ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూసమీకరణే
ఏలూరు కాలువ మళ్లింపునకు కూడా..
- వారంరోజుల్లో చర్యలు
- అధికారులతో కలెక్టర్ సమీక్ష
విజయవాడ : గన్నవరంలో ఏలూరు కాలువ మళ్లింపు, ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన భూములను సమీకరించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. విమానాశ్రయం అభివృద్ధిలో భాగంగా 697.02ఎకరాలు సమీకరించడానికి వారంరోజుల్లో ప్రకటన జారీ చేయాలని సూచించారు. తన చాంబర్‌లో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. ఇందుకోసం సీఆర్‌డీఏ ద్వారా భూ సమీకరణకు మార్గదర్శకాలను జారీచేసినట్లు తెలిపారు.గతంలో 431.02 ఎకరాలు సేకరించేందకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. మరో 266.00 ఎకారాలు ఏలూరు కాలువ మళ్లింపు కోసం సేకరించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం దీనికోసం నాలుగు షెడ్యూల్స్‌తో కూడిన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పట్టా, ఎండోమెంట్,వక్ఫ్, స్థలాలకు సంబంధించి ఎకరానికి సీఆర్‌డీఏ పరిధిలో వెయ్యి గజాల ఇంటిస్థలం, వ్యాపార కూడలి ప్రాంతంలో 450 గజాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అలైన్డ్ భూములకు సంబంధించి ఇంటిస్థలం 800 గజాలు, వ్యాపారకూడలి ప్రాంతంలో 200 గజాలు ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ భూసమీకరణకు ఆమోదం తెలిపితే సీఆర్‌డీఏ పరిధిలో అవలంభిస్తున్న అన్ని అంశాలను వర్తింపజేయనున్నట్లు వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నూజివీడు ఆర్డీవో సి.హెచ్. రంగయ్య, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఎస్‌ఈ రామకృష్ణ, ఆర్.అండ్.బి. ఎస్‌ఈ శేషుకుమార్, ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజకిషోర్, సీఆర్‌డీఏ సలహాదారు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.