
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది: గట్టు
* వ్యవసాయం గురించి బాబు మాట్లాడటంపై ఎద్దేవా
* ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. తన తొమ్మిదేళ్ల హయాంలో వ్యవసాయం, ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ అనే మాటలను ఉచ్ఛరించడమే ఆయన అవమానంగా భావించేవారన్నారు. పంటకు చీడపురుగులా వ్యవసాయరంగాన్ని సర్వనాశనం చేసిన బాబు.. నీళ్లు, వ్యవసాయం, రైతులు అంటూ మాట్లాడటం చూసి తెలుగు ప్రజానీకం నవ్వుకుంటోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు బాబు పాపాల వల్లే అని ప్రజలు భావిస్తుంటే, గోబెల్స్ ప్రచారానికి అలవాటుపడిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందే రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టి ఉంటే మిగులు జలాల విషయంలో అన్యాయం జరిగేది కాదన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదనే ఆలోచనతో వైఎస్ జలయజ్ఞం ప్రారంభించారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తర్వాత వచ్చే ట్రిబ్యున ళ్లు నీటి కేటాయింపులు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే వైఎస్ వాటిని చేపట్టారన్నారు.
అయితే కర్ణాటక, మహారాష్ట్రలు మన ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. మిగులు జలాలపై కింది రాష్ట్రాలకు ఉండే స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నామే తప్ప హక్కుగా కోరడంలేదని వైఎస్ ట్రిబ్యునల్‌కు వివరించినట్లు గట్టు తెలిపారు. ఇదంతా తెలిసి కూడా టీడీపీ నేతలు కావాలనే ఆయనపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిత్యం ఆకాశానికెత్తే ఆ రెండు దిన పత్రికలు కూడా కృష్ణాజలాల విషయంలో బాబు వైఫల్యంపై అప్పట్లో పలు కథనాలు వెలువరించాయని ‘ఈనాడు’లో వచ్చిన వార్తా కథనాలను చూపించారు.