గన్నవరం : కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం అందరికీ సమాన పరిహారం ఇస్తేనే తమ భూములు విమానాశ్రయ విస్తరణకు ఇస్తామని రైతులు తేల్చిచెప్పారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి గ్రామాలకు చెందిన రైతులతో నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ కావాలో, పరిహారం కావాలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు రైతులకు అంగీకార పత్రాలు పంపిణీ చేశారు. మార్కెట్ ధర ప్రకారం తమ గ్రామాల్లో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం నామమాత్రపు పరిహారం అందజేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోందని రైతులు చెప్పారు.
ప్రభుత్వం భూసేకరణ చేయనున్న గ్రామాల్లో అత్యధిక రిజిస్ట్రేషన్ ధర కలిగిన కేసరపల్లి భూములకు ఇచ్చే ఎకరానికి రూ.79 లక్షల వరకు పరిహారాన్ని మిగిలిన గ్రామాల రైతులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించిన కొంతమంది రైతులు మాత్రం తమకు తుళ్లూరులోని జరీబు రైతులకు ఇస్తున్న ప్యాకేజీని వర్తింపజేస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఈ విషయాలను ఇటీవల హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబునాయుడును కూడా కలిసి విన్నవించామని తెలిపారు.
తమ డిమాండ్‌ల మేరకు న్యాయమైన పరిహారం ఇస్తే భూసేకరణకు సహకరిస్తామని, లేనిపక్షంలో న్యాయమైన పరిహారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. విస్తరణ కారణంగా ఇళ్లు పోతున్న దళితులకు ఆర్టీసీ అకాడమీలోని ఖాళీ స్థలాన్ని గాని, వెటర్నరీ భూములు గాని కేటాయించాలని కోరారు. తహశీల్దార్ ఎం.మాధురి, వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్య, నిర్వాసిత రైతు సంఘ నాయకులు చింతపల్లి సీతారామయ్య, ముక్కామల ఉమామహేశ్వరరావు, వై.నరసింహారావు, గూడవల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.