ఆమె పేరు బంగారు లక్ష్మి.. పేరులో ఉన్న కళ.. ఆమె జీవితంలో లేకపోయింది. చదువులో బంగారమైనా.. లక్ష్మీ కటాక్షం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది. క్యాన్సర్ సోకడంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆ మహమ్మారి కారణంగా ఎడమ కాలిని తీసేశారు. ఏ రోజు కూలి పనులకు వెళ్తే.. ఆ రోజు కడుపు నింపుకునే కుటుంబం వారిది. లేకపోతే పస్తులే. తండ్రి చనిపోయాడు. తల్లి రెక్కల కష్టమే ఆ కుటుంబానికి ఆధారం. చదువు కోవాలన్న కోరిక ఉంది. అందమైన జీవనం సాగించాలన్న ఆశా ఉంది. దీనికి పేదరికమే అడ్డుగా మారింది. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తే ఆమె ప్రాణం నిలబడుతుంది. ఆమె ఆశయం నెరవేరుతుంది.
తగరపువలస(భీమిలి): పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీకి చెందిన పాండ్రంగి బంగారులక్ష్మి బంగారు భవిష్యత్‌ను క్యాన్సర్ కబలిస్తోంది. చిన్న కుటుంబం.. కలతలు లేకుం డా సాగిపోతున్న వీరి జీవన గమనంలో విధి ఆటలాడుకుంది. అయిదేళ్ల కిందట బంగారులక్ష్మి తండ్రి కృష్ణ అనారోగ్యంతో మృత్యువాత పడగా, సోదరి నాగమణి వివాహం కోసం ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తల్లి అప్పయ్యమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయ పనులకు వెళ్తూ బంగారులక్ష్మిని, కుమారుడు కృష్ణకు చదివిం చింది. బంగారులక్ష్మి ఏడో తరగతి వరకు పాం డ్రంగి యూపీ పాఠశాలలో చదువుకుని ఎనిమిదో తరగతికి గాను పద్మనాభం కేజీబీవీ పాఠశాలలో చేరింది. అప్పటికే ఒంట్లో తిష్టవేసిన బోన్ క్యాన్సర్ ఆమె ఎడమకాలిని తినేసింది. మోకాలి భాగం బాగా వాచిపోవడంతో అక్కడి వరకు కాలిని తీసేయాల్సి వచ్చింది. ఏడాది పాటు ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఆరో గ్యం తరువాత కూడా క్షీణిస్తుండటంతో ఊపిరితిత్తులకు కూడా క్యాన్సర్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు.
వర్షం పడితే జాగారమే..
గట్టిగా వర్షం పడితే ఆ రాత్రి వారికి జాగారమే. కారిపోయే ఇంటిలో తెల్లార్లూ ముగ్గురూ వర్షం ఆగేవరకు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని వేధించే ప్రభుత్వం వీరి ఇంటికి మాత్రం ఆ అవసరాన్ని గుర్తించ లేదు. రాత్రయినా, వానయినా బహిర్భూమికి వెళ్లాలంటే బంగారు లక్ష్మి ఊత కర్రలతో వ్యవసాయ భూముల్లోకి వెళ్లాల్సిందే. అందుబాటులో తల్లి ఉంటే ఆమెకు తోడుగా వెళ్తుంది.
బాధతోనే చదువు పూర్తి
క్యాన్సర్ కారణంగా శరీరానికి వచ్చిన బాధను పంటి బిగువున భరిస్తూనే 2015–2018 మధ్య రేవిడి–వెంకటాపురం ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులు పూర్తి చేసింది. పదో తరగతిలో 8.3 గ్రేడ్ పాయిం ట్లు సాధించింది. పాండ్రంగి నుంచి రేవిడి హైస్కూల్‌కు మూడు కిలోమీటర్లు ఆమె బస్సులలోనే ప్రయాణించి చదువు పూర్తి చేసింది. ఇంటర్మీడియెట్ బైపీసీలో చేరాలన్న ఆమె కోరికకు పేదరికం అడ్డంగా నిలిచింది. మరోవైపు క్యాన్సర్‌కు చికిత్స కోసం కీమో థెరపీ చేయించుకోవాలన్నా.. ఆర్థిక పరిస్థితి సహకరించక ఇంటి వద్దే దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఒకసారి కీమో థెరపీకి రూ.30 వేలు వరకు అవుతుందని వైద్యులు తెలిపారు. మరో వైపు సోదరుడు కృష్ణ డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నాడు.
తల్లి కూలికి వెళితేనే వారికి బువ్వ..
తల్లి అప్పయ్యమ్మ వ్యవసాయ పనులు ఉండి వెళ్తే వచ్చే రూ.150–200లే వారికి ఆధారం. చెరువు పనులకు వెళ్లినా రోజుకు రూ.100 వస్తుందో లేదో తెలియని అయోమయం. ఏ పనీ లేనినాడు ఆ కుటుంబానికి పస్తులే. తినడానికే కష్టంగా ఉన్న ఆ కుటుంబంలో బంగారులక్ష్మికి ఖరీదైన వైద్యం కాదు కదా.. క్యాన్సర్ కారణంగా రోజూ వెంటాడే ఒంటి నొప్పులకు మందులు కూడా కొనుక్కోలేని దయనీయస్థితిలో ఉన్నారు. అప్పయ్యమ్మ ఉదయాన్నే వంట చేసి కూలి పనులకు వెళ్లిపోతుంది. ఆమె వచ్చే వరకు బంగారులక్ష్మి ఇంటి వద్ద ఒంటరిగా బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతుంది.
చదువుకోవాలని ఉన్నా..
నాకు స్నేహితులతో కలసి చదువుకోవాలని ఉన్నా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. దీంతో పదో తరగతి తర్వాత ఇంటికే పరిమితమయ్యాను. రాత్రి వేళ వెన్ను వైపు విపరీతమైన నొప్పి వస్తుంది. ఊర్లో మందుల షాపు నుంచి మందులు కొనుక్కుని వేసుకుంటే ఆ సమయానికి నిద్ర పడుతుంది. నాలాంటి కష్టం ఎవరికీ రాకూడదు.
– పాండ్రంగి బంగారులక్ష్మి
నా కుమారుడికి దారి దొరికే వరకు..
నేను కూలికి వెళ్తేనే ఇంట్లో పొయ్యి వెలిగేది. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వరకు అప్పు ఉంది. నా కొడుకు కృష్ణ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బంగారు లక్ష్మికి వైద్యం చేయించాలన్నా.. తలకుమించి భారంగా ఉంది. పాపకు మెరుగైన వైద్యం చే యించడానికి దాతలు ముందుకు వస్తే ఆరోగ్యం స్థిమితపడి చదువుకుంటుంది. వైద్యం కోసం సాయం చేయాలనుకునే వారు పద్మనాభంలోని ఆంధ్రాబ్యాంకు ఖాతా నంబర్ 040610100100097 లేదా 79813 49907లో సంప్రదించవచ్చు.
– పాండ్రంగి అప్పయ్యమ్మ,
పాండ్రంగి, పద్మనాభం మండలం
Comments
Please login to add a commentAdd a comment