రూ.కోట్ల విలువైన భూములకు రక్షణ కరువు
* కలెక్టర్ చొరవ తీసుకోవాలి
* కంచె ఏర్పాటు చేయాలని ప్రజల వినతి
యాచారం: కోట్లాది రూపాయల విలువైన భూములకు రక్షణ లేకుండాపోయింది. ఆక్రమణలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. భూములు మళ్లీ అక్రమార్కుల చెరలోకి వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరానికి చేరువలోని నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై సమీపంలోని యాచారం మండలంలోని పలు గ్రామాల్లో భూములు ధరలు రూ. లక్షల్లో పలుకుతున్నాయి. వీటిని పరిరక్షించే విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కాగా.. ఇటీవల రెవెన్యూ అధికారులు యాచారం, మాల్, గాడ్లగూడెం, గునుగల్, తాడిపర్తి తదితర గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి పీఓటీ యాక్టు కింద స్వాధీనపర్చుకున్నారు. కానీ ఇవి కబ్జాకు గురి కాకుండా చుట్టూ కంచె నిర్మించడంలో మాత్రం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న భూముల విలువ రూ.10 కోట్లపైనే..
తహసీల్దార్ వసంతకుమారి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక చొరవ కనబర్చారు. రూ. 10 కోట్లకు పైగా విలువ జేసే భూములను కాపాడారు. యాచారం రెవెన్యూ పరిధిలోని 242, 191, 225 సర్వే నంబర్లల్లోని రూ. 2 కోట్ల విలువైన 5 ఎకరాలు, గాడ్లగూడెంలోని సర్వే నంబర్ 300లో 2 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిలో గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకోగా 120 గజాల లోపు ఉన్న 20 మంది పేదలకు క్రమబద్ధీకరణలో సర్టిఫికెట్లు ఇప్పించారు.
మిగితా రూ. 40 లక్షల విలువైన భూమిని గుర్తించి, ఆక్రమణదారులకు హెచ్చరికలు చేశారు. తాడిపర్తి గ్రామంలోని 155 సర్వే నంబరులోని దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఎకరాకు రూ. 2 లక్షల నుంచి రూ. 3లక్షల చొప్పున డిమాండ్ ఉంది. గునుగల్ రెవెన్యూ పరిధిలో రూ. 60 లక్షలకుపైగా విలువైన ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి- మహబూబ్‌నగర్- నల్గొండ జిల్లాల సరిహద్దులోని యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామంలోని సర్వే నంబరు 640లో 16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి ధర పలుకుతోంది. ఈ భూమికి హద్దులు గుర్తించకపోవడంతో రియల్ వ్యాపారులు కబ్జాలు చేసి రూ.లక్షల్లో ప్లాట్లను అమ్ముకుంటున్నారు.
కంచెల ఏర్పాటుకు డబ్బులు లేవట..
రూ. కోట్లాది విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు వాటి పరిరక్షణకు రూ.వేలల్లో ఖర్చయ్యే కంచెల ఏర్పాటుతో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల యాచారంలో పర్యటించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇక్కడి పలు సర్వేనంబర్లలో స్వాధీనం చేసుకున్న భూముల రక్షణ నిమిత్తం కంచె ఏర్పాటుకు రూ.2 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూముల రక్షణ కోసం కంచెల ఏర్పాటుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కలెక్టర్‌కు నివేదిక పంపాం
ఆయా గ్రామాల్లో గుర్తించిన భూముల రక్షణ నిమిత్తం నిధులు మంజూరుకు కలెక్టర్‌కు నివేదిక అందజేశాం. ప్రభుత్వ భూములను రక్షించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిధులు మంజూరు కాగానే కంచెలు ఏర్పాటు చేస్తాం.
- వసంతకుమారి, తహసీల్దార్, యాచారం