తాడిపత్రి : తాడిపత్రి సమీపంలోని గెర్డెవ్ ఉక్కు కర్మాగారంలో కార్మిక చట్టాలు అమలవుతున్న తీరుపై స్థానిక పోలీసుల విచారణ మొక్కుబడిగా సాగింది. ఏదైనా ఒత్తిడా.. లేక మరో కారణమో తెలీదు కానీ విచారణ సాగిన తీరు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు.. ఒడిశా కార్మికులను నిర్బంధించి.. జీతాలు ఇవ్వకుండా వారితో చాకిరీ చేయించుకుంటున్న విషయాన్ని ‘లోగుట్టేంటి?’ శీర్షికన సాక్షి గురువారం
వెలుగులోకి తేవడంపై జిల్లా ఎస్పీ స్పందించారు. వెంటనే విచారణ చేపట్టాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ వెంకటరెడ్డి, ఎస్‌ఐ రఘుప్రసాద్ గురువారం సాయంత్రం గెర్డెవ్ కర్మాగారంలోని లేబర్ కాలనీకి వెళ్లారు. పోలీసులు వస్తున్నట్లు ముందుగా సమాచారం అందుకున్న యాజమాన్యం.. కాలనీలో ఎక్కువ మంది కార్మికులు లేకుండా జాగ్రత్త తీసుకుంది. కూలీలు కాని వారిని.. కూలీలుగా చూపుతూ పోలీసుల ముందుంచింది. కాసేపు వారితో మాట్లాడిన పోలీసులు అక్కడి నుంచి వచ్చేశారు.
కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమన్యంతో కానీ, కార్మికులతో పని చేయిస్తున్న కాంట్రాక్టర్‌తో కానీ మాట్లాడలేదు. అనంతరం రూరల్ పోలీస్టేషన్‌లో విలేకరులతో సీఐ మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం లేకుండా 18 మంది కార్మికులను ఒడిశా రాష్ట్రానికి తరలించిన మాట వాస్తవమేనన్నారు. ఇంకా నిర్బంధంలో ఉన్న కార్మికుల గురించి విచారణ చేస్తున్నామన్నారు. తాము వెళ్లిన సమయంలో కార్మికులు పని చేస్తుండటంతో పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఫొటోను మీడియాకు అందజేశారు. ఆ ఫొటోలో ఉన్న వారు కార్మికులంటే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే.
దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన యాజమాన్యం
సెక్యూరిటీ విభాగం అధికారులపై తాడిపత్రి ప్లాంట్ ప్రధాన ఇన్‌చార్జి జార్జి ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. హైదరాబాద్‌లో ఉన్న ఉప ప్రధాన కార్యాలయంలోని అధికారులు దీనిపై నివేదిక తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. కార్మికులకు సంబంధించి ప్రధాన కాంట్రాక్ట్ పొందిన ఎన్‌సీసీ సంస్థ మళ్లీ సబ్ కాంట్రాక్ట్ చందన సంస్థకు ఇవ్వడంపై కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. ఎన్‌సీసీ ప్రతినిధి సోమయాజులు హైదరాబాద్ నుంచి సాయంత్రం వచ్చి డీజీఎం కుట్టి, ఏజీఎం జార్జ్‌లతో చర్చించారు. కార్మికుల విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. కార్మికులకు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పి నిర్బంధంలో లేమని చె ప్పించేందుకు యాజమాన్యం, కాంట్రాక్ట్ సంస్థ ప్రయత్నలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న ఒడిశా కార్మికుల వద్ద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి వారితో కాంట్రాక్టర్ తరఫు ప్రతినిధులు తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు సమాచారం. మరోవైపు యాజమాన్యం కూడా దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు, కార్మిక శాఖ అధికారులు తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేలా చూడాలని కోరినట్లు సమాచారం.
..ష్ గప్ చుప్!
Published Fri, Aug 8 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement