Airport expansion
-
విమానాశ్రయాలపై రూ.20,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.20,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్మాణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను ఏర్పరిచామని కంపెనీ వార్షిక నివేదికలో గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం మౌలిక వసతుల విస్తరణ, టెర్మినల్ వార్షిక సామర్థ్యం 10 కోట్ల ప్రయాణికుల స్థాయికి పెంపు పనులు జరుగుతున్నాయి. ఫేజ్ 3ఏ విస్తరణ 2023 జూన్ నాటికి పూర్తి కానుంది. 2022 సెప్టెంబర్ నాటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వార్షిక సామర్థ్యం 3.5 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుకుంటుంది’ అని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కర్ణాటకలోని బీదర్, ఫిలి ప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తోంది. నాగ్‌పూర్ విమానాశ్రయం..: నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో జీఎంఆర్‌కు అనుకూలంగా బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కంపెనీ తదుపరి ప్రణాళిక వెల్లడించింది. నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధిలో భాగంగా వార్షిక సామర్థ్యాన్ని రాబోయే కాలంలో 3 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేర్చనున్నారు. నాలుగేళ్లలో పూర్తి కానున్న తొలి దశలో 40 లక్షల ప్రయాణికులు, 20,000 మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించే స్థాయికి విమానాశ్రయం చేరనుంది. -
ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూసమీకరణే
ఏలూరు కాలువ మళ్లింపునకు కూడా.. - వారంరోజుల్లో చర్యలు - అధికారులతో కలెక్టర్ సమీక్ష విజయవాడ : గన్నవరంలో ఏలూరు కాలువ మళ్లింపు, ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన భూములను సమీకరించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. విమానాశ్రయం అభివృద్ధిలో భాగంగా 697.02ఎకరాలు సమీకరించడానికి వారంరోజుల్లో ప్రకటన జారీ చేయాలని సూచించారు. తన చాంబర్లో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. ఇందుకోసం సీఆర్డీఏ ద్వారా భూ సమీకరణకు మార్గదర్శకాలను జారీచేసినట్లు తెలిపారు.గతంలో 431.02 ఎకరాలు సేకరించేందకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. మరో 266.00 ఎకారాలు ఏలూరు కాలువ మళ్లింపు కోసం సేకరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం దీనికోసం నాలుగు షెడ్యూల్స్‌తో కూడిన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పట్టా, ఎండోమెంట్,వక్ఫ్, స్థలాలకు సంబంధించి ఎకరానికి సీఆర్డీఏ పరిధిలో వెయ్యి గజాల ఇంటిస్థలం, వ్యాపార కూడలి ప్రాంతంలో 450 గజాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అలైన్డ్ భూములకు సంబంధించి ఇంటిస్థలం 800 గజాలు, వ్యాపారకూడలి ప్రాంతంలో 200 గజాలు ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ భూసమీకరణకు ఆమోదం తెలిపితే సీఆర్డీఏ పరిధిలో అవలంభిస్తున్న అన్ని అంశాలను వర్తింపజేయనున్నట్లు వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నూజివీడు ఆర్డీవో సి.హెచ్. రంగయ్య, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఎస్ఈ రామకృష్ణ, ఆర్.అండ్.బి. ఎస్ఈ శేషుకుమార్, ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజకిషోర్, సీఆర్డీఏ సలహాదారు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్టు.. రైతుల భూములు హాంఫట్
► భూ సమీకరణకు రంగం సిద్ధం ► నాటకీయంగా ముగిసిన చిట్టచివరి సమావేశం ► పది రోజుల్లో భూములు స్వాధీనానికి చర్యలు విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చే రైతులకు నిబంధనల ప్రకారమే పరిహారం ఇస్తామని, లేకుంటే పూలింగ్‌కు సిద్ధం కావాలని కలెక్టర్ బాబు.ఎ స్పష్టం చేశారు. విజయవాడ : ఐదారు మాసాలుగా ఎడతెరిపి లేకుండా నెలవారీ సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్న అధికారులు ఎయిర్‌పోర్టు భూ సమీకరణకు ఇచ్చే పరిహారం విషయమై చివరకు తుస్సుమనిపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు భూమికి పరిహారం ఇస్తామని, లేకుంటే ల్యాండ్‌పూలింగ్‌కు సిద్ధం కావాలని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. బుధవారం నాటకీయంగా ముగిసిన సమావేశంలో రైతుల నిరసనల మధ్యే భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని కలెక్టర్ బాబు.ఏ ప్రకటించారు. రైతులు, రైతు నాయకులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకు కసరత్తు చేస్తోంది. మొదటి దశలో 417.26 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సమీకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. కేసరపల్లి గ్రామంలో 114.06ఎకరాలు, అజ్జంపూడిలో 106.64 ఎకరాలు భూ సమీకరణకు అధికారులు కొద్దిమాసాల క్రితం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కేసరపల్లిలో 64 మంది రైతులు, అజ్జంపూడిలో 61మంది, బుద్ధవరంలో 280 మంది రైతుల ప్రైవేటు భూములను సమీకరించేందుకు అధికారులు ప్రణాళిక పూర్తిచేశారు. రైతుల నిరసనల మధ్య అవార్డు ప్రకటించిన కలెక్టర్ రైతులతో జరిపిన తుది విడత చర్చలలో కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ పది రోజుల్లో భూ సమీకరణ చేస్తామన్నారు. అజ్జంపూడిలో రూ. 46 లక్షలు, బుద్ధవరంలో రూ.57 లక్షలు, కేసరపల్లిలో రూ. 97 లక్షల చొప్పున ఒక్కో ఎకరానికి పరిహారం ఇస్తామని ప్రకటించారు. ల్యాండ్ ఎక్విజేషన్ కాకపోతే ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరిస్తే తుళ్లూర ప్రాంతంలో ఒక ఎకరానికి 1000 చదరపు అడుగుల నివాశస్థలం, 450 చదరపు అడుగుల కమర్షియల్ స్థలం ఇస్తామని పేర్కొన్నారు. ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ. 576 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. 10 రోజుల్లో డబ్బు చెల్లించి భూమలు సమీకరిస్తామని చెప్పారు. బుద్ధవరంలో 200మంది ఇళ్లు కోల్పోకుండా ఎయిర్‌పోర్టు రన్‌వే అలైన్‌మెంటును మార్పు చేశామన్నారు. దావాజీగూడెంలో ఇళ్లు కోల్పోతున్న 100 కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా వేరొకచోట ఇళ్లు కటి ్టఇస్తామని చెప్పారు. పరిహారం విషయంలో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూడు గ్రామాలకు కలిపి ఒకే విధమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే తుది నిర్ణయమని కలెక్టర్ సమావేశాన్ని ముగించేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నూజివీడు ఆర్డీవో రంగయ్య, గన్నవరం తహశీల్దార్ మాధురి, రైతు నాయకులు కడియాల రాఘవరావు, వై.నరసింహారావు పాల్గొన్నారు. నేటినుంచి రైతులకు అవార్డు పాస్ గన్నవరం : విమానాశ్రయ విస్తరణలో భూములు కొల్పోతున్న రైతులకు ఈ నెలఖరు వరకు అవార్డు పాస్ చేసే కార్యక్రమం జరుగుతుందని నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో గురువారం నుంచి ఈనెల 30 వరకు అవార్డు పాస్ చేసేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. రైతులకు ఏమైన సందేహాలు ఉంటే సదరు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్‌తో తహశీల్దారును సంప్రదించాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేసి అవార్డు పాస్ చేసేందుకు చర్యలు తీసుకుంటారని వివరించారు. ప్రాణాలిస్తాం.. భూములివ్వం భూములు కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తాం. భూములు మాత్రం ఇచ్చేది లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తున్నారు. అనవసరంగా భూములు లాక్కుంటున్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వకుండా సన్నచిన్నకారు రైతులను నిలువునా ముంచేశారు. ప్రైవేటు మార్కెట్ విలువ ఎకరం మూడు కోట్ల ధర పలుకుతుండగా కేవలం రూ.50లేదా, రూ.60 లక్షలకు భూములు లాక్కునేందుకు ప్రభుత్వం చూస్తోంది. రైతుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. నాయిని శ్రీనివాసరావు, రైతు, బుద్ధవరం న్యాయపోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు భూ సమీకరణ విషయంలో మెండివైఖరి అవలంబిస్తోంది. రైతులకు అన్యాయం చేసింది. భూ సేకరణ చట్టం 26బి క్లాజ్‌లో చుట్టుపక్కల గ్రామాల్లో అధికంగా ఉన్న ప్రభుత్వ భూమి విలువ ప్రకారం మార్కెట్ ధర కేటాయించాలి. మూడు గ్రామాల్లో ఒకే రేటును పరిహారంగా ఇవ్వాలి. ఇప్పటికే కోర్టులో కేసు జడ్జిమెంటు రిజర్వ్‌లో ఉంది. పరిహారంపై న్యాయపోరాటం చేస్తాం. చింతపల్లి సీతారామయ్య, బుద్ధవరం -
సమాన పరిహారం ఇస్తేనే..
గన్నవరం : కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం అందరికీ సమాన పరిహారం ఇస్తేనే తమ భూములు విమానాశ్రయ విస్తరణకు ఇస్తామని రైతులు తేల్చిచెప్పారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి గ్రామాలకు చెందిన రైతులతో నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ కావాలో, పరిహారం కావాలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు రైతులకు అంగీకార పత్రాలు పంపిణీ చేశారు. మార్కెట్ ధర ప్రకారం తమ గ్రామాల్లో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం నామమాత్రపు పరిహారం అందజేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోందని రైతులు చెప్పారు. ప్రభుత్వం భూసేకరణ చేయనున్న గ్రామాల్లో అత్యధిక రిజిస్ట్రేషన్ ధర కలిగిన కేసరపల్లి భూములకు ఇచ్చే ఎకరానికి రూ.79 లక్షల వరకు పరిహారాన్ని మిగిలిన గ్రామాల రైతులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించిన కొంతమంది రైతులు మాత్రం తమకు తుళ్లూరులోని జరీబు రైతులకు ఇస్తున్న ప్యాకేజీని వర్తింపజేస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఈ విషయాలను ఇటీవల హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబునాయుడును కూడా కలిసి విన్నవించామని తెలిపారు. తమ డిమాండ్ల మేరకు న్యాయమైన పరిహారం ఇస్తే భూసేకరణకు సహకరిస్తామని, లేనిపక్షంలో న్యాయమైన పరిహారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. విస్తరణ కారణంగా ఇళ్లు పోతున్న దళితులకు ఆర్టీసీ అకాడమీలోని ఖాళీ స్థలాన్ని గాని, వెటర్నరీ భూములు గాని కేటాయించాలని కోరారు. తహశీల్దార్ ఎం.మాధురి, వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్య, నిర్వాసిత రైతు సంఘ నాయకులు చింతపల్లి సీతారామయ్య, ముక్కామల ఉమామహేశ్వరరావు, వై.నరసింహారావు, గూడవల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయాల విస్తరణపై దృష్టి
సచివాలయంలో సీఎంను కలిసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విమానాశ్రయాల విస్తరణపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. అశోక్ గజపతిరాజు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ విమానాశ్రయం విస్తరణకు నావికాదళం నుంచి భూమిని ఎలా తీసుకోవాలనే అంశంపై చర్చించారు. తిరుపతి విమానాశ్రయం విస్తరణకు భూమి సమస్య కాదని అభిప్రాయపడ్డారు. గన్నవరం విమానాశ్రయానికి ఒకవైపు కాలువలు, మరోవైపు జాతీయ రహదారి ఉన్నందున, ఇక్కడ విస్తరణ ఏ విధంగా చేపట్టాలో పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మూడు విమానాశ్రయాలను సందర్శించి, వాటి విస్తరణ, అంతర్జాతీయ హోదాకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి రావాలని అశోక్ గజపతిరాజును సీఎం కోరినట్లు సమాచారం. 22న ఢిల్లీకి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. 23వ తేదీ నుంచి చంద్రబాబు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు. సింగపూర్ పర్యటన విజయవంతమైంది తన సింగపూర్ పర్యటన విజయవంతమైందని సీఎం చంద్రబాబు ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.