దొంగరావిపాలెం వద్ద వశిష్ట గోదావరి లంకగట్టు మరింతగా కుంగుతోంది. శనివారం నుంచి గట్టులంక అండలుగా జారి నీటిలో కలిసిపోతోంది. ఆదివారం నాటికి 10 అడుగుల మేర కుంగిపోయింది. గోదావరిలో నెల రోజులపాటు నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గట్టు కుంగుతున్నట్టు బయటకు కనిపించలేదు.
దొంగరావిపాలెం (పెనుగొండ రూరల్), న్యూస్‌లైన్ : దొంగరావిపాలెం వద్ద వశిష్ట గోదావరి లంకగట్టు మరింతగా కుంగుతోంది. శనివారం నుంచి గట్టులంక అండలుగా జారి నీటిలో కలిసిపోతోంది. ఆదివారం నాటికి 10 అడుగుల మేర కుంగిపోయింది. గోదావరిలో నెల రోజులపాటు నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గట్టు కుంగుతున్నట్టు బయటకు కనిపించలేదు. గట్టులంక జారుతుండటంతో ఇక్కడ ప్రమాదం పొంచివున్న విషయూన్ని గత నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. అప్పట్లో వరదల నష్టనివారణ ప్రత్యేకాధికారి సంజయ్ జాజు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గట్టు పరిస్థితిని పరిశీలించారు. అరుుతే, వరద నీటి ప్రవాహం పోటెత్తడంతో అక్కడ ప్రమాద పరిస్థితి నెలకొందన్న విషయాన్ని గుర్తించలేదు.
స్థానిక అధికారులు సైతం సరిగా వివరించలేకపోయారు. దీంతో గట్టు మరమ్మతుల కోసం తయారుచేసిన ప్రతిపాదనలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. గోదావరిలో వరద నీరు తగ్గడంతో గట్టు పంచదారలా నీటిలో కరుగుతూ అండలుగా జారుతోంది. ఆధునికీకరణలో ఎత్తు చేసిన ఏటిగట్టు వరకూ గట్టులంక కోతకు గురైంది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 31.800 మైలు వద్ద నెలకొన్న ఈ పరిస్థితి వల్ల గోదావరిలో నీటిమట్టం మరోసారి పెరిగితే ఏటిగట్టుకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ప్రభుత్వం ఎత్తిపోతల పథకం నిర్వహించింది. 1990 ప్రాంతంలో దీనికి సమీపంలో దొంగరావిపాలెం గ్రామం ఎదురుగా ఇదే పరిస్థితి నెలకొని లంకభూమి మొత్తం కుంగిపోయింది. మొద ట్లో అధికారులు ఏటిగట్టుకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపినా, మరింతగా కుంగుతూ గట్టు వరకూ వచ్చింది. చివరి నిమిషంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించినా పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు.
నిధుల విడుదల ఎప్పుడో?
గోదావరి పొడవునా నాలుగైదు ప్రాంతాల్లో ఏటిగట్టుకు ముప్పు పొంచి ఉండటంతో మరమ్మతులకు రూ.40 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేటికీ విడుదల కాకపోవడంతో అధికారులు చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్ప నిధులు మంజూరు కావని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రమాద నివారణకు వెంటనే నిధులు మంజూరుచేసి గట్టు మరమ్మతులు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.