
ప్రాణం తీసిన ఈత సరదా
వైఎస్ఆర్ జిల్లా చిన్నమండెం మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో నిర్మాణ పనులు జరుపుకుంటున్న శ్రీనివాసపురం(మండిపల్లి నాగిరెడ్డి) జలాశయంలో మునిగి ఓ బాలిక మృత్యువాత పడింది.
చిన్నమండెం (వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ జిల్లా చిన్నమండెం మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో నిర్మాణ పనులు జరుపుకుంటున్న శ్రీనివాసపురం(మండిపల్లి నాగిరెడ్డి) జలాశయంలో మునిగి ఓ బాలిక మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంనగర్ కాలనీ నుంచి జీవనోపాధి కోసం తిరుపతికి వెళ్లిన ఇడగొట్టు ఆంజనేయులు, మల్లారిల కుమార్తె సుజాత(12), కుమారుడు శ్రీనివాసులు(9)లు వారం రోజుల క్రితం వేసవి సెలవులకు సొంత ఊరు శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న నాన్నమ్మ వీరనాగమ్మ దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం వీరనాగమ్మ బేల్దారి పనులకు రాయచోటికి వెళ్లగా, మరో నలుగురు స్నేహితులు శంకర్, మీనా, మల్లిక, శ్రీనులతో కలిసి సుజాత శ్రీనివాసపురం రిజర్వాయర్‌లోకి ఈతకు వెల్లింది. అయితే ఈతకు వెళ్లిన ఐదుగురికి కూడా ఈత రాకపోవడంతో అక్కడ జరిగిన ప్రమాదంతో సుజాత నీటిలో మునిగిపోయింది, దీంతో మిగిలిన వారు గట్టుపైకి వచ్చి అరుపులుపెట్టారు. అది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మునిగిపోయిన సుజాతను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సుజాత మృతిచెందినట్లు వారు గుర్తించారు.
విషయం తెలుసుకున్న నాన్నమ్మ వీరనాగమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరైంది. సుజాత మృతదేహాన్ని స్థానికుల సహాయంతో స్వగ్రామం శ్రీరాంనగర్ కాలనీకి తీసుకొచ్చారు. తిరుపతిలో ఉన్న సుజాత తల్లిదండ్రులకు విషయం తెలిపారు. చిన్నారి బాలిక అనుకోని విధంగా మృతి చెందటంతో కాలనీ వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. విఆర్‌ఓ శ్రీనునాయక్ అక్కడికి చేరుకుని సుజాత మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే పేద కుటుంబం కావడంతో సుజాతను తిరుపతిలోని ఎంఆర్ పల్లి జడ్పీ హైస్కూల్లో చేర్చినట్లు సమీప బంధువులు తెలిపారు. సుజాత 7వ తరగతి పూర్తి చేసుకుని, వచ్చే విద్యా సంవత్సరంలో 8వ తరగతిలో చేరాల్సి ఉంది.