పండుగకు వెళ్లి శవమయ్యాడు
Published Sat, Mar 18 2017 3:44 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
► యువకుడి అనుమానాస్పద మృతి
► కుమారుడిని చంపేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
విశాఖపట్నం : స్నేహితులతో కలిసి పండుగకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ కుమారుడి మృతికి కొంత మంది యువకులే కారమణమని తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని పెందుర్తిలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసుల కథనం ప్రకారం... స్థానిక ద్రోణంరాజునగర్ కాలనీలో నివాసముంటున్న మీసాల అప్పారావు, అప్పలకొండ దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు దామోదర్ అలియాస్ దమ్ముఅలియాస్ జానీ(27) స్థానికంగా బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఈ క్రమంలో పెందుర్తి, చినముషిడివాడ, కృష్ణరాయపురం ప్రాంతాల్లో బాక్సింగ్ వచ్చిన యువకులతో సన్నిహితంగా ఉండేవాడు. కొన్నాళ్ల కిందట దామోదర్ స్నేహితులకు, మరికొంత మంది బాక్సర్లకు కొట్లాట జరిగింది. అనంతరం ఆ గొడవలు సద్దుమణిగాయి. ఇదిలా ఉండగా గురువారం రాత్రి వేపగుంటలో జరిగిన పండుగకు దామోదర్ తన స్నేహితులతో ఆటోలో వెళ్లాడు. ఇంతలో రాత్రి పది గంటల సమయంలో కృష్ణరాయపురంలో జరిగిన ప్రమాదంలో దామోదర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన వారు ఘటానాస్థలికి చేరుకోగా అక్కడ ప్రమాదం ఆనవాళ్లు అంతగా లేవు. దామోదర్ ఒంటిపై గాయాలు, నోట్లో నురగ వచ్చినట్లు గుర్తించారు. దీంతో దామోదర్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇది వరకే పాతకక్షలు ఉండడంతో ఏడుగురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి కోసం కొందరు యువకులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఫోన్లు చేశారని చెబుతున్నారు. దామోదర్ కూడా ఉదయం నుంచి ఆందోళనగా ఇంట్లోనే ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫోన్లు చేసిన యువకులను విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని వారు కోరుతున్నారు.
పీఎస్ వద్ద ఆందోళన
దామోదర్ మృతదేహాన్ని గురువారం రాత్రి కేజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం పెందుర్తి తీసుకువచ్చిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దామోదర్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ పెందుర్తి పోలీస్‌స్టేషన్, నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డును దిగ్బంధించి దామోదర్ మృతికి కారణమైన వాళ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీఐ మురళి రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Advertisement