ఎక్కడి బస్సులు అక్కడే
రహదారి బిల్లును వ్యతిరేకిస్తూ నేడు సార్వత్రిక సమ్మె
ఆటోలు సహా రవాణా వాహనాలన్నీ నిలిపివేత
హైదరాబాద్: జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్‌లు, లారీలు వంటి ప్రైవేటు రవాణా వాహనాలన్నీ ఆగిపోనున్నాయి. ఎన్‌ఎంయూలోని ఒక వర్గం మినహా మిగతా కార్మిక సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. దీంతో బుధవారం బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ సమ్మె నేపథ్యంలో ప్రత్యేకంగా ఆవిర్భవించిన జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, రాజిరెడ్డి, శివాజీ, అంజయ్య తదితరులు సంపూర్ణ సమ్మె నిర్వహిస్తున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తగా చేయబోయే చట్టం వల్ల రవాణా సంస్థల ప్రైవేటీకరణ జరిగే ప్రమాదం ఉందని, దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే సమ్మెకు సంబంధించి కార్మిక సంఘాలు ఇప్పటికే నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక క్యాబ్ సర్వీసులు, ఆటోలు కూడా నిలిచిపోనున్నాయి.
లారీ యజమానుల సంఘం కూడా సమ్మెకు సంఘీభావంగా లారీలను నిలిపివేయనున్నారు. ఇక సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. ఐటీ కారిడార్లు మినహా నగరంలోని ఇతర ప్రాంతాల్లో సమ్మెలో పాల్గొననున్నట్లు ట్యాక్సీలు, క్యాబ్‌ల సంఘం ప్రకటించింది. దీంతో నగరంలోని 3,800 బస్సులు, లక్షా 25 వేల ఆటోల్లో రాకపోకలు సాగించే సుమారు 40 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది.
పలు సంఘాల మద్దతు: కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంఘం (సెర్ప్/ఐకేపీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం అన్ని జిల్లాల్లో సెర్ ్ప /ఐకేపీ ఉద్యోగులందరూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సయ్య పిలుపునిచ్చారు. కాగా సార్వత్రిక సమ్మెకు కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్‌ఐ-ఎంఎల్) ఏపీ, తెలంగాణ కమిటీ మద్దతు ప్రకటించింది. ఎన్డీయే ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె పిలుపును బలపరుస్తున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి వినోద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.