అల్పాహారానికి వెళ్తూ..అనంత లోకాలకు! | Girl Died In Road Accident In Prakasam | Sakshi
Sakshi News home page

అల్పాహారానికి వెళ్తూ..అనంత లోకాలకు!

Published Tue, Nov 27 2018 12:59 PM | Last Updated on Tue, Nov 27 2018 12:59 PM

Girl Died In Road Accident In Prakasam - Sakshi

బ్రహ్మణి మృతదేహం

సాక్షి, వేటపాలెం: అల్పాహారానికి వెళ్తున్న బాలికను వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రామన్నపేటలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన పృధివి బ్రహ్మణి (12) సైకిల్‌పై వస్తుండగా వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో చికిత్స కోసం చీరాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. స్థానికుల, బాధితుల కథనం ప్రకారం.. రామన్నపేట శివాలయం ఎదురుగా నివాసం ఉంటున్న  పృధివి శ్రీనివాసరావు, జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి 9వ తరగతి చదువుచుండగా కుమార్తె  బ్రహ్మణి స్థానికంగా 7వ తరగతి చదువుతోంది.

ఎస్‌ఏ పరీక్షలు జరగుతుండటంతో ఉదయం ఎనిమిది గంటల సమయంలో తన సైకిల్‌పై బ్రహ్మణి పెట్రోలు బంకు సమీపంలో అల్పాహారం తెచ్చుకునేందుకు ఇంటి నుంచి పందిళ్లపల్లి–వేటపాలెం ప్రధాన రోడ్డు పక్కన సైకిల్‌పై వెళ్తోంది. వాటర్‌ ట్యాంకు సమీపంలోకి వచ్చే సరికి బాపట్ల ప్రాంతానికి చెందిన ట్రాక్టర్‌ పందిళ్లపల్లి వైపు  వేగంగా వస్తూ ఎడమ వైపు ఉన్న ఉల్లిపాయల ఆటోను క్రాస్‌ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లో సైకిల్‌పై వెళ్తున్న బ్రహ్మణిని ఢీకొట్టింది.

కింద పడిన బాలిక ఛాతీపై ట్రాక్టర్‌ చక్రం ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా బ్రహ్మణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. పక్కనున్న మృతురాలి బంధువులు మృతదేహాన్ని ఇంటికి చేర్చడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకంలో మునిగిపోయారు. ఎప్పుడూ చలాకీగా ఉండే తన కుమార్తె విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు, బంధువులు ఆ ప్రాంతం చేరడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ పాటల హోరుతో అతి వేగంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ వెంకటకృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ వెంకటకృష్ణయ్య 

2
2/2

మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement