ఈతకని వెళ్లి.. మృత్యువాత
- నదిలో ‘దొంగ-పోలీస్’ ఆడుతూ ఇద్దరు విద్యార్థుల మృతి
- ఎస్‌రాయవరంలో విషాదం
ఎస్.రాయవరం: దసరా సెలవులు సందడిలో వరాహనది వద్దకు వెళ్లిన తమ పుత్రులు తిరిగిరాని తీరాలకు చేరుకోవడం ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచేసింది. చేతికందొస్తాడనుకున్న ఒక్కగానొక్క కొడుక్కి 15 ఏళ్లకే నూరేళ్లూ నిండిపోవడాన్ని ఆయా కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి. ఈత సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణాలు తీసింది.
శుక్రవారం సాయంత్రం ఎస్‌రాయవరంలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌రాయవరానికి చెందిన దుబాసి నాగవెంకట ధర్మయ్య(15) బంటు దివాకర్(15)లు స్థానిక ఉన్నతపాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులకు వీరు ఒక్కగానొక్క కొడుకులు. దసరా సెలవులు కావడంతో మరో పదిమంది స్నేహితులతో కలిసి వరాహానదిలో ఈతకొట్టేందుకు వెళ్లారు.
ఈతలో భాగంగా దొంగపోలీసు ఆడుకుంటున్నారు(ఒకరు నీటిలో మునిగి దాక్కుంటే మరోకరు కనుక్కొనే ఆట). వీరు ఆడుకుంటున్న ప్రాంతంలో గోతులు ఉండటంలో మునిగిపోయారు. ఇలా ఆడుకుంటూ నీటిలో మునిగి ప్రవాహానికి కొట్టుకుపోతున్న వీరిని మిగతా స్నేహితులు చూసి కేకలు వేశారు. స్థానికులు వచ్చి వెదకగా ధర్మయ్య మృతదేహం లభించింది. దివాకర్ కనిపించలేదు. రేవుపోలవరం నుంచి మత్య్సకారులను రప్పించి నదిలో విద్యార్థులు ఈతకొట్టిన ప్రాంతంలో రెండు గంటల పాటు గాలించాక దివాకర్ మృతదేహం కూడా దొరికింది.
తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకులు
వరాహానదిలో కొట్టుకుపోయి మరణించిన ధర్మయ్య, దివాకర్‌లు వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకులు. ధర్మయ్య తల్లిరత్నం అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. తండ్రిరాము వ్యవసాయకూలి. వీరికి ధర్మయ్యతోపాటు మరోకుమార్తె ఉంది. ఒక్కగానొక్క కొడుకు కావడంతో ధర్మయ్యను అల్లారు ముద్దుగాపెంచుకుంటున్నారు. ప్రయోజకుడవుతాడనుకున్న తరుణంలో ఇలా అకాలమృత్యువాతపడతాడని ఊహించలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. తలకొరివి పెట్టాల్సిన వాడికే కొరివిపెట్టే దౌర్భాగ్యమంటూ రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది.
దివాకర్‌దీ అదేపరిస్థితి: దివాకర్‌కూడా ఒక్కగానొక్కకొడుకు. తండ్రి శ్రీను దినసరి కూలీ. మైహోం సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. త ల్లిలక్ష్మి గృహిణి. వీరికి రెండో సంతానంగా దివాకర్ జన్మించాడు. తాము పడుతున్న కష్టం కొడుకు పడకూడదనే చదివిస్తున్నానని, స్నేహితులతో కలిసి వెళ్లినవాడు తిరిగి రాని లోకాలకు చేరుతాడని ఊహించలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
హృదయవిదారకంగా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఆడే పాడే వయసులో గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఇలా మృత్యువాత పడడం ఎస్.రాయవరం గ్రామస్తులను కలచివేసింది. అప్పటిదాకా కళ్లముందు ఆటలాడిన వారి మృతిని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.