ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ కడప : రెక్కాడితేగాని డొక్కాడని బతుకు.. కష్టపడి తమ బిడ్డను చదివించుకుంటున్నారు. చదువులో రాణించి ఉజ్వల భవిష్యత్ పొందుతుందని కలగన్నారు. కానీ, కన్నబిడ్డ ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు నిశ్ఛేష్టులయ్యారు . పుల్లంపేటలో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. రాజంపేట పట్టణంలోని బీఎస్ హాల్ సమీపంలోని కొండపల్లి కృష్ణమోర్తి, గౌరి దంపతులు ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తమ కుమార్తె లక్ష్మీప్రసన్న పుల్లంపేట ఆదర్శపాఠశాలలో పదో తరగతి చదువుతుంటే సంబరపడిపోయారు. చదివి పెద్ద ఉద్యోగం చేస్తుందని భావించారు. కానీ లక్ష్మీప్రసన్న గత కొంతకాలంగా చురుకుగా ఉండడం లేదు. ఆరా తీస్తే స్కూలులో చదువులో మార్కులు తదితర విషయాలపై ఉపాధ్యాయుడు శివ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయేది.
సహచరి విద్యార్థినిలకు చెప్పుకొని బాధపడేది. పలు సందర్భాలలో కుమార్తెను ఓదార్చేందుకు ఆమె తల్లి ప్రయత్నించి విఫలమైంది. ఏమైందో తెలియదు.. మంగళవారం సాయంత్రం స్కూలు ముగిసిన తర్వాత ఆ బాలిక తానుంటున్న హాస్టలు గదికి చేరుకుంది. గడియ వేసుకుంది. ఒంటిపైనున్న చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత గదికి చేరుకున్న కొందరు విద్యార్థులు ఈ సంఘటన చూసి నివ్వెరపోయారు. స్కూలు వర్గాలకు చెప్పారు. కానీ అంతకుమునుపే పాఠశాలకు ఆ బాలిక తల్లి వచ్చింది. తన బిడ్డను ఓదార్చుదామని వచ్చినట్టు భోగట్టా. కానీ ఆమెను లోపలికి అనుమతించలేదు.
దీంతో బయటే ఉండిపోయింది. తీరా హాస్టలు గదిలో కుమార్తె లక్ష్మీప్రసన్న తనువు చాలించిందని తెలుసుకున్న మృతురాలి తల్లి నిర్ఘాంతపోయింది. ఇలా అర్ధాంతరంగా ప్రాణం తీసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. గుండెలవిసేలా రోదించింది. స్థలానికి రాజంపేట అర్బన్ సీఐ శుభకుమార్, పుల్లంపేట ఎస్‌ఐ వినోద్‌కుమార్, తహసీల్దార్ ఉమామహేశ్వర్, డాక్టర్ సానే శేఖర్, ఆర్‌జేడీ వెంకట కృష్ణారెడ్డి, డీఈఓ శైలజ, ఎంఈఓ రంగనాథయ్య తదితరులు చేరుకున్నారు. ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ వినోద్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment