సారంగాపూర్: మండలంలోని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు సమీపంలో 10 ఎకరాల స్థలంలో నాబార్డు వారి సహకారంతో నిర్మించ తలపెట్టిన నియోజకవర్గస్థాయి వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం కేటాయించిన భూములను శనివారం జిల్లా కలెక్టర్ జగన్మోహన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మండల కేంద్రాలలో మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని అన్నారు. ఇందులో భాగంగానే చించోలి(బి) గ్రామ సమీపంలో స్థల పరిశీలన జరిపామని పేర్కొన్నారు. పాత ఎన్‌హెచ్-7ను ఆనుకుని ఉన్న ఈ స్థలం సేకరించడం వల్ల అన్నిరకాలుగా కలిసి వస్తుందని రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
మార్కెట్ యార్డుకు పక్కనే ఆర్టీసీ డిపో వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. ఇది జరిగితే భవిష్యత్తులో ఈ ప్రాంత రైతులకు అనేక రకాలుగా ఉపయోగం ఉంటుందని అన్నా రు. పెద్ద మార్కెట్ యార్డుల కోసం ఆసిఫాబాద్, భైంసా, చించోలి(బి) గ్రామాల్లో స్థల సేకరణ పూర్తయిందని, సంబంధించిన భూములను మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. జిల్లాలోని 37 మండలాల్లో 5 ఎకరాల స్థలంలో మార్కెట్ యార్డుల కోసం స్థల సేకరణ పూర్తి చేశామని అన్నారు. 22 మండలాల్లో మార్కె ట్ యార్డులకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని తెలిపా రు. మిగతా 15 మండలాల్లో మార్కెట్ నిర్మాణంకోసం స్థలం, ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని అన్నారు. పనులు సైతం వేగవంతంగా చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ రాజేశ్వర్ సదరు భూములకు సంబందించిన పూర్తి అధికారాలను మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీనివాస్‌కు అందజేశారు.
భూములు కోల్పోయాం.. ఆదుకోండి సారూ..
మండలంలోని చించోలి(బి) గ్రామానికి చెందిన 37 మం ది భూములు లేని రైతులకు రైతులకు ప్రస్తుతం మార్కెట్ యార్డు నిర్మించడానికి కేటాయించిన సర్వే నంబరు 529లో 18 ఎకరాల 20 గుంటల సీలింగ్ పట్టాలను 1979 లో అప్పటి అధికారులు పంపిణీ చేశారు. అదే భూమిని నమ్ముకుని రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈక్రమంలో మార్కెట్ స్థలం కోసం ప్రభుత్వం సదరు భూములను కేటాయించడంతో తాము నష్టపోతున్నామని రైతులు జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పక్కనే ఉన్న సారంగాపూర్ తహశీల్దార్ జాడి రాజేశ్వర్‌ను పిలిచి వెం టనే మార్కెట్‌కు కేటాయించగా మిగిలిన స్థలాన్ని రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈయన వెంట మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీనివాస్, ల్యాండ్ సర్వే అధికారులు, ఎంఆర్‌ఐ పాండు, వీఆర్వో సురేందర్ తదితరులు ఉన్నారు.
భూములు పరిశీలించిన జిల్లా కలెక్టర్
Published Sun, May 10 2015 2:49 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement