
రైతుకు దిక్కేది
సాక్షి, ఒంగోలు: ఖరీఫ్ సాగుకు పెట్టుబడుల్లేవు.. రుణాలు మాఫీ అవుతాయో, లేదోననే అనుమానం వెంటాడుతుండగా, బ్యాంకర్ల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతోన్న పథకాలు కొత్తప్రభుత్వంలో కొనసాగిస్తారా..? రద్దుచేస్తారా..? అనేది తెలియక రైతులు తికమకలో ఉన్నారు. వ్యవసాయశాఖ పథకాల అమలుకు సంబంధించి నేటి వరకు అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఏటా అమలుచేసే పథకాలైనా.. ప్రస్తుత కొత్తరాష్ట్రంలో యథాతథంగా ఉంచుతారా.. లేదా..? అనేది సందేహంగానే ఉంది.
దీనిపై రైతులు అడిగినా.. అధికారులు మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ పనులకు రైతులు కసరత్తు చేస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశిస్తే..వాతావరణం అనుకూలించి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. విత్తనాలు, ఎరువులు, జింకు, జిప్సం, జీలుగలు ఇలా అన్నిరకాల రాయితీ వస్తువులపై రైతులు దృష్టి సారిస్తారు. యంత్రలక్ష్మి, పొలంబడి, రైతుచైతన్య యాత్రల ప్రత్యామ్నాయం, క్షేత్ర ప్రదర్శనలు, తదితర కార్యక్రమాల నిర్వహణపై స్పష్టత లేదు.
జిల్లా పరిస్థితి ఇదీ..
= జిల్లావ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుం డగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది ఉన్నారు. వీరందరిలో 3 లక్షల మంది రైతులు వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లుండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్లు విలువైన రైతు రుణాలు మాఫీకావాల్సి ఉంది. అయితే, బ్యాంకర్లు మాత్రం రైతు రుణమాఫీ పథకం గడువు మీరిన బకాయిలకే వర్తిస్తుందని.. రెగ్యులర్ బకాయిల మాఫీ కుదరదని చెబుతున్నారు. దీంతో రైతులు కిందటేడాది పంట రుణాలను చెల్లిస్తేనే.. ప్రస్తుత ఖరీఫ్ సాగు పెట్టుబడికి రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
= జిల్లాలో 2010 సంవత్సరం నుంచి వరుసగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాల ధాటికి రైతులు తీవ్రంగా పంటనష్టాన్ని చవిచూస్తూనే ఉన్నారు. 2010 నవంబర్‌లో సంభవించిన ‘జల్’ తుపాను, ఆ తర్వాత ఏడాది అధిక వర్షాలు, 2011లో థానే తుపాను, అదే ఏడాది చివరన సంభవించిన కరవు పరిస్థితులు, 2012లో ‘నీలం’ తుపాను తదితర వైపరీత్యాల కారణంగా వాటిల్లిన పంట నష్టానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.68.38 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీగా విడుదల కావాల్సి ఉంది. మొత్తం 1.89 మంది బాధిత రైతులు వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
= గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతులను నియమించింది. పంటల సాగుపై అవగాహన, రుణాలు తీసుకోవడంపై బ్యాంకర్లతో మాట్లాడి సాయపడటం వంటి పనులను ఆదర్శ రైతులు చేసేవారు. అయితే, అరకొరగా ఉన్న వారి వేతనాలు పెంచి సేవలు విస్తృతపరిచి రైతులకు చేరువ చేస్తారా..లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆదర్శ రైతుల సేవలు అవసరమని అధికారులు చెబుతున్నారు.
= తాజాగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆదర్శ రైతులు, ఏవో, ఏఈవోలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఎదురు చూస్తున్నారు.
= కిందటేడాది వరకు విత్తనాలకు రాయితీ ఉంది. కొత్తగా కేంద్రం రాయితీ తొలగించడంతో అధికారులు, రైతులు అయోమయంలో పడ్డారు. కేంద్రం తొలగించినా.. రాష్ట్రం రాయితీని భరించి పథకాలను అమలు చేయాలని ..తద్వారా సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రైతుసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
= ప్రధానంగా జిల్లాలో సాగయ్యే వరి, వేరుశనగ విత్తనాల నిల్వకు కొరత ఉంది. బీపీటీ 5204 సాంబా మసూరికి ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో లేవు. ఎక్కడైనా ఉన్నా.. రైతులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి.
= పదేళ్లుగా ‘యంత్రలక్ష్మి’ పథకం పేరిట కొత్త యంత్రాలను రైతులకు చేరువ చేయడానికి ప్రభుత్వం రాయితీతో పరికరాలు అందజేస్తోంది. కిందటేడాది ఈ పథకం కింద రూ.13 కోట్లు మంజూరు చేశారు. అయితే, కేవలం రూ.4 కోట్లు మాత్రమే వినియోగించి, అధికారులు పట్టించుకోకపోవడంతో కిందటేడాది రూ.9 కోట్ల నిధులు ప్రభుత్వానికి వెనక్కు వెళ్లాయి. ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.