తెలుగును ప్రపంచ భాషగా మార్చాలి
తిరుపతి తుడా: తెలుగును ప్రపంచ భాషగా, ఆధునిక భాషగా మార్చితేనే మాతృభాషకు న్యాయం జరుగుతుందని కేంద్ర హిందీ అకాడమీ చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. దీనికోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో హైదరాబాద్ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, ఎస్‌వీయూ తెలుగు అధ్యయనశాఖ ఆధ్వర్యంలో ‘తెలుగులో లక్షణ గ్రంథాలు-సమీక్ష’ అనే అంశంపై రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహించారు.
మంగళవారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సంస్కృతం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు తప్ప తెలుగు నేర్చుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. సంస్కృతం చదివితే నూటికి నూరు మార్కులు సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఉండడం సరికాదన్నారు. ఏ భాషలకూ మనం వ్యతిరేకం కాదన్నారు. అయితే ఆంగ్ల భాష వ్యామోహంలో తెలుగును విస్మరించకూడదన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నారు. తెలుగును విస్మరిస్తే భవిష్యత్ తరాలు క్షమించవన్నారు.
ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మాతృభాష దాడికి గురవుతోందన్నారు. పవిత్ర పదాలతో భక్తి భావంగా పిలిచే అభిషేక అనంత దర్శనం, అర్చనానంత దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ, సర్వదర్శనం వంటి పదాలను మరుగున పడేసి ఏఏడీ, ఏడీ, ఎస్‌డీఎస్, టీఎంఎస్ వంటి పదాలతో పిలిచే దుస్థితిలో టీటీడీ ఉన్నతాధికారులు ఉండటం తెలుగు భాష దౌర్భాగ్యమన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు, విలువలున్న మాతృభాషకు ధార్మిక సంస్థలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమి మాజీ అధ్యక్షులు, ఎస్వీయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో 1672 భాషలు ఉన్నాయన్నారు. సాహిత్య పరంగా తెలుగు భాష అగ్రస్థానంలో ఉందన్నారు. ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య మేడసాని దేవరాజులు నాయుడు మాట్లాడుతూ వర్సిటీ పరంగా తెలుగు అభివృద్ధికి సహకారం అందించేందుకు ముందుంటామన్నారు. 29 మంది విద్యర్థులు సెమినార్‌పై పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు శరత్‌జ్యోత్స్న, మునిరత్నమ్మ, విజయలక్ష్మి, పేటశ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.