మట్టుబెడుతున్నారు!
సాక్షి, గుంటూరు: మాయమై పోతున్నడమ్మా... మనిషన్న వాడు.. అంటూ ఓ సినీకవి రాసిన పాట ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న సంఘటనలకు అద్దంపడుతోంది. ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మానవత్వం మరచి కామాంధులు చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు. ఇలాంటి ఘటన కారణంగా ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనలతో వణికిపోతున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను హతమార్చే నీచులు కొంతమందైతే... కడుపున పుట్టిన బిడ్డలను సైతం వారి విలాసాలకు అడ్డుగా మారుతున్నారంటూ మట్టుబెడుతున్నారు.
పేమించినట్లు నటించి, యువతులను మోసగించి పరారయ్యేవారు మరికొందరు. ఇలాంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నేరస్తులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్భయ చట్టాలు వచ్చినా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. జిల్లాలో ఇటీవల జరిగిన పలు సంఘటనలను పరిశీలిస్తే అసలు మానవ సంబంధాలు ఉన్నాయా.. అనే అనుమానం కలగకమానదు. ఇటీవల గుంటూరులో బాలికను మాయమాటలు చెప్పి ముంబై తీసుకె ళ్లిన ఓ కామాంధుడు లైంగికదాడి చేయబోగా కేకలువేస్తూ పరుగులు తీసింది.
ఇది గమనించిన స్థానికులు బాలికను పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమయింది. బాలిక జీవితాన్ని నాశనం చేసేందుకు యత్నించిన ఆ ప్రభుద్ధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగురోజుల క్రితం శావల్యాపురం మండలం కనవర్లపూడిలో జరిగిన హేయమైన సంఘటన సభ్యసమాజం సిగ్గుపడేదిగా ఉంది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారిని బాబాయి వరుసయ్యే వ్యక్తి తీసుకెళ్లి మరో వ్యక్తితో కలసి అత్యాచారం చేశాడు. శనివారం గ్రామ సమీపంలోని పొలాల్లో చిన్నారి విగతజీవిగా గ్రామస్తుల కంట పడింది.
మృతురాలి పెంపుడు తల్లితో నిందితుడికి ఉన్న సంబంధంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడంతో గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. తల్లిని హతమార్చిన కూతురు.. నరసరావుపేట పట్టణంలో మరో పాశవిక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువకునిపై యువతి ఫిర్యాదు చేసింది. నిందితుడిని విచారించిన పోలీసులకు కళ్లు చెదిరే నిజాలు తెలిశాయి. ఫిర్యాదు చేసిన యువతికి నిందితుడు కొడుకు వరుస అవుతాడు. అయినప్పటికీ అతనితో ప్రేమవ్యవహారం నడిపింది. మతి స్థితిమితం లేని తల్లిని, ఆమె ఉద్యోగం తనకు వస్తుందనే దురాశతో ప్రియునితో కలసి హతమార్చింది. ఇదే విషయాన్ని నిందితుడు పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. కొడుకు వరుస అయిన యువకునితో ప్రేమాయణం సాగించడమే సిగ్గుమాలిన చర్య అయితే.. ఆ మత్తులో తల్లిని చంపడం దారుణమైన సంఘటన అని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించకపోతే మరిన్ని దాష్టికాలు జరిగే ప్రమాదం ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న అనేక పరిణామాల వల్ల కొందరికి లాభం చేకూరుతుండగా, మరికొందరికి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సరిహద్దులుగా గుంటూరు జిల్లాలోని రెండు ప్రాంతాలను ఎంపికచేసి అక్కడ బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లా బోర్డర్‌లో గుంటూరు జిల్లాకు ఆనుకుని ఉన్న దామరచర్ల మండలం విష్ణుపురం, నాగార్జునసాగర్‌ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతంలోని మిర్యాలగూడ, నల్గొండ జిల్లాతోపాటు, నిజామాబాద్, హైదరాబాద్, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో బాయిల్డ్ రైస్ మిల్లులు అధికంగా ఉండటంతో ఇప్పటి వరకు జిల్లా నుంచి పీడీఎఫ్ రైస్ అధికంగా ఈ ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతున్నాయి. అడపాదడపా అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో వీటిని నిరోధించలేకపోతున్నారు.
గుంటూరు జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా రాత్రి వేళల్లో మాత్రమే నిర్వహిస్తుండటంతో అధికారులు వీటిపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటుతో వచ్చిపోయే వాహనాలకు సంబంధించి వేబిల్లులు పరిశీలించడం, సరుకును తనిఖీ చేయడం వంటివి క్షుణ్ణంగా చేపడుతున్నారు. దీంతో అక్రమ రవాణాకు చెక్ పెట్టినట్టయింది. గుంటూరులోని ఇసుక రీచ్‌ల నుంచి తెలంగాణాకు ఇసుక లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీ డ్రైవర్ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నట్లు తెలుసుకుని అతి తక్కువ ధరకు దాచేపల్లిలో ఇసుకను విక్రయించేశారు. చెక్ పోస్టుల ఏర్పాటు తరువాత చౌక బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించే వీలు కావడం లేదు.
బల్లకట్టును ఆశ్రయిస్తున్న ఆక్రమార్కులు.. బోర్డర్ చెక్‌పోస్టుల ఏర్పాటుతో అక్రమార్కులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. జిల్లాకు ఆనుకుని ఉన్న కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి బల్లకట్టు ద్వారా పీడీఎఫ్ రైస్, ఇసుకను అక్రమంగా రవాణా చేసేందుకు సమాయత్తమౌతున్నారు. బల్లకట్టు వేసే ప్రాంతం ప్రధాన రహదారుల నుంచి సుమారుగా 30 కి.మీ లోపలికి ఉండటం, ఈ ప్రాంతం చుట్టుపక్కలంతా దట్టమైన అటవీప్రాంతం కావడంతో రాత్రి వేళల్లో ఇక్కడకు వచ్చి దాడులు నిర్వహించేందుకు అధికారులు ఎవరూ ధైర్యం చేయలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అక్రమార్కులు తమ అక్రమ రవాణాకు కృష్ణానదిని సరైన రవాణా మార్గంగా ఎంచుకున్నారు.
ఇదిలా ఉండగా బల్లకట్టుపై అక్ర మ రవాణా చేయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. అవసరమైతే వారి కాంట్రాక్ట్‌ను రద్దు చేసేందుకు కూడా వెనకాడమన్నారు.