
లగడపాటివి బెట్టింగ్ సర్వేలు: గట్టు
హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వేలు బెట్టింగ్‌ల కోసమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానంటున్న లగడపాటి.. సంపాదనే లక్ష్యంగా బెట్టింగ్ వ్యాపారం మొద లు పెట్టారని, అందులో భాగంగానే సర్వేలంటూ చిలకజోస్యం చెబుతున్నారని విమర్శించారు.
పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకి సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయని తెలిసిన తర్వాత ఆ పార్టీ గెలుస్తుందని లగడపాటి భారీగా బెట్టింగ్‌లు కాశారని, దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉందన్నారు. అయితే, బెట్టింగ్ కోసం టీడీపీ వాళ్లు ముందుకు రాకపోయేసరికి వారిని నమ్మించేందుకు లగడపాటి ఒక హైప్ సృష్టిస్తున్నారని ఆరోపించారు.