
రెండెకరాల భూమిని చూపమంటే.. ఆరడుగుల నేల ఇచ్చారు!
బనగానపల్లె రూరల్ : ‘నా రెండు ఎకరాల భూమిని బంధువులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.. భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేరిస్తే ఆక్రమణకు అవకాశం ఉండదు’.. అంటూ ఓ రైతు తహశీల్దార్ కార్యాలం చుట్టూ తిరిగినా అధికారులు కనికరించలేదు. మూడు నెలలుగా రెండెకరాల భూమి కోసం పోరాడితే చివరకు అధికారులు ఆరడుగుల నేల చూపారు. వీఆర్వో జాపాన్ని నిరసిస్తూ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన బలరాముడు (40) చికిత్స పొందుతూ మంగళవారం మృతి మృతి చెందాడు. కాగా రైతు కుటుంబానికి న్యాయం చేయాలని సాయంత్రం బనగానపల్లె పెట్రోల్ బంక్ కూడలి వద్ద రైతు మృతదేహంతో ప్రజా సంఘాల నాయకులు, మృతుడు బంధువులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ స్తంభించడంతో బనగానపల్లె సీఐ శ్రీనివాసులు వారితో చర్చించి తహశీల్దార్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేయాలని ఆందోళనకారులకు సూచించారు. అయిన కూడా ఆందోళనకారులు వినకుండా సుమారు గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఐ ఇచ్చిన సలహా మేరకు మళ్లీ అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు.
రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం:
సమాచారం అందుకున్న కలెక్టర్ విజయ మోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ హుటాహుటిన బనగానపల్లె చేరుకుని బలరాముడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను ఆర్డీఓ, తహశీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి భార్య ఉశేనమ్మను, కుమారుడు రఘు, రాఘవను కూడా కలెక్టర్ విచారించారు. ఎన్ని రోజుల నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు.. వీఆర్వో ఆన్‌లైన్ చేయడం లేదన్న విషయాన్ని ఆర్డీఓకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. ప్రజావాణిలో ఎందుకు వినతి పత్రం అందజేయలేదని ప్రశ్నించారు.
రైతులు చిన్న విషయాలకు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోరాదని, ప్రజాదర్బార్‌లో తనకు స్వయంగా ఫిర్యాదు చేయాలన్నారు. బలరాముడిని బతికించేందుకు కర్నూలులో అన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలించలేదన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి 2.5 ఎకరాల భూమి బుధవారం సాయంత్రంలోగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రూ. 5 లక్షలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి స్పందిస్తూ వీఆర్వో ఆన్‌లైన్ చేయడం లేదన్న విషయాన్ని తనకెందుకు ఫిర్యాదు చేయ్యలేదని, విషయం తెలిసి ఉంటే వెంటనే పరిష్కరించేవాడినని తెలిపారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబ సభ్యులకు రూ. 10 వేలు అందజేశారు.
రాళ్లకొత్తూరు వీఆర్వో సస్పెన్షన్
బనగానపల్లె: రాళ్లకొత్తూరు వీఆర్వో నారాయణరెడ్డిని సస్పెన్షన్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ రాళ్లకొత్తూరుకు చెందిన రైతు బలరాముడు తన పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయనందుకు వీఆర్వోపై మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో వీఆర్వోపై ఈ చర్యలు తీసుకున్నామన్నారు. సర్వేయర్ నాగారాజుపై కూడా జాయింట్ కలెక్టర్ హరికిరణ్, ఆర్డీవో సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని నియమించామన్నారు. వీరి నుంచి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపా రు. కార్యాలయంలో వీఆర్వోలు, ఇతర సిబ్బంది పనితీరుపై తహశీల్దార్ అజమాయిషి ఉండాలన్నారు. తహశీల్దార్ కార్యాలయం చోటు చేసుకునే విషయాలు తమకు తెలీదని తప్పించుకోవడం సరికాదన్నారు.