని, చావడానికైనా సిద్ధమేనని చెబుతుంటే,భూ సమీకరణ సజావుగా సాగుతోందని సభ్యులు చేస్తున్న ప్రకటనలను రైతులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికితోడు ఉప సంఘం గ్రామానికి వచ్చే ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న హడావుడి రైతుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది.
గురు, శుక్రవారాల్లో జరిగిన సమావేశాల్లో రైతులు ఉప సంఘం సభ్యులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం మంత్రి పుల్లారావును రైతులంతా నిలదీశారు. సమావేశాన్ని నిలువరించే యత్నం చేశారు. రైతుల అభిప్రాయాలకు భిన్నంగా ఎలా ప్రకటనలు ఇస్తారని ప్రశ్నించారు. మేము ఈ భూములు ఇచ్చేది లేదు. ఇస్తామంటున్న రైతుల నుంచి భూములు తీసుకోండి, మీకో నమస్కారం, మా గ్రామం నుంచి వెళ్లండంటూ రైతులు విస్పష్టంగా చెప్పారు.
టీడీపీ సానుభూతిపరులైన కొందరు రైతులు ఉప సంఘానికి అనుకూలంగా సమావేశాల్లో మాట్లాడుతుండటంతో రెండు వర్గాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
గురువారం తుళ్లూరు మండలం లింగాయపాలెం రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని ఉప సంఘానికి స్పష్టం చేశారు. సంఘం సభ్యులు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ల సమక్షంలో ఎక్కువ మంది రైతులు భూ సమీకరణను వ్యతిరేకించారు.
దీనిపై ప్రభుత్వానికే ఇప్పటి వరకు స్పష్టత లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భూములెలా ఇస్తామని ప్రశ్నించారు. మెట్ట భూములు వదిలి, ఏడాదికి మూడు పంటలు పండే భూములను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీల గురించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
శుక్రవారం మందడం గ్రామ సమావేశానికి ఉప సంఘం మేళతాళాలతో చేరుకోవడం రైతులకు ఆగ్రహాన్ని కలిగించింది. అభిప్రాయ సేకరణకు వచ్చారా? టీడీపీ విజయోత్సవ ర్యాలీ కోసం వచ్చారా? అంటు ప్రశ్నించారు. భూములు కోల్పోతామనే భయంతో నిద్రాహారాలు లేక ఆందోళన చెందుతుంటే టీడీపీ జెండాలతో మేళతాళాలతో గ్రామానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రి పుల్లారావునైతే నిలదీశారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా ఇప్పుడు ఏవో ప్యాకేజీలు ఇస్తామంటూ చెప్పేస్తే ప్రజలు ఎలా నమ్మేస్తారంటూ ప్రశ్నించారు.
టీడీపీ అనుకూల రైతులు తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సుముఖంగా ఉన్నామని ప్రకటనలు చేస్తుంటే, రెండో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉప సంఘం ఎదుటే రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వివాదాలకు దిగుతున్నారు.
ఏదో ఓ రోజు పరిస్థితులు విషమించే అవకాశాలు ఉండటంతో పోలీసులు ముందుస్తు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.