ఎలా దున్నాలి ?
అనంతపురం అగ్రికల్చర్ : సమస్యాత్మకంగా ఉన్న భూములను సాగుకు సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీఏ పి.రామేశ్వరరెడ్డి సూచిస్తున్నారు. ఖరీఫ్ పంటలు సాగు చేసే ముందు పంట పొలాలను అన్ని విధాలా సిద్ధం చేసుకోవాలంటున్నారు. ఎలాంటి నేలల్లో ఎలా దున్నాలో వివరిస్తున్నారు.
వాలు ఎక్కువగా ఉంటే : ఇలాంటి భూముల్లో నేలకోత అధికంగా ఉంటుంది. భూసారం తగ్గిపోతుంది. నీటి నిల్వ శక్తి తగ్గి బెట్ట పరిస్థితులు త్వరగా ఏర్పడటంతో పంట దిగుబడులు తగ్గుతాయి. వాలు ఉన్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూరు సేద్యం చేయాలి. అలాగే పంట సాగు చేసిన మూడు నుంచి నాలుగు వారాల తర్వాత పెద్ద నాగలితో ప్రతి 3.5 మీటర్లకు వర్షపు నీరు సంరక్షణకై గొడ్డుసాలు (తల్లిచాలు) దున్నుకోవాలి. వాలు తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే కాంటూరు గట్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ గట్లు వర్షపు నీటి వేగాన్ని ఆపి నేలలో నీటి నిల్వను పెంచుతాయి. వీటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రతి మీటరు నిలువుకు ఒక గట్టును నిర్మించాలి. అలాగే వట్టివేరు లాంటి గడ్డి మొక్కలతో జీవగట్లను కూడా కాంటూరు గట్లకు బదులుగా వాడవచ్చు.
లోతు తక్కువగా ఉంటే : ఈ నేలల్లో వేసిన పంటలకు సంబంధించి మొక్కల వేర్లు పెరుగుదల తగ్గి, నీరు, భూసారం పరిమితంగా ఉండటంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడంలో భాగంగా వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. ఒక మీటరు దూరంలో కనీసం మూడేళ్లకోసారి లోతుగా దున్నాలి. పశువుల ఎరువు ఇతరత్రా సేంద్రియ పోషకాలు అధికంగా వేయాలి.
నీటి నిల్వ శక్తి తక్కువ కలిగిన భూములు : ఇలాంటి భూముల్లో ఇసుక శాతం అధికంగా, బంకమన్ను శాతం 20 కన్నా తక్కువగా ఉంటుంది. దీని కోసం ఎకరాలకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలాలి. చెరువు మట్టి పొలంలో కలవడం వల్ల బంకమన్ను శాతం పెరిగి భూమికి నీటిని మరియు పోషక పదార్థాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
గట్టి పొర ఉంటే : భూముల్లో పైన గట్టి పొర ఉంటుంది. దాని కింద మామూలు మట్టి ఉంటుంది. దీని కోసం పెద్ద ట్రాక్టర్‌తో లోతుగా దున్నే నాగళ్లతో లేదా సబ్‌సాయిలర్ లేదా చిసిల్ నాగళ్లతో పొలాన్ని దున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు.
మాగాణులు : వరి కోతలు తర్తాత అందులో అరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెల్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పైరు సరిగా మొలకెత్తలేదు. మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. దీని నివారణకుæ భూముల్లో మొదట మామూలుగా నాగళ్లతో దున్నిన తర్వాత రోటోవేటర్ లేదా పల్లదంతితో తేలికగా దున్నితే పెద్ద పెల్లలు పగిలి అరుతడి పంటలకు అనువైన దుక్కి వస్తుంది.
సున్నపు నేలలు : వీటిని గుర్తించడానికి 1 :4 నిష్పత్తిలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం, నీరు కలిపి ఒక చుక్క మిశ్రమాన్ని మట్టిపై వేసినపుడు బుసబుసమనే నురగ వస్తే సున్నం అధికంగా గల నేలగా గుర్తించవచ్చు. ఈ నేలల్లో భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యం తక్కువగా ఉండటమే గాక సూక్ష్మ పోషక పదార్థాలైన జింకు, ఇనుము, మాంగనీస్, రాగి లోపాలు ఉంటాయి. ఎకరాకు 4 టన్నులు పశువుల ఎరువు వేసి పంట నష్టాన్ని తగ్గించవచ్చు. జనుము, జీలుగను పచ్చిరొట్ట పైర్లగా పెంచి నేలలో కలియదున్ని మురిగేలా చేస్తే సున్నపు సమస్య తగ్గుతుంది.