అనంతపురం కల్చరల్/టౌన్, న్యూస్‌లైన్ : దేవుడి మాన్యాలు అన్యాక్రాంతమయ్యాయి. కోట్లాది రూపాయలు విలువచేసే భూములు రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. మాన్యాలను పరిరక్షించాల్సిన అధికారులు నేతలకు దాసోహం అంటున్నారు.
ఫలితంగా దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండాపోతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు 36 ఉండగా వీటికి సంబంధించి సుమారు 31 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటితో పాటు దేవాదాయశాఖ ఆధీనంలో లేని దేవాలయాలకు చెందిన భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. రోజూ లక్షలాది రూపాయలు ఆదాయం వస్తోంది. ఎంత ఆస్తి ఉన్నా రోజూ ధూప, దీప నైవేద్యాలు మాత్రం కరువయ్యాయి.
పెన్నోబులేసుడికి పంగనామాలు
ఉరవకొండ నియోజకవర్గంలోని పెన్నహోబిలం లక్ష్మినరసింహస్వామికి సుమారు 12,600 ఎకరాల భూమి ఉంది. వీటి విలువ వందల కోట్లలోనే ఉంటుంది. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయం నామమాత్రమే. రూ.కోట్లు విలువ చేసే 600 ఎకరాలను స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు కబ్జా చేశారు.
మిగిలిన భూములపై కూడా కొన్నేళ్లుగా ఒకే వర్గానికి చెందిన వారు గుత్తాధిపత్యం చలాయిస్తున్నారు. నిబంధనల మేరకు స్వామి భూములకు ప్రతి ఏటా వేలం పాట నిర్వహించాలి. నియోజకవర్గంలోని కోనాపురం, మోపిడి, ఇంద్రావతి, చిన్నముష్టూరు, పెద్ద ముష్టూరు, ఆమిద్యాల తదితర గ్రామాలకు చెందిన రైతులు వేలం పాటలో పాల్గొనవచ్చు. అయితే స్థానిక ఎమ్మెల్యే అండదండలతో 17 ఏళ్లుగా భూములకు వేలం నిర్వహించలేదంటే స్వామి ఆస్తులు ఎంతగా అన్యాక్రాంతమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పినట్లే దేవాదాయశాఖ అధికారులు నడుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు
కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి దాదాపు 83 వేల ఎకరాలు ఆలయ మాన్యం ఉంది. కదిరి రూరల్, గాండ్లపెంట, తలుపుల, ఎన్.పి.కుంట తదితర మండలాల్లో దేవుని భూములు విస్తరించి ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయో.. ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియడం లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఉన్న భూముల్లో సగం వాటికి మాత్రమే ప్రతి సంవత్సరం వేల పాటలు నిర్వహించి కౌలుకు ఇస్తున్నారు. మిగులు భూమిని మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఏమని ప్రశ్నిస్తే నీటి వనరులు పుష్కలంగా లే కపోవడంతో రైతులు ముందుకు రాలేదని సమాధానంగా చెబుతున్నారు. అధికారులు చెబుతున్న దానిలో కొంతమేర వాస్తవం ఉన్నా దాదాపు 20 ఎకరాలకు పైగా భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
నెట్టికంటి స్వామిదీ ఇదే పరిస్థితి
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి 321.38 ఎకరాలు ఉంది. ఇందులో 115 ఎకరాలు మాత్రం కసాపురం గ్రామ పరిధిలో ఉండగా మిగతా భూమి ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, కొనకొండ్ల, పొలికి, విడపనకల్లు, కర్నూలు జిల్లాలోని చిప్పగిరి, మొలగవెల్లి, ఖాజీపురం, కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ తదితర గ్రామాల్లో విస్తరించి ఉంది.
అయితే కసాపురం గ్రామం పరిధిలో ఉన్న ఆస్తుల నుంచి స్వామికి ఆదాయం వస్తున్నా ఇతర ప్రాంతాల్లో నుంచి స్వామికి పెద్దగా ఆదాయం రావడం లేదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే దేవుడి ఆస్తుల పరిరక్షణపై ఆలయ క మిటీ శ్రద్ధ చూపడం లేదని స్పష్టమవుతోంది.
‘అనంత’లో దేవుడి భూములు కబ్జా
జిల్లా కేంద్రంలో దేవుని భూములు కబ్జాకు గురయ్యాయి. వందల కోట్లు విలువ జేసే భూములు పరాధీనంలోకి వెళ్లిపోయాయి. జిల్లా కేంద్రంలో పురాతన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అందులో పాతూరులోని పేట బసవేశ్వరుని ఆలయం, విరూపాక్షాశ్వేరాలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, సుభాష్‌రోడ్‌లోని వేణుగోపాల స్వామి ఆలయాలు ప్రముఖమైనవి. పాతూరులోని పేట బసవేశ్వరుని ఆలయానికి వందల సంవత్సరాల చరిత్రతో పాటు వందల కోట్లు విలువజేసే ఆస్తులు ఉన్నాయి. పాతూరులోని సున్నంగేరి నుండి సంగమేశ్ నగర్ వరకు ఈ ఆలయ భూములున్నట్టు ఆలయ చరిత్ర చెబుతోంది.
ప్రస్తుతం ఆస్తులు కబ్జాకు గురై వాటిలో వ్యాపార సముదాయాలు, గృహ నిర్మాణాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. సర్వేనెంబర్ 178/2లో ఉన్న ఒక ఎకరా 46 సెంట్ల భూమిలో ప్రస్తుతం ‘తారక రామారావు’ కాలనీ వెలసింది. ప్రాచీన చెన్నకేశవాలయానిది మరో దుస్థితి. 18వ వార్డు నీరుగంటి వీధి 2081/9 సర్వే నంబర్‌లో దాదాపు 64 సెంట్లు, 20వ వార్డు అంబారపు వీధిలోని 2097/6 సర్వే నంబర్‌లో ఉన్న 68 సెంట్లు ఆలయ భూమి కబ్జాకు గురైంది. ఆలయానికి సంబంధించి ఒకప్పుడు జిల్లాలో దాదాపు 64 సత్రాలు ఉండేవని రికార్డులు చెపుతున్నా అవి ప్రస్తుతం నామారూపాలు లేకుండా పోయాయి.
అన్యాక్రాంతం
Published Fri, Jan 17 2014 2:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement