⇒ విశాఖ మన్యంలో పోలీసుల ఘాతుకం
⇒ మావోయిస్టుల పేరుతో గుత్తికోయలు గిరిజనులపై కాల్పులు
⇒ ఒడిశాలోని తుంత ప్రాంతానికి చెందిన వేటగాళ్ల హతం
⇒ అకారణంగా చంపి, మిలీషియా సభ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం
⇒ గాయాలతో తప్పించుకున్న వ్యక్తి మాటల్లో తేటతెల్లమైన మిస్‌ఫైర్ వ్యవహారం
విశాఖపట్నం/కొయ్యూరు: అనుమానాలు నిజమయ్యాయి.. మావోయిస్టుల పేరుతో గుత్తికోయల తెగవారిని దారుణంగా కాల్చి చంపారనే విషయం స్పష్టమైంది. గాయపడిన వారిలో ఒక గిరిజనుడు పోలీసుల నుంచి తప్పించుకుని జరిగిన విషాయాన్ని బయటపెట్టాడు. నిన్నటి వరకూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది మావోయిస్టులేనని ఘంటాపథంగా చెప్పుకొచ్చిన పోలీసులు మంగళవారం మాత్రం మరణించిన వారు ఆర్మ్‌డ్ మిలీషియా సభ్యులని మాట మార్చారు. పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలేం జరిగింది?
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పుట్టకోట సమీపంలోని గడిమామిడి వద్ద ఈ నెల 21న ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిలో మడసం ముకాన్ అనే గిరిజనుడు భయంతో పారిపోయి మైనకోటకు చేరుకున్నాడు. మైనకోట ప్రాంతంలో ఒడియా తెలిసిన వారు ఉండడంతో వారికి జరిగిందంతా చెప్పాడు. ఆ వివరాలను ‘సాక్షి’ సేకరించింది. ముకాన్ చెబుతున్నదాన్ని బట్టి.. ఒడిశాలోని కోరుకొండ బ్లాక్ తుంత ప్రాంతానికి చెందిన 24 మంది వారం కిందట పుట్టకోట, మడుగకోట ప్రాంతంలో అడవి గేదెలను వేటాడేందుకు వచ్చారు. ఈ నెల 21న గడిమామిడి కాలువ సమీపంలో అడవి గేదెను వేటాడేందుకు రెండు నాటు తుపాకులతో సిద్ధపడుతుండగా పోలీసులకు తారసపడ్డారు. అంతే.. పోలీసులు కాల్పులు జరిపారు. పొడియం గంగాల్(47), మడసం గంగాల్(45) అనే వేటగాళ్లు పోలీసు తూటాలకు కుప్పకూలి అక్కడికక్కడే మరణించారు. భుజాలపై తీవ్రగాయాలైన ఇరుమాల్ పారిపోయి అదే రోజు రాత్రి పుట్టకోటకు చేరుకున్నాడు. సోమవారం ఉదయం పోలీసులు ఈ విషయం తెలుసుకొని అతడిని తీసుకెళ్లిపోయారు. నాలుగో వ్యక్తి మడసం ముకాన్‌పోలీసుల నుంచి తప్పించుకుని సోమవారం రాత్రి మైనకోట ప్రాంతానికి చేరుకున్నాడు. గాయాలతో పట్టుబడిన ఇరుమాల్ కొడుకు మల్కన్‌గిరిలో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది.
గిరిజనులే.. కానీ మిలీషియా సభ్యులు
పుట్టకోట గ్రామ అటవీ సరిహద్దు ప్రాంతంలో చనిపోయిన వారు ఒడిశా కోయజాతి వారని తెలిసిందని ఓఎస్‌డీ బాపూజీ చెప్పారు. ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలకు మంగళవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్‌పీ ఐశ్వర్య రస్తోగితో కలిసి ఓఎస్‌డీ బాపూజీ మాట్లాడుతూ పుట్టకోట సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మిలీషియా ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారని, ఆ క్యాంపులో ఒడిశా, చత్తీస్‌గఢ్, ఇతర ప్రాంతాల ఆర్మ్‌డ్ మిలీషియా సభ్యులు శిక్షణ పొందుతున్నారని సమాచారం ఉండటంతో గ్రేహౌండ్స్, సీఆర్‌ఫీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయన్నారు. ఆ సమయంలో ఆర్మ్‌డ్ మిలీషియాకు చెందిన కొంతమంది పోలీసులపై కాల్పులు జరిపారని వివరించారు. లొంగిపొమ్మని హెచ్చరించినా వారు వినకపోవడంతో ఎదురు కాల్పులు జరిపారన్నారు. సంఘటన స్థలంలో రెండు ఎస్‌బీబీఎల్ తుపాకులు, కిట్ బ్యాగులు, దళం వాడే వస్తువులు, కత్తులు, మందులతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
గిరిజనులను వేటాడారు!
Published Tue, Feb 23 2016 11:19 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement