ఎయిర్‌పోర్టు.. రైతుల భూములు హాంఫట్
► భూ సమీకరణకు రంగం సిద్ధం
► నాటకీయంగా ముగిసిన చిట్టచివరి సమావేశం
► పది రోజుల్లో భూములు స్వాధీనానికి చర్యలు
విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చే రైతులకు నిబంధనల ప్రకారమే పరిహారం ఇస్తామని, లేకుంటే పూలింగ్‌కు సిద్ధం కావాలని కలెక్టర్ బాబు.ఎ స్పష్టం చేశారు.
విజయవాడ : ఐదారు మాసాలుగా ఎడతెరిపి లేకుండా నెలవారీ సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్న అధికారులు ఎయిర్‌పోర్టు భూ సమీకరణకు ఇచ్చే పరిహారం విషయమై చివరకు తుస్సుమనిపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు భూమికి పరిహారం ఇస్తామని, లేకుంటే ల్యాండ్‌పూలింగ్‌కు సిద్ధం కావాలని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. బుధవారం నాటకీయంగా ముగిసిన సమావేశంలో రైతుల నిరసనల మధ్యే భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని కలెక్టర్ బాబు.ఏ ప్రకటించారు. రైతులు, రైతు నాయకులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకు కసరత్తు చేస్తోంది. మొదటి దశలో 417.26 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సమీకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. కేసరపల్లి గ్రామంలో 114.06ఎకరాలు, అజ్జంపూడిలో 106.64 ఎకరాలు భూ సమీకరణకు అధికారులు కొద్దిమాసాల క్రితం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కేసరపల్లిలో 64 మంది రైతులు, అజ్జంపూడిలో 61మంది, బుద్ధవరంలో 280 మంది రైతుల ప్రైవేటు భూములను సమీకరించేందుకు అధికారులు ప్రణాళిక పూర్తిచేశారు.
రైతుల నిరసనల మధ్య అవార్డు ప్రకటించిన కలెక్టర్
రైతులతో జరిపిన తుది విడత చర్చలలో కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ పది రోజుల్లో భూ సమీకరణ చేస్తామన్నారు. అజ్జంపూడిలో రూ. 46 లక్షలు, బుద్ధవరంలో రూ.57 లక్షలు, కేసరపల్లిలో రూ. 97 లక్షల చొప్పున ఒక్కో ఎకరానికి పరిహారం ఇస్తామని ప్రకటించారు. ల్యాండ్ ఎక్విజేషన్ కాకపోతే ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరిస్తే తుళ్లూర ప్రాంతంలో ఒక ఎకరానికి 1000 చదరపు అడుగుల నివాశస్థలం, 450 చదరపు అడుగుల కమర్షియల్ స్థలం ఇస్తామని పేర్కొన్నారు. ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకోవాలని సూచించారు.
రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ. 576 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. 10 రోజుల్లో డబ్బు చెల్లించి భూమలు సమీకరిస్తామని చెప్పారు. బుద్ధవరంలో 200మంది ఇళ్లు కోల్పోకుండా ఎయిర్‌పోర్టు రన్‌వే అలైన్‌మెంటును మార్పు చేశామన్నారు. దావాజీగూడెంలో ఇళ్లు కోల్పోతున్న 100 కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా వేరొకచోట ఇళ్లు కటి ్టఇస్తామని చెప్పారు.
పరిహారం విషయంలో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూడు గ్రామాలకు కలిపి ఒకే విధమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే తుది నిర్ణయమని కలెక్టర్ సమావేశాన్ని ముగించేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నూజివీడు ఆర్డీవో రంగయ్య, గన్నవరం తహశీల్దార్ మాధురి, రైతు నాయకులు కడియాల రాఘవరావు, వై.నరసింహారావు పాల్గొన్నారు.
నేటినుంచి రైతులకు అవార్డు పాస్
గన్నవరం : విమానాశ్రయ విస్తరణలో భూములు కొల్పోతున్న రైతులకు ఈ నెలఖరు వరకు అవార్డు పాస్ చేసే కార్యక్రమం జరుగుతుందని నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో గురువారం నుంచి ఈనెల 30 వరకు అవార్డు పాస్ చేసేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. రైతులకు ఏమైన సందేహాలు ఉంటే సదరు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్‌తో తహశీల్దారును సంప్రదించాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేసి అవార్డు పాస్ చేసేందుకు చర్యలు తీసుకుంటారని వివరించారు.
ప్రాణాలిస్తాం.. భూములివ్వం
భూములు కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తాం. భూములు మాత్రం ఇచ్చేది లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తున్నారు. అనవసరంగా భూములు లాక్కుంటున్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వకుండా సన్నచిన్నకారు రైతులను నిలువునా ముంచేశారు. ప్రైవేటు మార్కెట్ విలువ ఎకరం మూడు కోట్ల ధర పలుకుతుండగా కేవలం రూ.50లేదా, రూ.60 లక్షలకు భూములు లాక్కునేందుకు ప్రభుత్వం చూస్తోంది. రైతుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది.
నాయిని శ్రీనివాసరావు, రైతు, బుద్ధవరం
న్యాయపోరాటం చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు భూ సమీకరణ విషయంలో మెండివైఖరి అవలంబిస్తోంది. రైతులకు అన్యాయం చేసింది. భూ సేకరణ చట్టం 26బి క్లాజ్‌లో చుట్టుపక్కల గ్రామాల్లో అధికంగా ఉన్న ప్రభుత్వ భూమి విలువ ప్రకారం మార్కెట్ ధర కేటాయించాలి. మూడు గ్రామాల్లో ఒకే రేటును పరిహారంగా ఇవ్వాలి. ఇప్పటికే కోర్టులో కేసు జడ్జిమెంటు రిజర్వ్‌లో ఉంది. పరిహారంపై న్యాయపోరాటం చేస్తాం.
చింతపల్లి సీతారామయ్య, బుద్ధవరం